పవన్ కళ్యాణ్ తుఫాన్ కాదు...తుస్సు నా ?
పవన్ కళ్యాణ్ ప్రతీ సభలోనూ పదే పదే ఒక డైలాగ్ చెప్పేవారు. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని. నన్ను గెలిపించి అసెంబ్లీకి పంపించండి చాలు అన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని తుఫాన్ అని ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. ఆయన పవర్ ఫుల్ లీడర్ అని కూడా అంతా అనుకున్నారు. పవన్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. టీడీపీ కూటమిలో ఆయనది కూడా కీలకమైన పాత్ర. మరి రెండు నెలల అధికారంలో పవన్ తనదైన నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నారా అన్నది ఒక చర్చకు వస్తోంది. అదే సమయంలో పవన్ అన్న ముద్ర ప్రభుత్వం ఎక్కడా ఏదీ ఏదీ అన్నది కూడా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
నిజానికి పవన్ రీల్ లైఫ్ లో హీరో పాత్రలు వేశారు. ఆయన చెప్పే డైలాగులు థియేటర్లలో మోత మోగేవి. మరో వైపు చూస్తే ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తరువాత కూడా వారాహి రథమెక్కి చేసిన కామెంట్స్ కానీ నవ శకాన్ని తీసుకుని వస్తాను, ఏపీని ఎక్కడో ఉంచుతాను అని చెప్పిన మాటలు కానీ జనాల చెవులలో ఇప్పటికీ గింగిర్లు తిరుగుతున్నాయి.
పవన్ కళ్యాణ్ ప్రతీ సభలోనూ పదే పదే ఒక డైలాగ్ చెప్పేవారు. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని. నన్ను గెలిపించి అసెంబ్లీకి పంపించండి చాలు అన్నారు. కానీ జనాలు పవన్ ఒక్కడినే కాదు ఆ పార్టీకి చెందిన మొత్తం ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలను గెలిపించి చట్ట సభలకు పంపారు పవన్ కూటమి అంటే దానినీ గెలిపించి బంపర్ మెజారిటీతో అందలం ఎక్కించారు. అలా ఉప ముఖ్యమంత్రి పదవిలో పవన్ ఉన్నారు.
అంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా పైలెట్ అయితే పవన్ ఉప ముఖ్యమంత్రిగా కో పైలెట్ అన్న మాట. అయితే గెలిచిన తరువాత డిప్యూటీ సీఎం అయిన తరువాత పవన్ వాయిస్ ఎక్కడా వినిపించడం లేదు. ఆయన ఫుల్ సైలెంట్ అయిపోయారు. పవన్ ది ఒక పార్టీ. దాని పేరు జనసేన. ఆయన పార్టీ కి ఒక పొలిటికల్ ఫిలాసఫీ ఉంది.
ఆయన కూడా ఎన్నికల ముందు ప్రజలకు కొన్ని హామీలు తమ పార్టీ తరఫున ఇచ్చారు. కానీ చిత్రంగా టీడీపీ కూటమి ప్రభుత్వంలో జనసేన బ్రాండ్ ఎక్కడా కనిపించడం లేదు 2014 నుంచి 2019 దాకా నడచిన టీడీపీ ప్రభుత్వం గానే ఉంది తప్ప కూటమి ప్రభుత్వం అని ఎక్కడా అనుకోవడానికి చాన్సే లేదు అని అంటున్నారు.
పవన్ కలెక్టర్ల మీటింగులలో కానీ ఇతర ముఖ్య వేదికల వద్ద కానీ అసెంబ్లీ సమావేశాలలో కానీ చంద్రబాబుని పట్టుకుని ఆయన అపరిమితమైన అనుభవం కలిగిన వారు అని కీర్తించడమే పనిగా పెట్టుకున్నారు అని అంటున్నారు. నిజమే బాబు సీనియర్ నేతనే. అదే సమయంలో జనసేన తరఫున పవన్ కూడా తన పార్టీ పరంగా కొన్ని విలువైన సూచనలు చేయవచ్చు కదా అని అంటున్నారు. ఆఖరుకు కేబినెట్ మీటింగు పెడితే అక్కడ కూడా చంద్రబాబు ఏమి చెబితే దానికి పవన్ తలూపుతున్నారు ఏమీ చేసేది లేదని జనసేనలోనే చర్చగా వస్తోంది.
