పోలవరం ఎందుకు పూర్తి కాలేదంటే...జగన్ వెర్షన్ ఇదే...!

ఏపీకి జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఏ మాత్రం పట్టించుకోవడంలేదు అని విపక్షాలు ఒక వైపు గట్టిగా విమర్శలు చేస్తున్నాయి

Update: 2023-08-07 17:04 GMT
పోలవరం ఎందుకు పూర్తి కాలేదంటే...జగన్ వెర్షన్ ఇదే...!
  • whatsapp icon

ఏపీలో పోలవరం పడకేసింది. వైసీపీ ప్రభుత్వం ఏపీకి జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఏ మాత్రం పట్టించుకోవడంలేదు అని విపక్షాలు ఒక వైపు గట్టిగా విమర్శలు చేస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు అయితే ప్రాజెక్టుల సందర్శనంతో ఏపీలో వైసీపీ ప్రభుత్వం మీద విమర్శల జడివాన కురిపిస్తున్నారు. ఆయన పోలవరం ప్రాజెక్ట్ ని సందర్శిస్తున్న సమయంలోనే పోలవరం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి జగన్ ఉన్నారు.

ఆయన ఇటీవల వర్షాలకు ముంపునకు గురి అయిన ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్ గురించి జగన్ ఆసక్తి కరమైన కామెంట్స్ చేశారు. పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యానికి కారణం చంద్రబాబు అని డైరెక్ట్ గా ఆరోపించారు. చంద్రబాబు 2014 అంచనాల ప్రకారమే కట్టడానికి పోలవరం తీసుకున్నారని, ఆ నిధులతో 2023లో ఉన్న ధరలకు పోలవరం ప్రాజెక్ట్ ని కట్టగలమా మీరే చెప్పండి అని ప్రజలనే ఆయన నేరుగా అడిగారు.

పోలవరం విషయంలో చంద్రబాబు అనేక తప్పులు చేశారని దాని ఫలితంగా ఆలస్యం అవుతోంది అని కూడా జగన్ విమర్శించారు. టీడీపీ హయాంలో స్పిల్ వే కట్టకుండానే డయాఫ్రమ్ వాల్ కట్టారని అలగే కాఫర్ డ్యామ్ పూర్తి చేయకపోవడం వల్ల పోలవరం చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ముంపుకు గురవుతున్నాయని జగన్ చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం స్పిల్ వే పనులను పూర్తి చేసిందని, అలాగే డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తి చేసిందని ఆయన వెల్లడించారు.

పోలవరం పునరావాసం గురించి నిర్వాసితుల గురించి చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదని జగన్ అన్నారు. ఆర్ ఆర్ ప్యాకేజ్ విషయంలో కేంద్రంతో పోరాడుతోంది తామే అని అన్నారు. తొందరలోనే ఆ నిధులు వస్తాయని, పునరావస ప్యాకేజి తాము అందరికీ ఇస్తామని ఎవరికీ అన్యాయం జరగదు అని జగన్ అంటున్నారు.

ఇక 2014 నాటి అంచనాలను సవరించామని దానికి నిధులు మంజూరు చేసేందుకు కేంద్రాన్ని ఒప్పించామని తొందరలో కేంద్ర మంత్రివర్గం ఆమోదం లభిస్తుందని ముఖ్యమంత్రి వివరిస్తున్నారు. పోలవరం విషయంలో తమకు ఘనత దక్కాల్సిన అవసరం లేదని, ప్రజల కోసమే తాము పనిచేస్తామని జగన్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నేరుగా నిర్వాసితుల బ్యాంక్ ఖాతాలలోకి నగదును జమ చేసినా తమకు అభ్యంతరం లేదని ఆయన అన్నారు.

ఇక పోలవరం ప్రాజెక్ట్ ఎపుడు పూర్తి అవుతుంది అన్న ప్రశ్న కూడా ఎపుడూ వస్తూంటుంది. దానికి జగన్ సమాధానం చెప్పారు. 2025 ఆగస్ట్ నాటికి పోలవరం పూర్తి అవుతుదని అన్నారు. 41 అడుగుల ఎత్తున తొలిదశ పూర్తి చేస్తామని పోలవరం ప్రాజెక్ట్ లోకి మూడు దశలలో నీరు నింపుతామని అన్నీ సవ్యంగా సజావుగా తమ ప్రభుత్వం చేస్తుందని, చంద్రబాబు మాదిరిగా హడావుడి చేయమని ఆయన అంటున్నారు.

మొత్తం మీద చూస్తే చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్ ని సందర్శించి ప్రభుత్వం మీద విమర్శలు చేశారు. దానికి జగన్ కూడా అదే పోలవరం లోనే సమాధానం ఇచ్చేశారు. ఇంతకీ పోలవరం ఆలస్యం ఎందువల్ల జరిగింది అంటే ఎవరికి వారు తోచిన తీరున వ్యాఖ్యానాలు చేసుకోవచ్చు. వైసీపీదే తప్పు అని టీడీపీ అంటే టీడీపీదే తప్పు అని వైసీపీ అంటున్న వేళ పోలవరానికి కొత్త డేట్ వచ్చేసింది. 2025 ఆగస్టు నాటికి ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటారు అన్నది 2024లో జరిగే ఎన్నికలు తేలుస్తాయి.

Tags:    

Similar News