బంగారంపై సీఎం జగన్ మరో కీలక నిర్ణయం!
ఇందులో భాగంగా... గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటేనే రైతులు, మహిళల స్థితిగతులు బావుంటాయని చెబుతున్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముఖ్యమంత్రి జగన్ వరుస నిర్ణయాలు తీసుకుంటున్నారు. సంక్షేమం విషయంలోనూ, సామాన్యుల పట్ల ఆలోచించే విషయంలోనూ తనకు తానే సాటి అన్నట్లుగా ముందుకు కదులుతున్నట్లున్నారు. ఇందులో భాగంగా... తాజాగా రాష్ట్రంలో సహకార రంగాన్ని మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు.
అవును... ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా... గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటేనే రైతులు, మహిళల స్థితిగతులు బావుంటాయని చెబుతున్నారు. ఫలితంగా... సహకార రంగం కూడా అప్పుడే లాభాల బాట నడుస్తుందని అన్నారు.
ఇందులో భాగంగా... బంగారం తాకట్లుపై ప్రాథమిక సహకార పరపతి సంఘాలు.. వాణిజ్య బ్యాంకుల కంటే తక్కువ వడ్డీకే మహిళలు, రైతులకు రుణాలు ఇవ్వాలని సూచించారు. బంగారంపై రుణం అనేది భరోసా ఉన్న రుణ ప్రక్రియ అని.. దీనివల్ల నష్టం ఉండదని.. ఈ విషయం దృష్టిలో ఉంచుకుని తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఏపీ సీఎం అన్నారు.
ఇదే సమయంలో సహకార సంఘాల కంప్యూటరీకరణను నవంబర్ నాటికి పూర్తి చేయాలని సీఎం జగన్.. అధికారులను ఆదేశించారు. అదేవిధంగా... జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల్లో, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో (పిఎసిఎస్) ప్రొఫెషనలిజం పెంచాలని సూచించారు. ఇదే సమయంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు నష్టాల్లో ఎందుకు ఉన్నాయన్న అంశంపై పూర్తిస్థాయిలో పరిశీలన చేయాలని ఆదేశించారు.
రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) ల రూపంలో ప్రతి గ్రామంలోనూ అప్కాబ్, జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల శాఖలు ఉన్నట్లేనని.. మరే ఇతర బ్యాంకులకు లేని సదుపాయం వీటికి ఉందని జగన్ పేర్కొన్నారు. ఆప్కాబ్ లోనూ గతంలో చూడని పురోగతి కనిపిస్తోందని, దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆయన తెలిపారు.
ఇక, 2019తో పోలిస్తే 2023 నాటికి పిఎసిఎస్ ఆర్థిక కార్యకలాపాలు 84.32 శాతం పెరిగాయని చెప్పిన సీఎం... 2019 వరకూ ఆర్థిక కార్యకలాపాలు రూ.11,884 కోట్లు కాగా, 2023 నాటికి రూ.21,906 కోట్లకు చేరాయని పేర్కొన్నారు. ఇదే సమయంలో రాష్ట్రలో సుమారు 400 పిఎసిఎస్ లు నష్టాల నుంచి బయటకు వచ్చాయని ప్రకటించారు.
పిఎసిఎస్ లలో డెవలప్మెంట్ అలా ఉంటే... ఆప్కాబ్ ఈ నాలుగేళ్లలో పెరిగిన ఆర్థిక కార్యకలాపాల విలువ రూ.14,440 కోట్లని.. అంటే 175 శాతం వృద్ధి రేటు ఉందని తెలిపారు. ఆప్కాబ్ లో 2019లో రూ.13,322 కోట్లు లావాదేవీలు ఉండగా.. 2023 మార్చి నాటికి రూ.36,732 కోట్లకు పెరిగాయని ఈ సందర్భంగా సీఎం వివరించారు.