ఏపీలో 20 రోజులే డెడ్‌లైన్.. పార్టీలో టెన్షన్.. టెన్షన్..!
20 రోజులు ఖచ్చితంగా 20 రోజులే.. ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యేందుకు కేవలం 20 రోజుల గడువు మాత్రమే ఉన్నట్టు స్పష్టమైంది.
20 రోజులు ఖచ్చితంగా 20 రోజులే.. ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యేందుకు కేవలం 20 రోజుల గడువు మాత్రమే ఉన్నట్టు స్పష్టమైంది. దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే.. ఎన్నికల ఓటర్ల తుదిజాబితా విడుదల చేసిన తర్వాత.. కేంద్ర ఎన్నికల సంఘం 20 రోజుల్లోనే నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పుడు ఏపీలోనూ ఇదే పంథాను అనుసరించే అవకాశం కనిపిస్తోంది. తాజాగా తుది ఓటరు జాబితా విడుదల అయిపోయింది.
దీంతో మరో 20 రోజుల్లోనే ఏపీలో కోడ్ అమలు కానుంది. ఈ విషయాన్ని పరోక్షంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా వెల్లడించింది. ఫిబ్రవరి మూడో వారంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో ఇప్పుడు పార్టీలలో టెన్షన్ నెలకొంది. ఈ 20 రోజుల్లోనే ఏంచేసినా.. పనిచేస్తుంది. ఆ తర్వాత.. కోడ్ కుంపటి రానుంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ వైసీపీ దూకుడు పెంచేసింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల వేగాన్ని పెంచేసింది.
అదేసమయంలో ఇప్పటి వరకు వివిధ పథకాల్లో అర్హులై ఉండి.. కూడా లబ్ధి పొందని వారికి ఈ నెల ఆఖరులో నిధులు విడుదల చేయడం ద్వారా.. వారి ఓట్లపై కూడా వైసీపీ దృష్టి పెట్టింది. ఎన్నికల కోడ్‌కు ముందే ఈ క్రతువును పూర్తి చేసి ముందుకు సాగాలని నిర్ణయించింది. ఇది తమకు మేలు చేస్తుందని వైసీపీ అంచనా వేస్తోంది. మరోవైపు.. ఈ నెల నుంచే వైసీపీ ఎన్నికల ప్రచారానికి కూడా శ్రీకారం చుడుతోంది. ఈ నెల 27న భీమిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు.
ఇక, వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకోవాలని భావిస్తున్న టీడీపీ, జనసేన లు ఇంకా అభ్యర్థుల కసరత్తులోనే ఉన్నాయి. ఈ 20 రోజుల్లోనే అభ్యర్థులను ఖరారు చేయడం.. పార్టీలను సన్నద్ధంచేయడం.. ప్రచారానికి దిగడం వంటివి పూర్తి చేయాలి. అంటే.. ఇప్పటి వరకు సాగుతున్న రా.. కదలిరా! సభలు కూడా వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే.. ఈ మూడు కీలక పార్టీల్లోనూ ఎన్నికల టెన్షన్ అయితే.. మొదలైందనే చెప్పాలి. మరి ఎలా డీల్ చేస్తారో చూడాలి.