టీడీపీ పెద్ద పార్టీ కావచ్చు. అంతమాత్రం చేత కూటమి పక్షాలు తమ అభిప్రాయాలను చెప్పకూడదని ఎక్కడా లేదు కదా. పైగా పవన్ మార్క్ పాలిటిక్స్ కొత్తగా ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ టీడీపీ ఏమి చేసినా చంద్రబాబు ఏమి చెప్పినా భేష్ అనడానికి జనసేన అనే పార్టీ వేరేగా ఎందుకు అన్న చర్చ కూడా సాగుతోంది.
నిజానికి చూస్తే టీడీపీ నాలుగు దశాబ్దాలకు పైబడిన ఒక పాత పార్టీ. ఆ పార్టీ ఇపుడు కొత్తగా మారిపోయి చేసేది ఉండదు. ట్రెడిషనల్ గానే ఉంటుంది. అలాగే గతంలో వచ్చిన వాటిని అలా ఫాలో అవుతూ ఉంటుంది. కానీ జనసేన అలా కాదు యూత్ కి కొన్ని వర్గాలకు ఎంతో ఎక్కువగా కనెక్ట్ అయిన పార్టీ. జనసేన మీద ఎన్నో ఆశలు జనాలకు ఉన్నాయని అంటున్నారు.
జనసేన టీడీపీ కూటమిలో ఉంటుంది కొత్తగా ప్రభుత్వం నడక సాగుతుంది అనుకుంటే కొత్త సీసాలో పాత సారాగా వ్యవహారం సాగుతోంది అని అంటున్నారు. పవన్ తనదైన పాత్రను సమర్ధంగా పోషిస్తారు అని కూడా అంతా అనుకున్నారు. ఎందుకంటే పవన్ ఒక తుఫాను అని కదా అందరి భావన. ఇదే మాటను మోడీ కూడా అన్నారు.
మరి చూస్తే రెండు నెలలు దాటింది పవన్ మార్క్ ఎక్కడా లేదు తన సొంత శాఖలోనూ లేదు, మొత్తం ప్రభుత్వంలోనూ లేదు. అసలు జనసేన టీడీపీ పాలు చక్కెర మాదిరిగా కలిసిపోతూ ముందుకు పోతున్నాయి అదే విజయం అని కూడా పవన్ భావిస్తున్నట్లుగా ఉన్నారు. దేనికీ ఎక్కడా సొంత అభిప్రాయం చెప్పకపోతేనే కూటమి ప్రభుత్వం విభేదాలు లేకుండా సక్సెస్ అయినట్లుగా ఆయన భావిస్తున్నారా అన్న చర్చ కూడా సాగుతోంది.
లేకపోతే పవన్ కి జనసేనకు ఉన్న పొలిటికల్ ఫిలాసఫీ ఏమైంది అని అంతా అంటున్నారు. తుఫాను మాదిరిగా పవన్ పాలన ఏమీ లేదని కూడా అంటున్నారు. ఇక పవన్ ఏమి చెప్పినా టీడీపీ వాళ్ళు పెద్దగా రియాక్ట్ కావడం లేదు అని కూడా అని అంటున్నారు. బయటకు చూస్తే టీడీపీ అనుకూల మీడియా కానీ చానళ్ళు కానీ పవన్ కి ఎంతో ఇంపార్టెన్స్ ఉంది అన్నట్లుగా చెబుతున్నాయి. రాస్తున్నాయి, కానీ ఇన్సైడ్ అంత లేదు అని అంటున్నారు. ఏది ఏమైనా పవన్ తుఫాను కాదని ఆయన రెండు నెలల పాలనలో మార్క్ లేకపోవడం మాత్రం మైనస్ గానే చెప్పుకుంటున్నారు.