జగన్...బాబు...పవన్ : ఎవరికి ఎక్కువ మెజారిటీ వస్తుందో...!?
ఏపీలో ఏ పార్టీకి అధికారం దక్కుతుందో ఇంకా తెలియడంలేదు. ఓటర్ల నాడి అయితే ఇప్పటి దాకా బయటపడలేదు
ఏపీలో ఏ పార్టీకి అధికారం దక్కుతుందో ఇంకా తెలియడంలేదు. ఓటర్ల నాడి అయితే ఇప్పటి దాకా బయటపడలేదు. అయితే ప్రధాన పార్టీలకు చెందిన అధినేతలు ముగ్గురు ఉన్నారు. వారు పోటీ చేసే అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా ఖరారు అయ్యాయి. వాటిలో ఎవరికి ఎక్కువ మెజారిటీ వస్తుందో అన్న కొత్త చర్చకు తెర లేచింది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పులివెందుల నుంచే మళ్ళీ పోటీ చేస్తున్నారు. ఆయన 2014లో 2019లలో ఇక్కడ నుంచి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచారు. 2014లో జగన్ కి 75,243 ఓట్ల మెజారిటీ వస్తే 2019లో 89,708 మెజారిటీ దక్కింది. ఈసారి లక్ష ఓట్ల మెజారిటీ తెస్తామని ఆయన వర్గం అంటోంది.
దానికి కారణం వరసగా ఆయన మీద గతంలో రెండు సార్లు పోటీ చేసి ఓడిన సతీష్ కుమార్ రెడ్డి ఈసారి వైసీపీలో చేరిపోయారు. దాంతో పాటు పులివెందులలో రెడ్డి ఓటర్లు ఎక్కువ కాబట్టి అలాగే చూస్తే ఆయనకు పోటీ కూడా పెద్దగా ఉండటం లేదు కాబట్టి జగన్ మెజారిటీ అత్యధికమే అని అంటున్నారు.
మరో వైపు చూస్తే జగన్ అయిదేళ్ల పాలన అంతా వాలంటీర్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని, పార్టీ నాయకుల పాత్ర పెద్దగా లేదని అందువల్ల ఈసారి వారు పెద్దగా చురుకుగా వ్యవహరించకపోతే మెజారిటీ తగ్గినా తగ్గవచ్చు అన్నది మరో విశ్లేషణ గా ఉంది.
చంద్రబాబు విషయానికి వస్తే ఆయన కుప్పం నుంచి ఎనిమిదవ సారి పోటీ చేస్తున్నారు. అక్కడ చంద్రబాబు కులం వాళ్ళు పెద్దగా లేరు కానీ పార్టీకి బలమైన ఓటు బ్యాంక్ ఉంది. పైగా ఏడుసార్లు బాబుని కుప్పం జనాలు గెలిపించుకున్నారు. ఈసారి అలాగే అవుతుంది అని టీడీపీ తమ్ముళ్లు అంటున్నారు.
పైగా ఈసారి లక్షకు తగ్గకుండా మెజారిటీ రావాలని చంద్రబాబే కుప్పం పార్టీ లీడర్స్ ని ఆదేశించారు. ఆ పార్టీ ముఖ్య నేతలు అదే పని మీద ఉన్నారు. అయితే కుప్పంలో మేమే గెలుస్తామని వైసీపీ అంటోంది. దానికి కారణం కుప్పంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీల నుంచి మునిసిపాలిటీల వరకూ వైసీపీ లోకల్ బాడీ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటింది.
బాబుని కుప్పంలో ఓడించాలని జగన్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఆయన కూడా కుప్పంలో ఫుల్ ఫోకస్ పెట్టేస్తున్నారు. ఇక బాబు ఓటమి సంగతి పక్కన పెడితే గత అయిదు ఎన్నికల బట్టి చూస్తే బాబు మెజారిటీ నెమ్మదిగా తగ్గిపోతూ వస్తోంది.
1999 ఎన్నికల్లో 65,687 ఓట్ల మెజారిటీ బాబుకు వస్తే 2004 నాటికి అది కాస్తా 59,588కి పడిపోయింది. 2009 నాటికి 46,066 ఓట్ల మెజారిటీకి పడిపోతే 2014 నాటికి ఒక వేయి పెరిగి 47,121 ఓట్ల మెజారిటీ బాబుకు వచ్చింది. ఇక 2019లో ఎన్నడూ లేని విధంగా బాబు మెజారిటీ 30, 722 కి పడిపోయింది. దీంతో బాబుని ఓడించవచ్చు అన్న ధైర్యం వైసీపీకి వచ్చింది.
అయితే అయిదేళ్ల వైసీపీ పాలన తరువాత జరుగుతున్న ఎన్నికలు కావడం బాబు సీఎం అవుతారు అన్న ఉద్దేశ్యం ఉండడంతో జనాలు ఆయనకే ఓట్లు వేస్తారని ఈసారి మెజారిటీ బాగా వస్తుందని టీడీపీ నేతలు అంటున్నారు. అయితే కుప్పంలో మాత్రం టైట్ ఫైట్ జరిగే అవకాశాలు కచ్చితంగా ఉన్నాయని విశ్లేషణలు ఉన్నాయి.
ఇక పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ కి ఈ సీటు సేఫ్ గానే ఉంటుందని అంటున్నారు. మొత్తం ఓటర్లలో మూడవ వంతు కాపులు ఉన్న ఈ సీటుని పవన్ తెలివిగానే ఎంచుకున్నారు అని అంటున్నారు. రెండు లక్షల 30 వేల ఓట్లలో కాపు ఓట్లు 95 వేల దాకా ఉంటాయని అవన్నీ గుత్తమొత్తంగా పవన్ కే పడితే మాత్రం భారీ మెజారిటీ వస్తుందని జనసేన నేతలు లెక్క వేస్తున్నారు.
కాపులలో యువ ఓటర్లు ఈసారి పవన్ కే ఓటు వేస్తారు అని అంటున్నారు. పవన్ ని గెలిపించే బాధ్యత టీడీపీ నేతలకు బాబు అప్పగించారు అని అంటున్నారు. పిఠాపురంలో టీడీపీ బలంగా ఉంది. ఆ ఓటు మొత్తం టర్న్ అయ్యే చాన్స్ ఉంది అని అంటున్నారు. ఈ అంచనాలతో మంచి మెజారిటీ రావచ్చు అని భావిస్తున్నారు.
అదే సమయంలో వైసీపీ నుంచి పోటీ చేస్తున్న వంగా గీత కూడా బలమైన క్యాండిడేట్ అని అంటున్నారు. ఆమెకు పిఠాపురంతో మంచి అనుబంధం ఉందని పైగా వైసీపీ సవాల్ గా తీసుకున్న సీటు కాబట్టి టైట్ ఫైట్ నడిచే చాన్స్ ఉందని కూడా అంతున్నారు. ఏది ఏమైనా ఈ ముగ్గురిలో ఎవరికి అత్యధిక మెజారిటీ వస్తుంది, ఎవరు లక్ష ఓట్ల మెజారిటీని కొల్లగొడతారు అన్నది ఆసక్తిని పెంచుతోంది.