టీడీపీ జనసేనలో తెనాలి పంచాయతీ తేలలేదా..?

ఇక తెనాలి నాదెండ్లకు ఎలా సొంత సీటు అయింది అంటే ఆయన తండ్రి నాదెండ్ల భాస్కరరావు 1989లో ఇదే సీటు నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచారు

Update: 2023-11-12 03:00 GMT

ఉమ్మడి గుంటూరు జిల్లాలోని తెనాలి సీటు స్వీట్ గా ఉంది. ఈ సీటు కోసం టీడీపీలో మాజీ మంత్రి ఆలపాటి రాజా అలియాస్ రాజేంద్రప్రసాద్ తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. జనసేనతో పొత్తు ఖరారు కావడంతో జనసేనలో నంబర్ టూ గా ఉన్న మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఈ సీటు మీద కన్నేశారు. ఆయన 2004, 2009లలో తెనాలి నుంచి రెండు సార్లు కాంగ్రెస్ తరఫున గెలిచారు.

ఇక తెనాలి నాదెండ్లకు ఎలా సొంత సీటు అయింది అంటే ఆయన తండ్రి నాదెండ్ల భాస్కరరావు 1989లో ఇదే సీటు నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచారు. ఆ తరువాత 2004లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మనోహర్ ఈ సీటుని ఎంచుకున్నారు. అయితే ఆయన కాంగ్రెస్ నుంచి 2014లో పోటీ చేసినా ఓటమి పాలు అయ్యారు. 2019లో జనసేనలో చేరి పోటీ చేస్తే మూడవ ప్లేస్ వచ్చింది. ముప్పయి వేల దాకా ఓట్లు వచ్చాయి.

ఇక టీడీపీ విషయానికి వస్తే తెనాలి ఆ పార్టీకి కంచుకోట లాంటి సీటు. 1983 నుంచి చూసుకుంటే ఇప్పటికి అయిదు సార్లు గెలిచింది. కాంగ్రెస్ మూడు సార్లు గెలిస్తే వైసీపీ ఒక్కసారి గెలిచింది. గెలిచిన ప్రతీ సారీ టీడీపీకి భారీ మెజారిటీలే దక్కాయి. ఇక కాంగ్రెస్ మూడు సార్లు గెలిస్తే ఒకసారి నాదెండ్ల భాస్కరరావు, రెండు సార్లు మనోహర్ ఆ విజయాలను సాధించారు.

ఇక పొత్తుల కంటే ముందే పవన్ కళ్యాణ్ మనోహర్ ని తెనాలి నుంచి పోటీ చేస్తారని ప్రకటించారు. ఇక ఆలపాటి రాజా మరోసారి గెలిచి మంత్రి కావాలని చూస్తున్నారు. అయితే పొత్తులలో కచ్చితంగా ఈ సీటు తనదే అని నాదెండ్ల భావిస్తున్నారు అని అంటున్నారు. దీంతో ఆలపాటు రాజా అనుచరులలో అయితే అసంతృప్తి ఉంది అని అంటున్నారు.

చూస్తే 2019 ఎన్నికల్లో కూడా టీడీపీ టఫ్ ఫైటింగ్ ఇచ్చిందని ఆలపాటి రాజాకు ఏకంగా 77 వేల దాకా ఓట్లు వచ్చాయని గుర్తు చేస్తున్నారు. 2014లో అయితే ఆలపాటి రాజా 93 వేల 500 కి పైగా ఓట్లు సాధించారని దాదాపుగా ఇరవై వేల మెజారిటీతో వైసీపీని ఓడించారని గుర్తు చేస్తున్నారు.

ఇక్కడ మరో తమాషా కూడా ఉంది. 2009లో మనోహర్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే ఆలపాటి రాజా టీడీపీ నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో నాదెండ్ల కేవలం 2,884 ఓట్ల మెజారిటీతో మాత్రమే గెలిచారు అని గుర్తు చేస్తున్నారు. అంతలా టఫ్ ఫైట్ ఇచ్చిన ఆలపాటి రాజాకి తెనాలిలో పట్టుందని ఆయనకే టికెట్ ఇవ్వాలని ఆయన వర్గం కోరుతోంది.

ఇక జనసేనకు టికెట్ ఇచ్చినా టీడీపీ క్యాడర్ పూర్తిగా సహకరిస్తేనే విజయం సాధ్యపడుతుంది అని అంటున్నారు. మరి టీడీపీలో ఆలపాటి రాజా వర్గం నాదెండ్లకు సహకరిస్తుందా అన్నది చూడాలని అంటునారు. ఆలపాటి రాజాను ఎంపీగా పోటీ చేయమని అంటున్నారని అంటునారు. ఇక జనసేన టీడీపీ ప్రభుత్వం వస్తే నాదెండ్ల మనోహర్ మంత్రి అవుతారు. అపుడు తెనాలిలో తమ పట్టు పోతుంది అన్న కలవరం కూడా రాజా అనుచరులలో ఉంది అని అంటున్నారు. పై స్థాయిలో అంతా ఓకేగా ఉన్నా దిగువన మాత్రం సరిగ్గా అవగాహన కుదరకపోతే మాత్రం ఇబ్బందే అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News