కూటమి అలెర్ట్...వైసీపీకి నో చాన్స్ !

ఏపీలో టీడీపీ కూటమి బలంగా ఉంది. అదంతా కలసి ఉన్నందువల్ల వచ్చిన బలం. విడిపోతే ఇబ్బందులే

Update: 2024-07-22 18:07 GMT

ఏపీలో టీడీపీ కూటమి బలంగా ఉంది. అదంతా కలసి ఉన్నందువల్ల వచ్చిన బలం. విడిపోతే ఇబ్బందులే. ఈ సత్యం అందరి కంటే కూటమి పెద్దలకే తెలుసు. వైసీపీ గతంలో అనుసరించిన వ్యూహాలనే మరోసారి పదును పెడుతోంది. కూటమిలో విభేదాలు వస్తే తన రాజకీయ పబ్బం గడుస్తుందని భావిస్తోంది.

అయితే వైసీపీకి ఆ చాన్స్ ఇవ్వకూడదని కూటమి ఒకటికి పదిసార్లు అనుకుంటోంది. ఈ విషయంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఒకే విధంగా ఆలోచిస్తున్నారు. ఎన్నికల ముందు జరిగిన సభలలో పవన్ పదే పదే ఒక మాట అంటూ వచ్చారు. టీడీపీ జనసేన పొత్తు పదేళ్ల పాటు అయినా కొనసాగాలని ఆయన కోరుకున్నారు.

దాని అర్ధం పరమార్ధం ఏమిటి అంటే వైసీపీ 2024 ఎన్నికల్లో ఓడినా ఇంకా ఎంతో కొంత బలంగానే ఉంటుంది. 2029 నాటికి అది రెడీ అవుతుంది. అందువల్ల ఆ ఎన్నికల్లోనూ ఓడించినట్లు అయితేనే ఏపీలో వైసీపీ రాజకీయ ఉనికి లేకుండా పోతుంది అన్నదే దూర దృష్టితో చేసిన ప్రకటన అన్న మాట.

ఇదే విషయంలో చంద్రబాబు ఏకీభవిస్తున్నట్లుగా ఆయన ఆలోచనలు ప్రకటనలు ఉంటున్నాయి. జనసేనకు పవన్ కి విలువ ఇస్తూ ఆ పార్టీని కూడా కలుపుకుంటూ పోతున్నారు. ఎలాంటి పొరపొచ్చాలూ రెండు పార్టీల మధ్య లేవు అన్న సందేశాన్ని ఆయన ఎప్పటికప్పుడు పంపిస్తున్నారు. రెండు సామాజిక వర్గాలు అయిన కమ్మ ప్లస్ కాపు కాంబినేషన్ ఎంతటి సూపర్ హిట్ అన్నది తెలుసు కాబట్టి దానికి రిపీట్ చేయడానికే టీడీపీ చూస్తోంది అని అంటున్నారు.

ఈ పరిణామాల నేపధ్యంలోనే మంత్రి పదవుల నుంచి ఎమ్మెల్సీ పదవుల దాకా ఒకే మాట మీద ఉంటూ వచ్చారు. ఇక నామినేటెడ్ పదవులతో పాటు రానున్న రెండేళ్ళలో వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లోనూ కలసికట్టుగా పోటీ చేయడం ద్వారా గరిష్ట లాభాలు పొందాలని రెండు పార్టీలూ ఆలోచిస్తున్నాయి. తమతో బీజేపీని సైతం కలుపుకుని పోవాలని కూడా చూస్తున్నాయి.

తాజాగా అసెంబ్లీ హాలులో జరిగిన ఎన్డీయే ఎమ్మెల్యేల భేటీలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు చూస్తే ఇదే విషయం స్పష్టం చేస్తున్నాయి. మరింత ఐక్యంగా ముందుకు సాగాలని నిర్ణయించారు. పవన్ కళ్యాణ్ అయితే రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు తీసుకునే ప్రతీ నిర్ణయానికీ జనసేన మద్దతు ఉంటుందని ప్రకటించారు.

ఇక పై స్థాయిలోనే కాకుండా గ్రౌండ్ లెవెల్ దాకా ఎన్డీయే పక్షల మధ్య ఐక్యత పెంచుకుంటూ ఎక్కడికక్కడ కో ఆర్డినేషన్ కమిటీలను వేయాలని అంతా ఒక్కటిగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఎన్డీయే కూటమి మధ్య విభేదాలు వస్తే అది వైసీపీకే పొలిటికల్ అడ్వాంటేజ్ అవుతుందని అందుకే మరింత గట్టిగా నిలబడాలని ఏపీ కోసం అంతా బలంగా చేతులు కలపాలని కూడా నిర్ణయించుకున్నారు.

కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి సాయం ఉంటుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ సైతం ఈ కూటమి మీటింగులో చెప్పారు. మొత్తానికి జగన్ ప్రతిపక్షంలో ఏ మాత్రం బలం పుంజుకోకుండా చేయడానికి ఈ ఐక్యత సరైన జవాబు చెబుతుందని కూటమి నేతలు నమ్ముతున్నారు. వైసీపీకి ఇది అతి పెద్ద రాజకీయ సవాల్ గా మారనుంది. కూటమిలో గ్యాప్స్ వస్తాయని ఆశ పెట్టుకోకుండా ప్రజా పోరాటాలు చేయడం మీదనే వైసీపీ ఫోకస్ పెడితే మంచిదని కూడా అంటున్నారు.

Tags:    

Similar News