సీఎంల భేటీ: చంద్రబాబుకు `విభజన` పరీక్ష.. !
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్ని విభజన సమస్యలపై పరిష్కారం కోసం.. రెండు రాష్ట్రాల ముఖ్య మంత్రులు భేటీ అవుతున్నారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్ని విభజన సమస్యలపై పరిష్కారం కోసం.. రెండు రాష్ట్రాల ముఖ్య మంత్రులు భేటీ అవుతున్నారు. ఇది శుభ పరిణామమే. గతం కంటే కూడా.. ఇప్పుడు మరిన్ని ఆశలు, ఆకాంక్షలు పెరిగిన నేపథ్యంలో.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అభివృద్ది ముందుకు సాగాలంటే.. విబజన చట్టంలోని సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే పదేళ్ల పాటు ఆలస్యమైన దరిమిలా.. ఇప్పటికైనా.. ఏమేరకు సాకారం అవుతాయన్నది ప్రశ్నగా మారింది.
ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న చర్చల్లో ఏపీ ప్రయోజనాలను ప్రధానంగా లేవనెత్తుతారు. కానీ, వీటికి తెలంగాణ ఒప్పుకొనే పరిస్థితి లేదు. ఎందుకంటే.. ఏ విషయంలో అయినా.. ఒక్క అడుగు వెనక్కి వేసినా.. ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి వ్యక్తిగత ఇమేజ్‌తోపాటు.. తన రాజకీయ మెంటార్.. చంద్రబాబుతో అంటకాగుతున్నారన్న వాదన కూడా.. తెరమీదికి వచ్చింది. ఈ రెండు కారణాలతో ఆయన పట్టుబిగింపు కొనసాగిస్తారు. పోనీ.. ఏపీ తరఫున ఒక్క అడుగు వెనక్కి వేసినా.. చంద్రబాబుకు ఇబ్బందే.
ఈ నేపథ్యంలో చంద్రబాబుకు ఈ విభజన చట్టం తాలూకు అంశాలను సాధించడం ఇబ్బందిగానే ఉం టుందని చెప్పకతప్పదు. ఇక్కడే మరో కీలక విషయం ఉంది. ఎలానూ కేంద్రంలో ఎన్డీయే కూటమి అధి కారంలో ఉంది. దీనిలో చంద్రబాబు కూడా ప్రధాన భాగస్వామి కావడంతో కేంద్రంతో చర్చించి.. ఢిల్లీ నుంచి రెండు రాష్ట్రాలకు రావాల్సిన ప్రయోజనాలను కనుక ఉమ్మడిగా సాధించేందుకు చంద్రబాబు కొంత ప్రయత్నం చేస్తే.. ఏపీకి సంబంధించి తెలంగాణ కొంత వెనక్కి తగ్గే అవకాశం ఉంటుంది.
ఉదాహరణకు.. సింగరేణి సమస్య, రైల్వే వ్యాగన్ తయారీ కేంద్రం, ఐఐఎం ఏర్పాటు వంటివి కనుక సాధిస్తే .. తెలంగాణ అడ్డుపడుతున్న సమస్యలకు చంద్రబాబు ఒప్పించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే.. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన ప్రయోజనాలు.. ఇప్పటికీ రాలేదు. ఒక్క గిరిజన విశ్వవిద్యాల యం తప్ప.. తెలంగాణకు వచ్చినవి పెద్దగా ఏమీ లేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు వ్యూహాత్మకంగా కేంద్రాన్ని ఒప్పించి.. ఏపీ-తెలంగాణ ప్రయోజనాలు కాపాడితే.. అప్పుడు తెలంగాణతో ఉన్న పేచీలు పరిష్కారం అవుతాయని అంటున్నారు పరిశీలకులు. అయితే.. ఇదేమీ తేలిక కాదు. కేంద్రాన్ని ఒప్పించాలి. నిధులు తెప్పించాలి!! అందుకే విభజన సమస్యల పరిష్కారం చంద్రబాబు ఓ పరీక్షగా మారాయి.