అరకు వైసీపీ ఎంపీకి కోర్టు చిక్కులు... ఏం జరగనుంది...?
ఉమ్మడి విశాఖ జిల్లా అరకు నుంచి తనూజా రాణి వైసీపీ తరఫున 2024 ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు.
ఉమ్మడి విశాఖ జిల్లా అరకు నుంచి తనూజా రాణి వైసీపీ తరఫున 2024 ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. ఉత్తరాంధ్రలో మొత్తం అయిదు ఎంపీ సీట్లు ఉంటే వైసీపీ గెలిచిన ఏకైక సీటు ఇది. ఈ ఎన్నికల్లో ఆమెతో పోటీ పడిన బీజేపీ అభ్యర్థి ఒకనాటి వైసీపీ ఎంపీ అయిన కొత్తపల్లి గీత తనూజా రాణి మీద ఇటీవల కోర్టుకు ఎక్కారు.
తనూజా రాణి ఎన్నికల అఫిడవిట్ లో తన వివరాలు అన్నీ పూర్తిగా పొందుపరచలేదు అన్న అభియోగంతో ఆమె కోర్టుకు వెళ్లారు. దాంతో హై కోర్టు తనూజా రాణికి నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో అరకు వైసీపీ ఎంపీ కోర్టు చిక్కుల్లో పడ్డారని అంటున్నారు.
ఆమె ఎన్నికల అఫిడవిట్ లో ఏ వివరాలు పొందుపరచలేదు అన్నది తెలియాల్సి ఉంది. ఎన్నికల అఫిడవిట్ లో అడిగిన వివరాలు ఇవ్వకపోయినా లేక తప్పుడు వివరాలు ఇచ్చినా ఆ ఎన్నిక సవాల్ కి గురి అవుతుంది. ఇబ్బందులు కూడా తప్పవు. మరి డాక్టర్ గా ఉంటూ విద్యార్ధికురాలిగా సైతం గిరిజనం మన్ననలు అందుకుని ఎన్నికల్లో తొలిసారి పోటీ చేయడమే ఏకంగా ఢిల్లీ మెట్లు ఎక్కి లోక్ సభలో కూర్చున్న తనూజా రాణికి ఈ న్యాయపరమైన అవరోదాలు ఏమిటి అన్న చర్చ అయితే వైసీపీలో జరుగుతోంది.
తనూజా రాణి వైసీపీలో యాక్టివ్ గా ఉంటున్నారు. అలాగే కొత్త ఎంపీ అయినా కూడా ఆమె పార్లమెంట్ లో ప్రశ్నలు వేస్తూ ఏపీ గురించి తన నియోజకవర్గం గురించి కూడా ప్రస్తావిస్తున్నారు. ఇక ఆమె మీద కోర్టుకు వెళ్లిన కొత్తపల్లి గీత 2014లో వైసీపీ నుంచి అరకులో గెలిచిన వారే. అప్పట్లో ఆమె కూడా ఎన్నికల అఫిడవిట్ లో వివరాలు పొందుపరచలేదు అని ప్రత్యర్ధులు కోర్టుకు వెళ్ళడంతో ఇబ్బందులలో పడ్డారు. ఆ తరువాత ఆమె బీజేపీలో చేరిపోయారు.
మరి తనూజా రాణిని కోర్టు దాకా తీసుకుని రావడం వెనక ఏమైనా రాజకీయ ఎత్తుగడలూ వ్యూహాలూ ఉన్నాయా అన్న చర్చ అయితే సాగుతోంది. గత ఎన్నికల్లో ఏకంగా 22 ఎంపీ సీట్లు గెలిచిన వైసీపీ ఈసారి నాలుగు ఎంపీలకే పరిమితం అయింది. ఆ నలుగురి మీద బీజేపీ గురి ఉందని ప్రచారమూ సాగుతోంది. ఇలా నెగ్గిందో లేదో అరకు ఎంపీ బీజేపీలో చేరుతుందని అప్పట్లోనే ప్రచారం మొదలెట్టారు. ఆమె దానిని ఖండించారు కూడా.
ఇపుడు చూస్తే తనూజా రాణికి కోర్టు ఇబ్బందులు స్టార్ట్ అయ్యాయి. ఆమె ఏమి చేస్తారు అన్నది చూడాల్సి ఉంది. కొత్తపల్లి గీత మాదిరిగా ఆమె బీజేపీ వైపు మళ్ళుతారా అన్నది కూడా పుకారుగా షికారు చేస్తోంది. ఏది ఏమైనా వైసీపీ విపక్షంలో ఉంది తన పార్టీ ఎంపీలను కాపాడుకోవడం అగ్ని పరీక్షగానే ఉంది అని అంటున్నారు.