అనకాపల్లి వైసీపీకి కాపు కాసేది ఆయనేనా...!?

ఉమ్మడి విశాఖ జిల్లాలో రాజకీయంగా అత్యంత చైతన్యవంతమైన నియోజకవర్గం అనకాపల్లి అని చెప్పాలి

Update: 2023-12-19 01:30 GMT

ఉమ్మడి విశాఖ జిల్లాలో రాజకీయంగా అత్యంత చైతన్యవంతమైన నియోజకవర్గం అనకాపల్లి అని చెప్పాలి. ఇక్కడ ప్రజలు ప్రతీ ఎన్నికలోనూ విలక్షణమైన తీర్పునే ఇస్తారు. ఇదిలా ఉంటే 2004లో ఇక్కడ కాంగ్రెస్ గెలిస్తే 2009లో ప్రజారాజ్యం గెలిచింది. 2014లో టీడీపీ గెలిస్తే 2019లో వైసీపీ గెలిచింది. అంటే గత రెండు దశాబ్దాలుగా చూసుకుంటే గెలిచిన పార్టీ మరోసారి గెలవడంలేదు అని అర్ధం అవుతోంది.

అయితే వై నాట్ 175 స్లోగన్ తో ముందుకు పోతున్న వైసీపీ అనకాపల్లి మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది. అనకాపల్లికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గుడివాడ అమరనాధ్ మంత్రిగా సైతం కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన ఎంపీగా పోటీ చేయాలని పార్టీ అధినాయకత్వం ఆదేశిస్తోంది అని వార్తలు వినిపిస్తున్నాయి.

దాంతో అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన యువకుడిని మంత్రి సిఫార్సుతో అధినాయకత్వం ఎంపిక చేయనుంది అని ప్రచారం అయితే సాగుతోంది. అనకాపల్లిలో వ్యాపార వాణిజ్య పరంగా పేరున్న మలసల భరత్ ని తెర మీదకు తీసుకుని వస్తున్నారు. వైసీపీ యువజన విభాగంలో కీలకంగా ఉన్న భరత్ కి టికెట్ దక్కే చాన్స్ మెండుగా ఉందని అంటున్నారు.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కలసి పోటీ చేస్తాయని తేలిన నేపధ్యంలో అనకాపల్లిలో ఆ కూటమిని తట్టుకునేందుకు వైసీపీ తెలివైన ఎత్తుగడతో భరత్ ని అభ్యర్ధిగా ప్రకటించే అవకాశం ఉంది అని అంటున్నారు. అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో గవరలు, కాపులు పెద్ద సంఖ్యలో ఉన్నారు.

ఇక గెలుపు కూడా ఒకసారి గవర సామాజిక వర్గానికి దక్కిందే మరోసారి కాపులకు దక్కుతోంది. అలా 1999 నుంచి చూస్తే ఇదే జరుగుతూ వస్తోంది. ఇదిలా ఉంటే కాపు సామాజికవర్గానికి చెందిన మంత్రి ఎంపీగా నిలబడుతూ తన కమ్యూనిటికే చెందిన యువనేతను వారసుడిగా వచ్చే ఎన్నికల్లో పోటీకి సిఫార్సు చేశారని అంటున్నారు. దీని వల్ల జనసేన టీడీపీ కంబోని తట్టుకోవడం సాధ్యపడుతుందని కూడా భావిస్తున్నారు.

ఇక అంకాపల్లి టికెట్ టీడీపీకి ఇస్తారని అంటున్నారు. గవర సమాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ కానీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా నాగజగదీశ్వరరావు కానీ ఆ పార్టీ తరఫున పోటీలో ఉంటారని అంటున్నారు. దాంతో టీడీపీ గవర సామాజిక వర్గం అభ్యర్ధిని పోటీకి దించుతుందని తెలిసి వైసీపీ కాపు సామాజికవర్గం నుంచి అభ్యర్ధిని డిసైడ్ చేస్తోంది అని అంటున్నారు.

మరో వైపు చూస్తే ఇదే సీటు కోసం మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కుమారుడు దాడి రత్నాకర్ ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో మాజీ మంత్రి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు అని ప్రచారం సాగుతోంది. ఇక మంత్రికి మాజీ మంత్రికీ మధ్య గ్యాప్ ఉందని వార్తలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో కాపు కార్డుతో వైసీపీ ముందుకు వస్తోంది అని తెలుస్తోంది. ఈ పరిణామంతో పాటు రాజకీయంగా యువతను ప్రోత్సహించాలన్న వైసీపీ ఆలోచన కూడా కలిపి తెరపైకి భరత్ వచ్చారని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News