ఈసారి ఏపీ ఎన్నికల్లో అదే మైనస్...!?
ఏపీలో ఈసారి జరగబోయే ఎన్నికల్లో అదే మైనస్ గా ఉంది అని అంటున్నారు. అదేమిటి అంటే ఎమోషనల్ గా కనెక్ట్ చేసే అంశం అని అంటున్నారు.
ఏపీలో ఈసారి జరగబోయే ఎన్నికల్లో అదే మైనస్ గా ఉంది అని అంటున్నారు. అదేమిటి అంటే ఎమోషనల్ గా కనెక్ట్ చేసే అంశం అని అంటున్నారు. 2014లో విభజన తరువాత జరిగిన ఏపీ తొలి ఎన్నికల్లో విభజన నుంచి ఏపీని గట్టెక్కించే అనుభవం కలిగిన నాయకత్వం రావాలన్న టీడీపీ నినాదం బ్రహ్మాండంగా పనిచేసింది. అపుడు యువ నాయకత్వం అంటూ జగన్ స్లోగన్ తేలిపోయింది.
హైదరాబాద్ ని మించిన రాజధాని నిర్మిస్తామని ప్రత్యేక హోదా ఇస్తామని, ఏపీని అన్ని విధాలుగా కాపాడుతామని, దాన్ని నంబర్ వన్ స్టేట్ గా చేస్తామని టీడీపీ ప్లస్ జనసేన ప్లస్ బీజేపీ ఇచ్చిన హామీలతో ఏపీ ఓటర్లు మంత్ర ముగ్దులు అయ్యారు. అయితే 2014 నుంచి 2019 దాకా పాలనలో డొల్లతనం చూసారు. కేంద్రం విభజన హామీలు తీర్చలేదు. ఏపీ ప్రభుత్వం నెరవేర్చలేదు. బాబు అనుభవం కాస్తా జనాలకు కొత్త అనుభవం నేర్పింది అన్నది ఒక కఠిన విశ్లేషణ.
ఇక 2019లో జగన్ ఏపీని తాను కొత్త మలుపు తిప్పుతాను అని ముందుకు వచ్చారు. ప్రత్యేక హోదా సాధిస్తాను అని ప్రతీ జిల్లాను ఒక రాజధానిగా చేస్తామని చెప్పారు. ఏపీలో పోలవరం వంటి జీవనాడిగా ఉన్న ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తామని కూడా చెప్పారు. ఇలా జగన్ ఇచ్చిన హామీలకు జనాలు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు. దాంతో ఆ వైపునకు ఏపీ ఓటర్లు పూర్తిగా మళ్ళిపోయారు.
ఇపుడు 2024 ఎన్నికలు వచ్చాయి. రెండు పార్టీల పాలన కళ్ల ముందు, జగన్ సంక్షేమం గురించే ఎక్కువగా చెబుతున్నారు. చంద్రబాబు అయితే తాను గతంలో హైదరాబాద్ ని చేసిన అభివృద్ధి చెబుతూ అమరావతి పోలవరం వంటివి తాను మళ్ళీ గెలిస్తే పూర్తి అయ్యేవని ఇపుడు ఆ చాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. మొత్తానికి చూస్తే జనాలలో అయితే ఆకర్షించే నినాదాలు ఈసారి ఎన్నికల్లో లేవు అని అంటున్నారు.
రెండు పార్టీల పనితీరు జనాల మెదడులో ఉంది. వారు ఎపుడూ తెలివైన వారే. బేరీజు వేసుకుని తీర్పు ఇస్తారు. జగన్ పాలనను బాబు విమర్శించినా బాబు పాలన మీద జగన్ నిప్పులు చెరిగినా జరిగింది ఏమిటి అనేది పదేళ్ల కాలం దాని పరిణామాలు జనాల కళ్ల ముందు ఉన్నాయి.
దాంతో ఏపీలో ఈసారి జనాలు ఇచ్చే తీర్పు ఆలోచనతో కూడుకున్నది అయి ఉంటుంది అని అంటున్నారు. అంతే తప్ప ఎమోషనల్ గా జనాలు పోలింగ్ బూత్ లకు తరలి వచ్చే అంశాలు కానీ అవకాశాలు కానీ లేవు అని అంటున్నారు. అందుకే ఏపీలో ఇపుడు అంతా సైలెంట్ గా ఉంది. ఎవరు స్పీచ్ ఇచ్చినా జనాలు అంటే ఓట్లేసే మెజారిటీ సెక్షన్ అంతా మౌనంగానే గమనిస్తోంది.
ఇక ఎన్నికలకు గట్టిగా అయిదు వారాలు కూడా సమయం లేని వేళ కూడా జనాలు ఏ పార్టీకి మొగ్గు అన్నది ఎవరికీ అంతుబట్టడంలేదు. ఈసారి ఎన్నికలు ఎలా జరుగుతాయో దానిని బట్టే ఊహించుకోవచ్చు అని అంటున్నారు. ఈసారి ప్రజలు ఇచ్చే తీర్పు చైతన్యవంతంగా వివేచనతో ఉంటుంది అని అంటున్నారు. అలాగే సంచలన ఫలితాలే వస్తాయని అంటున్నారు.
ప్రజలకు ఏమీ తెలియదు అని వారికి మతిమరుపు జాస్తి అని ఎవరు అనుకున్నా తప్పు అనే నిరూపించే అనేక తీర్పులు గతంలో వచ్చాయి. ఇక ఈసారి కూడా అలాంటి తీర్పు వస్తుంది అని అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఏపీలో ఎన్నికలు దగ్గరపడినా ఆ వేడి వాడి అయితే అనుకున్న స్థాయిలో లేదు. అందుకే ప్రధాన పార్టీలు బయటకు మేమే గెలుస్తామని చెబుతున్నా లోలోపల వారిని భయాలు సమస్తం పీకుతున్నాయని అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఓటరు ప్రభువు. అతని తీర్పు ఎవరికైనా శిరోధార్యం.
ఒక రాజకీయ పార్టీ ఒక వైపే చూస్తుంది. ఓటరు మాత్రం అన్ని వైపులా చూస్తాడు. అక్కడే పార్టీలకు ఓటరుకి మధ్య అతి పెద్ద తేడా ఉంది. సో ఈ రోజుకి అయితే ఏపీలో ఏ పార్టీకి మొగ్గు ఉందో ఆన్నది మాత్రం ఇంకా తెలియడం లేదు అంటే ఏపీ ఓటరు భారీ విస్పోటనమే సృష్టించబోతున్నాడు అని అంటున్నారు. సో వెయిట్ అండ్ సీ.