ఫైల్స్ కంప్లైంట్స్ : పేపర్ లెస్ యుగంలో ఫైళ్ళు నిజాలు చంపేస్తున్నాయా ?
ఇది లాజిక్ కి ఏ మాత్రం అందుతోందా అంటే ఈ తరం అయితే నమ్మదు. కానీ ఆంధ్ర దేశంలో ఈ తరమే లేదు.
ఇది లాజిక్ కి ఏ మాత్రం అందుతోందా అంటే ఈ తరం అయితే నమ్మదు. కానీ ఆంధ్ర దేశంలో ఈ తరమే లేదు. పాత తరం టెక్నాలజీకి దూరంగా ఉన్న తరం చాలా పెద్ద శాతమే ఉంది. అందుకే ఏపీలో ఫైల్స్ కంప్లైట్స్ చాలా బాధ పెట్టేస్తున్నాయి. ప్రాణం పోయేంత నొప్పితో రాజకీయాన్ని నలిపేస్తున్నాయి.
గత కొంత కాలంలో ఏపీలో ఫైల్స్ తగులబడుతున్నాయి. వాటి వెనక నిజాలు చంపబడుతున్నాయని కూటమి పెద్దలు అంటున్నారు. ఇదంతా వైసీపీ పెద్దల పనే అని నిందిస్తున్నారు. మదనపల్లెలోని ఎమ్మార్వో ఆఫీసులో ఫైళ్ల దగ్దం తో మొదలైన రభస కాస్తా పోలవరం ఎడమ కాలువ ప్రాజెక్ట్ ఆఫీసులో దస్త్రాల దహనం దాకా కధ సాగించి. మధ్యలో కొసమెరుపు అన్నట్లుగా తిరుపతిలోనూ ఇదే తరహా ఫైల్స్ మండిపోయాయి.
అసలు ఫైల్స్ మండడం ఏమిటి దాని నుంచి రాజకీయ మంట పుట్టడం ఏంటి అంటే ఆలోచిస్తేనే వింతగా ఉంది కదూ అంటున్నారు ఈ తరం టెక్కీలు. ఎందుకంటే ఈ రోజుల్లో పేపర్ వాడకం ఎక్కడ ఉంది. అంతా కంప్యూటీకరణ కదా. ఎవరైనా తప్పు చేస్తే దాచేసేది దోచేసేది ఆ కంప్యూటర్ లోని హార్డ్ డిస్కులను.
ఇలా ఎన్ని చూడలేదు. దర్యాప్తు అధికారులు కానీ విచారణ సంస్థలు కానీ సోదాలు చేసి జప్తు చేసేవి హార్డ్ డిస్కులనే. ఇదంతా చాలా కాలంగా సాగుతోంది. ప్రతీ ఆఫీసులో కంప్యూటర్ లో ఫైల్స్ అనబడే వన్నీ నిక్షిప్తం అయి ఉంటున్నాయి.
అలాంటిది పాతకాలంలో మాదిరిగా కాగితాల మీద రామకోటి రాసుకున్నట్లుగా ఒక్కో తప్పునీ అలా రాసుకుని తమకు కూడని కొత్త ప్రభుత్వం రాగానే ఆ పాత కాగితాల ఫైళ్ళను గుట్టగా పేర్చి భోగీ మంటలలో వేస్తే పాపం అంతా పోయినట్లేనా. నిజంగా తప్పు చేసిన వారు దొరకనట్లేనా. ఈ అధునిక యుగంలో ఇదెక్కడి లాజిక్కుకు అందని మాజిక్.
అయినా అపుడెపుడో వరసగా హిందూ దేవీ దేవతల విగ్రహాలను వరసబెట్టి తల కాలూ చేయీ నరికినట్లుగా ఇపుడు కూడా ఇదేంటో ఒక సీరియస్ గా సీరియల్ గా ఫైల్స్ దహనం స్టోరీ సాగుతోంది. నిజంగా తప్పు చేసిన వాడు అయినా సరే అది ఫైల్స్ లో అవకతవకలు ఉన్నాయని తెలిస్తే కూడా ఒకసారి తప్పు చేస్తాడు. ఒకసారి మంట పెడతాడు.
మదనపల్లెలో ఫైల్స్ దహనం అంటే ఒక పోలీస్ ఉన్నతాధికారి ఏకంగా హెలికాప్టర్ వేసుకుని అక్కడ వాలిపోయి సీరియస్ గా దర్యాప్తు స్టార్ట్ చేసాక ఎంత పనికిమాలిన బుర్ర ఉన్న వాడు అయినా మళ్ళీ అదే పనిచేస్తాడా రోజూ చెత్త కుప్ప పేర్చినట్లుగా అదే పనిగా ఫైల్స్ ని తగలెడతాడా. ఇది ఒక విషయం అయితే ముందే చెప్పుకున్నట్లుగా తప్పులు ఒప్పులూ పాపాలూ శాపాలూ అన్నీ నిక్షిప్తం అయి ఉండేది కంప్యూటర్ లోనే. చక్కగా సేఫ్ జోన్ లో ఉండేది హార్డ్ డిస్కులలోనే.
అవి కూడా ఒక చోట కాపీ కాదు మొత్తం టాప్ టూ బాటమ్ కాపీ అయి ఉంటాయి. ఒక హార్డ్ డిస్క్ పోయినా వేరే చోట వేరే సెక్షన్ లోనూ వెతికి పట్టుకోవచ్చు. డేటాను ఎలాగైనా బయటకు తీయవచ్చు. మరి ఈ ఫైల్స్ కంప్లైంట్స్ ఎందుకు అంటే ఇది కూడా పాలిటిక్సే అని వైసీపీ అంటోంది.
మదనపల్లి లో ఫైల్స్ దహనం ఎపిసోడ్ ని టీడీపీ కూటమి మార్క్ రాజకీయం అంటున్నారు. వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి అయితే ఏ యుగంలో మనం ఉన్నామో ఆలోచించాలని అంటున్నారు. ఎమ్మార్వో ఆఫీసులో ఫైల్స్ పోయాయి అంటే సిస్టంలో ఉండవా అవే కాపీలు ఆర్డీవో జేసీ కలెక్టరేట్ నుంచి స్టేట్ హెడ్ ఆఫీసు దాకా ఉండవా అని ప్రశ్నించారు.
ఇక మాజీ మంత్రి అంబటి రాంబాబు అయితే చెత్తను ఎవరో కాల్చితే అది అధికార ఫైల్స్ తగలడిపోయినట్లుగా కూటమి నేతలు బిల్డప్ ఇస్తున్నారని ఎక్కడా చెత్తను కాల్చకూడదని ఒక జీవో పాస్ చేస్తారేమో అని ఎద్దేవా చేశారు. ఏది ఏమైనా తప్పు చేస్తే కఠినంగా శిక్షించాల్సిందే. అలాంటి వారిని అన్ని ఆధారాలతో కటకటాల వెనక్కి నెట్టాల్సిందే. అదే సమయంలో అవుట్ డేటెడ్ ఎక్స్ పెరిమెంట్స్ తో రాజకీయ బురదను ఒకరి మీద ఒకరు చల్లుకుంటే మాత్రం మ్యాటర్ లో సీరియస్ నెస్ తగ్గిపోతుంది.