వైసీపీ వర్సెస్ టీడీపీ : ఏప్రిల్ బిగ్ ట్విస్ట్ ఇస్తుందా...!?

చూస్తూండగానే ఎన్నికల షెడ్యూల్ వచ్చి పదిహేను రోజులు గడిచిపోయాయి.

Update: 2024-03-30 03:38 GMT

చూస్తూండగానే ఎన్నికల షెడ్యూల్ వచ్చి పదిహేను రోజులు గడిచిపోయాయి. అరవై రోజుల సుదీర్ఘ సమయం ఏపీలో ఎన్నికలకు ఉంది అనుకుంటే అది కాస్తా నలభై రోజులకు వచ్చి పడింది. ఒక్క రోజు తేడాతో ఏప్రిల్ నెలలోకి ఎంటర్ అవుతున్న నేపధ్యం ఉంది.

ఏపీలో పొలిటికల్ హీట్ చూస్తే వేసవి ఎండలను మించేస్తోంది. అధికార వైసీపీ విపక్ష టీడీపీ కూటమి కూడా ఢీ అంటే ఢీ అంటున్నాయి. తమదే విజయం అని చెప్పుకుంటున్నాయి. బయటకు గంభీరమైన ప్రకటనలు చేస్తున్నాయి.

కానీ ఈ రెండు పార్టీలకు అనుకూలంగా బలమైన వేవ్ అయితే ఏపీలో ఇంకా ఏర్పడలేదు. ఫలానా పార్టీని అధికారంలోకి తీసుకుని వద్దామన్న ఉద్దేశ్యంతో ఏకపక్షంగా జనాలు జై కొట్టే సన్నివేశం అయితే లేదు. సభలకు జనాలు వస్తున్నాయి. అది రెండు పార్టీలకూ జరుగుతోంది అంతమాత్రాన వాటిని కొలమానంగా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు అంటున్నారు.

సైలెంట్ వేవ్ అన్నది క్రియేట్ అయితేనే తప్ప ఎవరు అధికారంలోకి వస్తారు అన్నది తెలియదు అని అంటున్నారు. జనాలు అయితే ఇంకా టైం ఉంది కదా అని వేచి చూసే ధోరణిలోనే ఉన్నారు. మార్చిలో ఎన్నికల షెడ్యూల్ మూడవ వారంలో వెలువడిన తరువాత అటూ ఇటూ పార్టీలు అన్నీ అభ్యర్థులను ప్రకటించేశాయి.

ఇక ఏప్రిల్ నుంచి అసలైన ఎన్నికల యుద్ధం మొదలవబోతోంది అని అంటున్నారు. ఏపీలో బిగ్ పొలిటికల్ ట్విస్టులు కూడా ఇదే నెలలో చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఏప్రిల్ నెలలో టీడీపీ కూటమి తరఫున బీజేపీ అగ్ర నేతలు వరసగా ప్రచారం చేయడానికి రానున్నారు. వారిలో కేంద్ర మంత్రుల నుంచి అమిత్ షా వంటి బిగ్ షాట్ కూడా ఉండనున్నారు. దాంతో కూటమి ప్రచారం వేరే లెవెల్ లోకి వెళ్ళబోతోంది.

అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విడతల వారీగా ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు. ఆయన తొలి విడత ప్రచారం శనివారం నుంచి పిఠాపురం వేదికగా మొదలవుతుంది. ఆ తరువాత ఆయన ఉత్తరాంధ్ర టూర్ పెట్టుకుంటారు. రెండవ విడతలో ఆయన ఉభయ గోదావరి జిల్లాలలో పర్యటిస్తారు.

అలాగే ఏపీలో మిగిలిన ప్రాంతాలు మూడవ విడతలో ఆయన టచ్ చేస్తారు. జగన్ బస్సు యాత్ర ఇరవై ఒక్క రోజులు అంటే ఏప్రిల్ 17 దాకా కొనసాగుతుంది. ఏప్రిల్ 18న ఏపీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ అవుతుంది. ఆ తరువాత జగన్ మలి విడత టూర్లు ఉంటాయి. అవి మే 11 దాకా కొనసాగుతాయని అంటున్నారు.

చంద్రబాబు రోజుకు మూడు సభలు వంతున చుట్టేస్తున్నారు. ఏప్రిల్ మొత్తం బాబు షెడ్యూల్ ఇంకా బిజీగా మారబోతోంది అని అంటున్నారు. టీడీపీని గెలిపించాలి అన్న భావనను జనాల్లో కలిగించేందుకు బాబు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు.

మొత్తం మీద చూస్తే ఏప్రిల్ నెలలో రాజకీయాన్ని తమకు అనుకూలంగా మలచుకునేందుకు ప్రధాన పార్టీలు విపరీతంగా ట్రై చేయబోతున్నాయి అని అంటున్నారు. అయితే కేవలం ప్రచారం చేస్తే చాలదు, ఎమోహనల్ గా కనెక్ట్ అయ్యే సంఘటనలు కానీ సందర్భాలు కానీ ఉండాలి. అవి చోటు చెసుకుంటేనే బిగ్ ట్విస్ట్ పొలిటికల్ గా ఉంటుంది.

అలా కాకుండా ఏప్రిల్ లో కూడా అటూ ఇటూ దూషణ పర్వాలు పరస్పర విమర్శలు చేసుకుంటే మాత్రం జనాలు ఇచ్చే తీర్పు కోసం పూర్తిగా వేచి చూడాల్సి వస్తుంది. మొత్తం మీద వేవ్ క్రియేట్ చేసేది ఏ పార్టీ. ఏ నాయకుడు అన్నది మాత్రం ఏప్రిల్ నెల తేల్చుతుందా అన్నది బిగ్ క్వశ్చన్.

Tags:    

Similar News