తొలి ట్రెండ్ వచ్చేది అపుడే...!
అయితే ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎక్కువగా వచ్చాయి. కాబట్టి వాటి లెక్కింపులో ఆలస్యం అవుతుంది అని అంటున్నారు
ఏపీలో కౌంటింగ్ కి వేళయింది. ఒక వైపు పోస్టల్ బ్యాలెట్ ని లెక్కిస్తారు. నిబంధనల ప్రకారం ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించి ఆనక ఈవీఎం బ్యాలెట్ ని లెక్కిస్తారు. అయితే ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎక్కువగా వచ్చాయి. కాబట్టి వాటి లెక్కింపులో ఆలస్యం అవుతుంది అని అంటున్నారు.
అదే సమయంలో ఈవీఎంల కౌంటింగ్ ప్రతీ రౌండ్ కి వేగంగా సాగుతోంది. అలా తొలి ట్రెండ్స్ అన్నీ ఈవీఎంల నుంచే వస్తాయని చెబుతున్నారు. పోస్టల్ బ్యాలెట్ కి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి లెక్కించినా అవన్నీ బ్యాలెట్ పేపర్ ఓట్లు కాబట్టి చాలా లేట్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు.
ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 4.61 లక్షల దాకా ఉన్నాయని అధికారిక వివరాలు తెలియచేస్తున్నాయి. అంతే కాదు ఈసారి హోం ఓటింగ్ కూడా జరిగింది. అలా చూస్తే వారు అంతా 26 వేల 473 మంది ఉన్నారు. వీరితో పాటు సవీస్ ఓటర్లు మరో 36,721 మంది ఉన్నారు. వీరంతా మాత్రం ఎలక్ట్రానిక్ విధానంలో ఓటు వేశారు.
ఇదిలా ఉంటే ఏపీలో మొత్తం ఓటర్లు 4 కోట్ల 14 లక్షల పై చిలుకు ఉంటే మొత్తం ఓట్లు వినియోగించుకున్న వారి సంఖ్య 3.33 కోట్ల మంది ఉన్నారు అన్నది అధికారిక లెక్కగా ఉంది. దీంతో ఈసారి మొత్తం పార్లమెంట్ నియోజకవర్గాలకు 2,443 ఈవీఎం టేబుళ్లు, 443 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే అసెంబ్లీ నియోజకవర్గాలకు 2,446 ఈవీఎం టేబుళ్లు, 557 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు ఏర్పాటు చేశారు.
ఇలా కనుక చూసుకుంటే ఏపీవ్యాప్తంగా ప్రాంతాల్లో 401 కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేశారు. మరో వైపు చూస్తే తొలి ట్రెండ్స్ వచ్చేది ఈవీఎంల ద్వారానే అని అంటున్నారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం పోల్ అయిన పోస్టల్ బ్యాలెట్ ని లెక్కించాలంటే దాదాపుగా మధ్యాహ్నం వరకూ సమయం పడుతుందని అంటున్నారు.
ఇక కౌంటింగ్ ఉదయం ఎనిమిది గంటలకు మొదలైతే మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్క స్టార్ట్ అవుతుంది ఎనిమిదిన్నరకు ఈవీఎంల కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఈవీఎంలకు సంబంధించి ప్రతీ రౌండ్ ఫలితం అరగంటకు వస్తుంది. అంటే ఈవీఎంల ద్వారా తొలి ట్రెండ్స్ తొమ్మిది గంటల నుంచి స్టార్ట్ అవుతాయని అంటున్నారు.
ఇక తక్కువ రౌండ్లు ఉన్న చోట మధ్యాహ్నానికి ఫలితం రావచ్చు అని అంటున్నారు. ఇక ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, మెజారిటీ దిశగా ఉంది అన్నది మధ్యాహ్నం ఒంటి గంట తరువాత తెలుస్తుంది అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే కనుక ఏపీలో తొలి ట్రెండ్ కోసం తొమ్మిది గంటల వరకూ వెయిట్ చేయాల్సిందే అన్న మాట.