బీజేపీతో అలియన్స్ ఎందుకు లేట్ అవుతోంది...!?
బీజేపీ దేశవ్యాప్తంగా తొలి జాబితాను రిలీజ్ చేసి ఏపీని మాత్రం అలా పక్కన పెట్టింది. దాని అర్ధం పొత్తులు ఉంటాయని సంకేతాలు ఇస్తోంది అని అంటున్నారు.
కేంద్రంలో బీజేపీ పెద్దలతో టీడీపీ అధినేత ఒక కీలక భేటీ నిర్వహించి కూడా నెల కావస్తోంది. ఇదిలా ఉంటే ఎన్నికలు ఏపీలో చాలా దగ్గరకు వచ్చేశాయి. గట్టిగా నెల మీద వారం రోజులు మాత్రమే ఎన్నికలు ఉన్నాయి. టీడీపీ జనసేన తొలి జాబితా విడుదల చేసి కూడా పదిహేను రోజులు గడచిపోయాయి.
ఇంత జరుగుతున్నా బీజేపీ టీడీపీ జనసేన కూటమిలోకి వస్తుందా రాదా అన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా ఉండిపోయింది. టీడీపీ జనసేన ఈ విషయంలో ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నాయి. బీజేపీ దేశవ్యాప్తంగా తొలి జాబితాను రిలీజ్ చేసి ఏపీని మాత్రం అలా పక్కన పెట్టింది. దాని అర్ధం పొత్తులు ఉంటాయని సంకేతాలు ఇస్తోంది అని అంటున్నారు.
అదే టైం లో బీజేపీ నుంచి ఎలాంటి గ్రీన్ సిగ్నల్స్ కూడా ఇప్పటివరకూ రాలేదు అన్నది మరో వైపు సాగుతున్న ప్రచారం. ఇవన్నీ చూస్తూంటే ఎక్కడ లేట్ అవుతోంది అసలు పొత్తులు ఉంటాయా ఉండవా అన్న చర్చ మాత్రం వాడిగా వేడిగా ఏపీ రాజకీయాల్లో సాగుతోంది.
నిజానికి ఈపాటికి మూడు పార్టీలూ కలసి మొత్తం అభ్యర్ధులను ప్రకటించి ఉమ్మడిగా ఏపీలో ఎన్నికల ప్రచారం సాగించాలి. కానీ బీజేపీ మాత్రం పొత్తుల వద్దనే బ్రేకులు వేస్తోంది. అసలు పొత్తు విషయం ఏమీ తేల్చకుండా ముంచకుండా చేస్తోంది. ఆ డెసిషన్ ఫైనలైజ్ చేయకుండా డిలే చేస్తోంది.
ఇక్కడే అందరికీ కొత్త అనుమానాలు పుట్టుకుని వస్తున్నాయి. అలాగే మరిన్ని కొత్త ప్రశ్నలు కూడా వస్తున్నాయి. బీజేపీ ఎందుకు లేట్ చేస్తోంది. అసలు బీజేపీకి ఏపీలో కావాల్సింది ఏమిటి. సీట్ల దగ్గర పంచాయతీ కుదరడం లేదా అన్నది కూడా అంతా ఆలోచిస్తున్న విషయంగా ఉంది.
ఇక బీజేపీతో ఏపీలో అఫీషియల్ గా పొత్తులో ఉన్న పార్టీ జనసేన. కానీ జనసేన టీడీపీతోనే అడుగులు వేస్తోంది. కలసి చంద్రబాబు పవన్ మీటింగ్స్ పెడుతున్నారు. ఇద్దరూ కలసి సీట్లు ప్రకటించారు. అలా బీజేపీని పక్కన పెట్టి టీడీపీతోనే పవన్ వెళ్తున్నారు. పవన్ ఇటీవల బీజేపీ జాతీయ నాయకత్వంతో చీవాట్లు తిని పొత్తులకు ఒప్పించాను అని అంటున్నారు.
మరి ఇంత లేట్ అవుతూంటే పవన్ ఎందుకు మాట్లాడడంలేదు, ఆయన ఈ రోజుకీ బీజేపీకి మిత్రుడుగానే ఉన్నారు కదా అన్న చర్చ కూడా మరో వైపు సాగుతోంది. ఇక బీజేపీ కేంద్ర నాయకత్వం మీద కూడా మరో రకమైన ప్రచారం ఉంది. ప్రధాని మోడీకి చంద్రబాబుతో పొత్తు ససేమిరా ఇష్టం లేదు అని అంటున్నారు. అదే అమిత్ షా కి మాత్రం ఏపీలో పొత్తులు కావాలని ఉంది అని అంటున్నారు.
అలా ఇద్దరు అగ్ర నాయకుల మధ్య ఏపీ విషయంలో ఒక అభిప్రాయం కుదరకపోవడం వల్ల కూడా పొత్తు ప్రకటన ఇంకా ఆలస్యం అవుతోంది అని అంటున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే ఏపీ బీజేపీలోని వారు దాదాపుగా పొత్తులు ఉంటేనే ఈసారి ఎన్నికల్లో పోటీ చేయగలమని ఎంతో కొంత ఉనికి చాటుకోగలమని భావిస్తున్నారు అని అంటున్నారు.
ఎందుకంటే గత అయిదేళ్లుగా ఏపీలో బీజేపీ పెద్దగా ఎదిగింది ఏమీ లేదు. దాంతో ఎన్నికలు దగ్గర పడిన వేళ ఒంటరి పోటీ అంటే అసలు బీజేపీ ఏ విధంగా ఉంటుందో అన్న భయాలు కూడా ఏపీ లీడర్స్ లో ఉన్నాయని అంటున్నారు. వారంతా అధినాయకత్వం నోట పొత్తు మాట రావాలనే గట్టిగా కోరుకుంటున్నారు.
ఇలా కేంద్ర నాయకత్వం ఒక వైపు ఆలోచిస్తూంటే ఏపీ బీజేపీ నాయకులు మరో విధంగా ఆలోచిస్తున్నారు. ఎటూ పొంతన లేదు ఎటూ ఏ విధమైన సమాచారం లేదు సస్పెన్స్ సాగుతోంది. బీజేపీ పొత్తుల కోసం రిజర్వ్ చేశారు అని అట్టే బెట్టిన సీట్లలో కూడా తొందరలో అభ్యర్ధులను ప్రకటించాలని టీడీపీ అనుకుంటోంది. ఎందుకంటే సమయం మించిపోతోంది. మరి బీజేపీ తేల్చుడు ఉందా లేదా. ఇది మిలియన్ డాలర్ ప్రశ్న కాదు, కానీ అంతటి ప్రాముఖ్యత మాత్రం ఉంది అని అంటున్నారు.