ఏపీలో మరో తమిళనాడు అవుతోందా?: విశ్లేషకుల మాటేంటంటే!
ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలకు.. ఓ రెండు దశాబ్దాల కిందట పొరుగున ఉన్న తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయాలకు సారూప్యత గోచరిస్తోందని అంటున్నారు విశ్లేషకులు.
ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలకు.. ఓ రెండు దశాబ్దాల కిందట పొరుగున ఉన్న తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయాలకు సారూప్యత గోచరిస్తోందని అంటున్నారు విశ్లేషకులు. సాధార ణంగా రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉండడం సహజమేనని, అయితే, కక్షపూరిత రాజకీయాలు ఇప్పటి వరకు తమిళనాడు మినహా ఏ రాష్ట్రంలోనూ చోటు చేసుకోలేదని అంటున్నారు. ప్రత్యర్థులను కట్టడి చేయడం నుంచి వారిని జైళ్లకు పంపించేవరకు తమిళనాడులో రాజకీయాలు దేశవ్యాప్తంగా చర్చకు వచ్చాయి.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రులు, దివంగతులైన కరుణానిధి, జయలలితలు జీవించినంత కాలం ఒకరిపై ఒకరు రాజకీయాలకు బదులుగా కక్ష పూరిత, కుట్ర పూరిత రాజకీయాలు చేసుకుని, ఒకరినొకరు జైళ్లలో పెట్టి ఆనందించుకున్న సందర్భాలు ఉన్నాయని ఈ సందర్భంగా విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. జయలలిత ప్రత్యర్థిత్వాన్ని సహించలేక పోయిన అప్పటి డీఎంకే సీఎంగా కరుణానిధి ప్రోత్సాహంతో నిండు అసెంబ్లీలో ఆమెను అవమానించారు.
ఈ అవమానాన్ని మనసులో పెట్టుకున్న జయలలిత.. చెన్నైలో నిర్మించిన ఓవర్ బ్రిడ్జి నిర్మాణంలో అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆరోపిస్తూ... తాను అధికారంలోకి వచ్చిన తర్వాత అర్థరాత్రి నిద్రలో ఉన్న కరుణానిధిని అరెస్టు చేసి బెయిల్ కూడా దక్కని సెక్షన్‌ల కింద రెండు రోజుల పాటు జైల్లో పెట్టిన సందర్భాన్ని.. ఈ సందర్భంగా విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఇలా.. ఈ ఇద్దరు రాజకీయ ప్రత్యర్థుల వైరంతో దేశవ్యాప్తంగా రాజకీయాలంటేనే ఉలిక్కిపడేలా చేశారని అంటున్నారు.
కట్ చేస్తే.. ఇప్పుడు ఏపీలోనూ ఇదే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయా? అనే చర్చ తెరమీదికి వచ్చింది. ఏ ప్రభుత్వ పాలనలో అయినా.. అవకతవకలు, అక్రమాలు కామన్‌గానే ఈ దేశంలో జరుగుతున్నాయనేది విశ్లేషకుల మాట. మేఘ మథనం పేరుతో కొన్ని కోట్ల రూపాయల సొమ్ము రాజశేఖరరెడ్డి హయాంలో ఆవిరి అయిపోయిందని, ఇది ఎవరి జేబులోకి వెళ్లిందో కూడా తెలియదని అప్పటి కాగ్ రిపోర్టులు కుండబద్దలు కొట్టాయి.
అయినప్పటికీ.. తర్వాత గద్దెనెక్కిన ప్రభుత్వాలు.. వాటి జోలికి పోలేదు. రాజకీయంగానే విమర్శలు చేసుకున్నారు. ఇక, చంద్రబాబు హయాంలో గ్రేటర్ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు విషయంలోనూ అనేక ఆరోపణలు వచ్చినా.. అవి కూడా రాజకీయాలకే పరిమితం అయ్యాయి తప్ప.. నాయకులను అడ్డగోలుగా అరెస్టు చేయడం, జైళ్లకు తరలించడం అనేది ఇప్పటి వరకు ఉమ్మడి ఏపీ సహా ఎక్కడా చోటు చేసుకోలేదు.
కానీ, తొలిసారి... ఎప్పుడో ఏడేళ్ల కిందట జరిగిందని 'భావిస్తున్న'(ఎందుకంటే ప్రధాన నిందితులు దేశంలోనే లేరు) కేసులో 73 ఏళ్ల వయసులో ఉన్న చంద్రబాబు ను అరెస్టు చేయడాన్ని బట్టి రాజకీయ కక్ష సాధింపుగానే విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలు ఇలానే కొనసాగితే.. రేపు ప్రభుత్వం మారి టీడీపీ హయాంలోకి వస్తే.. అప్పుడు వైసీపీ నాయకులపైనా ఇలానే జరిగితే... ఏపీ రాజకీయాలు తమిళనాడును మించిపోవడం ఖాయమని హెచ్చరిస్తున్నారు.ఇలాంటి పరిస్థితి ప్రశాంత మైన ఏపీకి, ప్రజాస్వామ్య యుత రాజకీయాలకు సరైన విధానం కాదని, ఏదైనా చట్ట ప్రకారం జరిగితే ఇబ్బంది లేదని అంటున్నారు.