మహా రిజల్ట్స్ మీద జగన్ సైలెంట్
సరిగ్గా నెల క్రితం జరిగిన హర్యానా కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు వచ్చినపుడు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ రియాక్ట్ అయ్యారు.
సరిగ్గా నెల క్రితం జరిగిన హర్యానా కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు వచ్చినపుడు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ రియాక్ట్ అయ్యారు. ముఖ్యంగా హర్యానాలో ఫలితాలు అన్నీ కాంగ్రెస్ కి అనుకూలంగా ఉంటాయని సర్వేలు చెప్పాయి. కానీ ఫలితాలు చూస్తే బీజేపీకే మరోసారి పట్టం కట్టాయి. దాంతో రిజల్ట్ వచ్చిన వెంటనే జగన్ రియాక్ట్ అయ్యారు. ఈవీఎంల తీరు మీద అనుమానాలు వ్యక్తం చేశారు.
ఇపుడు చూస్తే మహారాష్ట్రలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఎన్డీయే కూటమికి దక్కింది. అక్కడ ఇండియా కూటమి సోదిలోకి రాకుండా పోయింది. మరి దేశమంతా రాజకీయంగా ప్రకంపనలు సృష్టించేలా మహా రాష్ట్ర ఎన్నికల ఫలితాలు వస్తే జగన్ నుంచి ఈసారి రియాక్షన్ రాలేదు.
నిజానికి జగన్ ప్రతీ ఎన్నికకూ ప్రతీ రాజకీయ పరిణామానికి రియాక్ట్ అవుతారని కాదు కానీ హర్యానా ఫలితాల మీద ఆయన స్పందించి ఈ విధంగా మహారాష్ట్ర ఫలితాల మీద మాత్రం సైలెంట్ గా ఉండడం మీదనే చర్చ సాగుతోంది. నాడు ఎందుకు రియాక్ట్ అయ్యారు. నేడు ఎందుకు సైలెంట్ అయ్యారు అన్నదే అంతా అనుకుంటున్నది.
అయితే దీని మీద కూడా ఎవరికి తోచిన తీరున వారు వ్యాఖ్యానిస్తున్నారు. నాడు కాంగ్రెస్ కి అనుకూలంగా జగన్ కామెంట్స్ చేసినా ఆ పార్టీ పెద్దల నుంచి ఎలాంటి పాజిటివ్ రియాక్షన్ రాలేదని అంటున్నారు పైగా బీజేపీకి యాంటీ అన్న ఫీలింగ్ ని కొందరు పనిగట్టుకుని ప్రచారం చేశారు అని అంటున్నారు. దాంతోనే ఈసారి అంతకు మించి కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు ఈవీఎంల మీద డౌట్లు వ్యక్తం చేస్తున్నా జగన్ రియాక్ట్ కాలేదు అని అంటున్నారు.
ఇక మరో విషయం ఏమిటి అంటే దేశంలో బీజేపీ బలం అంతకంతకు పెరుగుతోంది అన్న సత్యం కూడా అందరికీ అర్థం అవుతోంది. దాంతో బీజేపీకి ఈ సమయంలో ఎందుకు ఎదురెళ్ళడం అన్న ఆలోచన కూడా ఉండి ఉండవచ్చు అని అంటున్నారు. పైగా దేశంలో జరిగిన పరిణామాల మీద రియాక్ట్ కావాల్సినంత అవసరం కానీ అగత్యం కానీ లేదు అని భావించి ఉండొచ్చు అంటున్నారు.
ఇవన్నీ పక్కన పెడితే కాంగ్రెస్ కానీ ఇండియా కూటమి కానీ అనుకున్నంతగా గ్రాఫ్ పెంచుకోక పోవడం కూడా ఆ వైపుగా ఆలోచనలు చేయకపోవడానికి మరో కారణం అంటున్నారు. వీటిని పక్కన పెడితే ఏపీలో అధికార టీడీపీ కూటమికి ఈ రోజూ రేపూ కూడా అసలైన ఆల్టర్నేషన్ అంటే అది కచ్చితంగా వైసీపీయే అన్న భావన ఉంది. దానిని కాపాడుకుంటూ ఏపీ రాజకీయాల మీద ఫుల్ ఫోకస్ పెడితే ఫ్యూచర్ లో ఏది ఎలా జరిగితే అలా అన్నట్లుగానే వైసీపీ అధినాయకత్వం ఉంది అని అంటున్నారు. అందుకే జాతీయ రాజకీయాల మీద రియాక్ట్ కానవసరం లేదని భావించే ఈ విధంగా సైలెంట్ అయ్యారు అని వ్యాఖ్యానిస్తున్నారు.