అడకత్తెరలో 'ఆరోగ్య శ్రీ'.. 2500 కోట్ల బకాయిలు!
పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని చేరువ చేయాలన్న సమున్నత లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకువ చ్చిన ప్రతిష్టాత్మక పథకం ఆరోగ్య శ్రీ
పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని చేరువ చేయాలన్న సమున్నత లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకువ చ్చిన ప్రతిష్టాత్మక పథకం `ఆరోగ్య శ్రీ`. దీనిని ఆయన ఉన్నప్పుడు కంటికి రెప్పలా కాపాడుకున్నారు. పేదలకు గుండె పోటు, కిడ్నీ సమస్యలు ఇతరత్రా పెద్ద రోగాలు వస్తే.. వారిని కార్పొరేట్ ఆసుపత్రులకు పంపించి ఆరోగ్య శ్రీ కింద వైద్యం అందించారు. దీనికి ప్రజల్లో ఎంతో స్పందన లభించింది. నేటికీ వైఎస్ పేరు పేదల ఇళ్లలో వినిపించడానికి ఈ పథకమే కారణమని అంటారు. అయితే.. తర్వాత వచ్చిన ప్రభు త్వాలు కూడా కొనసాగించాయి. అయితే.. అవి నామమాత్రంగా కార్యాచరణ రూపొందించుకుని.. ఉందంటే ఉంది! అన్నట్టుగానే వ్యవహరించారు.
ఏపీలో వైఎస్ వారసుడిగా 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ కూడా ఆరోగ్య శ్రీకి ప్రాదాన్యం ఇచ్చారు. అప్పటి వరకు ఉన్న 550 రోగాల స్థానంలో ఏకంగా 2400 రోగాలను చేర్చారు. కరోనాను కూడా ఆరోగ్య శ్రీలో చేర్చారు. అంతేకాదు.. ఆసుపత్రుల పరిదిని కూడా పెంచారు. అయితే.. ఆర్థిక సమస్యల కారణంగా కార్పొరేట్ వైద్య శాలలకు చెల్లించాల్సిన మొత్తంలో బకాయిలు పడుతూ వచ్చారు. అయితే.. ఎప్పటికప్పుడు ప్రైవేటు సంస్థల యాజమాన్యాలు ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడం.. నిధులు సమకూర్చుకోవడం తెలిసిందే. అయితే.. 2023, సెప్టెంబరు వరకు కూడా తమకు బకాయిలు లేకుండా సర్కారు చూసిందని తాజాగా యాజమాన్యాలు వెల్లడించాయి.
అయితే.. ఈఏడాది ఎన్నికలు జరిగే సమయానికి 1750 కోట్ల రూపాయల మేరకు సర్కారు ఆయా నెట్ వర్క్ ఆసుపత్రులకు బకాయిలు చెల్లించాల్సి వచ్చింది. అయితే.. అప్పటికే కోడ్ వచ్చిన నేపథ్యంలో సర్కారు తప్పుకొన్నా.. అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కనీసంలో కనీసం 500 కోట్ల రూపాయలను చెల్లిస్తామని హామీ ఇచ్చారు. కానీ, ఆయన కూడా నిధులు విడుదల చేయలేదు. ఇంతలో సర్కారు మారిపోయింది. ఇక, ఆ బకాయిలకు తోడు ఇప్పుడు జరిగిన రెండు మాసాల కాలానికి ఏర్పడిన బకాయిలు కలిపితే.. మొత్తంగా 2500 కోట్ల రూపాయల మేరకు ప్రభుత్వం నుంచి తమకు నిధులు అందాల్సి ఉందని ఆసుపత్రులు చెబుతున్నాయి.
ఇంత భారీ స్థాయిలో బకాయిలు పేరుకుపోయిన దరిమిలా.. తాము సేవలు అందించే పరిస్థితి లేకుండా పోతోందని ఆసుపత్రులు చెబుతున్నాయి. ప్రస్తుత కూటమి సర్కారు తమ ఆవేదనను సైతం ఆలకించడం లేదని పేర్కొంటున్నాయి. అంతేకాదు.. తమకు బకాయి ఉన్న 2500 కోట్లను ఇవ్వాలని కోరితే రూ.160 కోట్ల మేరకు విడుదలకు ప్రతిపాదనలు సిద్ధం చేసిందని ఇది దారుణ పరిస్థితి అని యాజమాన్యాలుపేర్కొంటున్నాయి. దీనివల్ల సూది, దూది కూడా కొనే పరిస్థితి లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. పేదలకు మెరుగైన వైద్యం అందించడంలో 24 గంటలు కృషి చేస్తున్నా..తమకు గుర్తింపు లేకుండా పోయిందని అంటున్నాయి. ఈ నేపథ్యంలో సేవలు అందించలేమని తేల్చి చెప్పాయి.
ప్రభుత్వం మౌనం వెనుక..
అయితే.. కూటమి సర్కారు మౌనానికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. 1) అసలు ఈ ఆరోగ్య శ్రీని అమలు చేయకుండా నిలిపివేయడం. తద్వారా.. కేంద్రం ఇస్తున్న ఆయుష్మాన్ భారత్ కార్డులను పేదలకు అందించాలని నిర్ణయించుకోవడం. దీనిపై ఇప్పటికే కేంద్ర మంత్రి చంద్రశేఖర్ పెమ్మసాని కూడా కీలక ప్రకటన చేశారు. 2) ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో ఆసుపత్రులకు బిల్లులు చెల్లించలేనిపరిస్థితి నెలకొనడం. దీంతోనే ఆరోగ్య శ్రీ పథకం అడకత్తెరలో పడిందని తెలుస్తోంది. మరి చివరకు ఏం చేస్తారో చూడాలి.