మహారాష్ట్రలో మళ్లీ రాజకీయ లొల్లి.. శిందే తిరుగుబాటు?

ఓవైపు కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారం చేయాల్సిన గడువు దగ్గరపడుతోంటే.. మరోవైపు ముఖ్యమంత్రి ఎవరన్నదీ తేలడం లేదు

Update: 2024-11-27 07:22 GMT

మహారాష్ట్ర ఎన్నికల్లో వరుసగా రెండోసారి రాజకీయ సంక్షోభం నెలకొంది. ఓవైపు కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారం చేయాల్సిన గడువు దగ్గరపడుతోంటే.. మరోవైపు ముఖ్యమంత్రి ఎవరన్నదీ తేలడం లేదు. నిన్నటివరకు బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్ పేరు సీఎంగా ఖరారైనట్లేనని కథనాలు వచ్చినా.. ఇప్పుడు మళ్లీ ‘పీఠ’ముడి పడినట్లుగా తెలుస్తోంది. అయితే, సీట్లు కాస్త తక్కువైనప్పటికీ మిత్రపక్షాలైన శివసేన (శిందే), ఎన్సీపీ (అజిత్ పవార్) తోడు రాకున్నా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల సత్తా బీజేపీకి ఉంది. కాకపోతే పొత్తు ధర్మం పాటిస్తూ ఆ పార్టీ కాస్త వేచిచూస్తున్నట్లుగా కనిపిస్తోంది.

4 రోజులైనా తేలదే?

గత శనివారం మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. సహజంగా అయితే ఆదివారం నాటికి సీఎం ఎవరో తేలిపోవాలి. గత ప్రభుత్వంలో తక్కువ సీట్లు ఉన్నప్పటికీ.. శివసేనను చీల్చి వచ్చిన ఏక్ నాథ్ శిందేను సీఎం చేసింది బీజేపీ. ఇప్పుడు మాత్రం తమకే 130పైగా సీట్లు రావడంతో సీఎం పదవిని తీసుకోవడం ఖాయం. కాగా, శిందే మంగళవారమే తన పదవికి రాజీనామా చేశారు. దీంతో బుధవారం కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని భావిస్తున్నారు.

సీఎం కాకుంటే హోం..?

శిందే అయిష్టంగానే వెనక్కుతగ్గినట్లు కనిపిస్తోంది. తనకు సీఎం పదవి దక్కకుంటే హోం శాఖ ఇవ్వాల్సిందేనని ఆయన పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి మహారాష్ట్రలో మొన్నటివరకు ఇద్దరు డిప్యూటీ సీఎంలు (దేవేంద్ర ఫడణవీస్, అజిత్ పవార్) ఉన్నారు. ఇప్పుడు ఫడణవీస్ సీఎం అయితే.. శిందే డిప్యూటీగా బాధ్యతలు చేపడతారని భావిస్తున్నారు. కానీ, శిందే హోం శాఖకు పట్టుబడుతున్నారు.

ఇవ్వకుంటే తప్పుకొంటాం..

ప్రభుత్వంలో పదవులు చేపట్టే విషయమై మహాయుతి కూటమిలో విభేదాలు మొదలైనట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. శిందే సీఎం పదవినే కోరుతున్నట్లు తెలుస్తోంది. లేదంటే తాను కూటమి నుంచి వైదొలగుతానని కూడా స్పష్టం చేశారట. ఫడణవీస్ ప్రభుత్వంలో కొనసాగే ఉద్దేశం లేదని తేల్చిచెప్పినట్లుగా జాతీయ మీడియా రాసుకొచ్చింది.

తర్వాత ఏం జరగనుంది?

సీఎంగా ఫడణవీస్ అభ్యర్థిత్వానికి అజిత్ పవార్ పూర్తి మద్దతు ప్రకటించారు. శిందే సేన లేకున్నా ఏమీ కాదు. మహారాష్ట్ర అసెంబ్లీలో 288 సీట్లున్నాయి. సాధారణ మెజార్టీ 145. బీజేపీకి 132 సీట్లు దక్కాయి. అంటే ఇంకా 13 మాత్రమే తక్కువ. ఎన్సీపీకి 41 సీట్లున్నాయి. శిందే సేన 57 స్థానాల్లో నెగ్గింది. ఈ లెక్కన చూస్తే ఫడణవీస్ ప్రభుత్వం ఏర్పాటు ఖాయం. బీజేపీ సైతం ఈయన అభ్యర్థిత్వానికే మొగ్గుచూపుతోంది.

Tags:    

Similar News