మందుబాబులకు కిక్కు మామూలుగా ఉండదంతే !

ఏపీలో వైసీపీ అధికారం నుంచి పోవాలని అందరి కంటే ఎక్కువగా కోరుకున్నది మందుబాబులే అంటారు.

Update: 2024-09-16 03:55 GMT

ఏపీలో వైసీపీ అధికారం నుంచి పోవాలని అందరి కంటే ఎక్కువగా కోరుకున్నది మందుబాబులే అంటారు. వారు తన కన్నీరును మందులో కలుపుకుని అయిదేళ్ళ పాటు తాగలేక తాగారు అని అంటారు. ఎందుకంటే నాసిరకం మద్యం, దాంతో పాటు తెలియని బ్రాండ్లు ధరలు చూస్తే ఠారెత్తించేలా ఉండడంతో ఇదేమి మందు జీవితం రా బాబూ అనుకుంటూ అరవై నెలల పాటు గడిపారు.

తమ వ్యసనాన్ని ఆపుకోలేక చేదు మందు తాగినట్లుగా ముక్కు మూసుకుని తాగుతూ కిక్కు ఇవ్వకుండానే జేబులు చిల్లులు పెట్టుకుంటూ చాలా చేశారు. వారికి మందు ఖర్చు నెలసరి చూస్తే చాలానే అయిపోయింది. తమ కష్టమంతా అలా పోయింది, పైగా కావాల్సిన మందు సుఖం దక్కలేదు అన్న ఫీలింగ్ తో వారు వైసీపీ మీద బాటిల్ లోతు కోపాన్ని పెంచేసుకున్నారు.

అది ఎన్నికల వేళ కసిగా కక్కేసారు. ఎన్నికల టైం లో చంద్రబాబు ఇచ్చిన అనేక హామీలలో మందుబాలకు కిక్కిక్కించే హామీ కూడా ఉంది. నాణ్యమైన మందు కారు చవకగా మీరు కోరిన బ్రాండ్లలో అంటూ టీడీపీ నేతలు చంద్రబాబు ఇచ్చిన హామీలు మందు బాబులకు యమ హుషారు తెచ్చెసాయి.

దాంతో వారు ఎపుడెపుడా అని ఎదురు చూస్తున్నారు. ఆ రోజు ఆ శుభ ఘడియలు తొందరలో రాబోతున్నాయి. ఈసారి దసరాతో మందు బాబులకు ప్రతీ రోజూ దసరావే. ప్రతీ సమయం సరదాయే అని అంటున్నారు. ఎందుకంటే ఈ నెల 18న ఏపీ మంత్రివర్గం సమావేశం అయి ఏపీలో కొత్త లిక్కర్ పాలసీకి ఆమోద ముద్ర వేస్తుంది. దాని మీద ఏర్పాటు చేసిన మంత్రి వర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదికను కూడా ఆమోదిస్తుంది.

దీని ప్రకారం చూస్తే తెలంగాణా, కర్ణాటక రాష్ట్రాలలో కంటే కూడా ఏపీలో తక్కువ ధరలు ఉండేలా మద్యం పాలసీని ఏపీ ప్రభుత్వం తీసుకుని రాబోతోంది అని అంటున్నారు. అంతే కాదు 2019 కంటే ముందు ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు ఏ విధంగా మద్యం పాలసీని రూపొంచారో దాదాపుగా అదే పాలసీని ప్రవేశపెడుతున్నారు అని అంటున్నారు.

ఈ పాలసీ ప్రకారం చూస్తే అన్ని రకాల మద్యం బ్రాండ్లూ ఏపీలో ఇక మీదట కనిపించనున్నాయి. అంతే కాదు తక్కువ ధరలు నాణ్యమైన మందుతో లభిస్తాయి. ఇది నిజంగా మద్యం బాబులకు కిక్కెక్కించే వార్త అని అంటున్నారు. ఈ కొత్త లిక్కర్ పాలసీని అక్టోబర్ 1 నుంచి ఏపీలో అమలు చేయనున్నారు.

సో తాగినంత వారికి తాగుడే మరి. అంతే కాదు నచ్చిన బ్రాండ్ తో సహా హ్యాపీగా తాగొచ్చు. వైసీపీ ప్రభుత్వంలో పెట్టిన డబ్బుతో రెండు బాటిల్స్ అయినా ఈ కొత్త పాలసీ ద్వారా మందు బాబులు కొనుక్కోవచ్చు. అంటే జేబుకు చిల్లు పడకుండా కిక్కు బాగుండేలా టీడీపీ కూటమి తెస్తున్న పాలసీ ఉంటుంది అన్న మాట.

ఇక 2024 ఎన్నికల్లో ఒక రెండు శాతం ఓట్లు మందు బాబులవే కూటమికి పడ్డాయని ఒక విశ్లేషణ ఉంది. ఇపుడు ఆ రెండు శాతం ఓట్లు పదిలం చేసుకునేలా ఈ లిక్కర్ పాలసీ ఉంటుందని అంటున్నారు. సో గుడ్ లక్ టూ లిక్కర్ బాబులూ అని అంటున్నారు అంతా.

Tags:    

Similar News