ఏపీలో ఈసీ మీటింగ్... తెరపైకి 2019 ముహూర్తం!
నాడు జరిగిన ఆ తేదీలకు కాస్త అటు ఇటుగానే 2014 లో కూడా ఏపీలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని సూచన ప్రాయంగా వెల్లడైందని తెలుస్తుంది
తెలంగాణ ఎన్నికలు ముగిసాయి. ఇక ఏపీలో జరగబోయే ఎన్నికలపైనే అందరి దృష్టీ నెలకొంది! ఈ సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధుల బృందం విజయవాడలో సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా పలు కీలక విషయాలపై చర్చ జరిగిందని తెలుస్తుంది. ఈ సమయంలో దాదాపుగా 2019 ఎన్నికల నాటి తేదీలే కన్ ఫాం అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.
అవును... ఆంధ్రప్రదేశ్ లో 2024 ఏప్రిల్ లోనే సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశం ఉందని కేంద్ర ఎన్నికల సంఘం సూచన ప్రాయంగా వెల్లడించింది. అంటే... ఎన్నికలకు ఇంకా నాలుగు నెలల సమయం మాత్రమే ఉన్నందున.. యుద్ధప్రాతిపదికన సన్నద్ధం కావాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు సూచించింది. ఇదే సమయంలో... 2019 ఎన్నికల షెడ్యూలుకు కాస్త అటు, ఇటుగానే ఈదఫా ఎన్నికలు జరిగే అవకాశముందని అంతర్లీనంగా పేర్కొంది.
వాస్తవానికి 2019 ఎన్నికలకు నోటిఫికేషన్ 18 మార్చి 2019 (సోమవారం) విడుదల కాగా... 25 మార్చి 2019 (సోమవారం) నామినేషన్లకు చివరి తేదీగా ప్రకటించింది. 28 మార్చి 2019 (గురువారం) నామినేషన్లు విత్ డ్రా చేసుకునేందుకు చివరితేదీగా తెలిపింది. ఈ క్రమంలో 11 ఏప్రిల్ 2019 (గురువారం) ఎన్నికల పోలింగ్ తేదీగా ప్రకటించారు. మే 23 న టీడీపీని విడుదలైన ఫలితాల్లో 23 సీట్లకే పరిమితం చేస్తూ వైసీపీ జెండా రెపరెపలాడింది.
నాడు జరిగిన ఆ తేదీలకు కాస్త అటు ఇటుగానే 2014 లో కూడా ఏపీలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని సూచన ప్రాయంగా వెల్లడైందని తెలుస్తుంది. ఈ సమయంలో ఏపీలోని కలెక్టర్లు, ఎస్పీల ఈసీ పలు సూచనలు చేశారు సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్! ఇందులో భాగంగా... సరిహద్దుల్లో నిఘా ఏర్పాటుచేయాలని.. పోలీసు, ఎక్సైజ్, అటవీ శాఖలు సంయుక్తంగా తనిఖీ కేంద్రాలు ఏర్పాటుచేయాలని సూచించారు. ఇదే సమయంలో తీరం వెంట గస్తీ పెంచాలని అన్నారు.
ఈ సందర్భంగా ప్రధానంగా 2014, 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఘర్షణలు, అల్లర్లు, విధ్వంసాలు, హింసాత్మక ఘటనలు ఎక్కడెక్కడ చోటుచేసుకున్నాయి.. ప్రస్తుతం నాడు నమోదైన ఆయా కేసుల పరిస్థితి ఏంటి.. తదితర అంశాలపై జిల్లాల వారీగా ఆరాతీశారు! ఈ క్రమంలో ఏపీలోని అన్ని జిల్లాల్లోనూ సమస్యాత్మకమైన, అత్యంత సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలపై ప్రధానంగా దృష్టి సారించారని తెలుస్తుంది.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్ కుమార్ మీనా పరిష్కారానికి వచ్చిన ధరఖాస్తుల వివరాలు వెల్లడించారు. ఇందులో భాగంగా... ఈ ఏడాది జనవరి 6 నుంచి ఇప్పటివరకూ మొత్తం 90 లక్షల దరఖాస్తులు అందాయని.. వాటిలో 89 లక్షలు పరిష్కరించామని వివరించారు. మిగతా లక్ష దరఖాస్తులను ఈ నెల 26లోగా పరిష్కరిస్తామని తెలిపారు!