వైసీపీకి రాంరాం... 'జయమంగళం' దారెటు ...!
ఈ నేపథ్యంలో ఏడాదిన్నర కిందట వైసీపీ బాట పట్టారు.
జయ మంగళ వెంకట రమణ.. బీసీ నాయకుడిగా.. టీడీపీ నేతగా ఉమ్మడి కృష్ణాజిల్లాలో గుర్తింపు పొందిన నాయకుడు. సుదీర్ఘ కాలం ఆయన టీడీపీతోనే కలిసి ఉన్నారు. 2009లో కైకలూరు నుంచి టీడీపీ టికెట్‌పై విజయం దక్కించుకున్నారు. అయితే.. ఆ పార్టీ టికెట్ నిరాకరించడంతో 2014 నుంచి ఆయన అసంతృప్తి తోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏడాదిన్నర కిందట వైసీపీ బాట పట్టారు. అయితే.. వైసీపీలోనూ ఆయనకోరుకున్న సీటు దక్కలేదు.
కానీ, జగన్ మాత్రం ఎవరు వద్దన్నా.. కాదన్నా.. జయమంగళకు సరైన గౌరవమే ఇచ్చారు. పార్టీలో చేరడం తోనే ఆయనకు మండలి సీటు ఆఫర్ చేశారు. బీసీలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా.. పార్టీ పరుగులు పెడుతుందని కూడా అనుకున్నారు. అయితే.. పార్టీ సంగతి ఎలా ఉన్నా.. వైసీపీలోచేరిన బీసీలంతా ఆ పార్టీ కాడి పడేస్తున్నారు. ఈ క్రమంలోనే జయమంగళ కూడా తన పదవిని వదులుకున్నారు. ఇటీవలే ఆయన రాజీనామా కూడా చేశారు.
అయితే.. ఇప్పుడు జయమంగళ పరిస్థితి ఇబ్బందుల్లో పడిందని అంటున్నారు స్థానిక నాయకులు. తొలుత టీడీపీ నుంచి ఆఫర్ వచ్చిందని, తిరిగి సైకిల్ ఎక్కాలంటూ ఆయనను ఆహ్వానించారని దీంతో ఆయన రాజీనామా చేశారని వెంకటరమణ వర్గం చెబుతోంది. కానీ, ఇప్పుడు యూటర్న్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఆయనను చేర్చుకోవద్దని.. మరికొందరు పట్టుబడుతున్నారు. దీంతో నిన్న మొన్నటి వరకు వెంకటరమణతో టచ్‌లో ఉన్న వారు ఇప్పుడు మొహం చాటేస్తున్నారు.
మరోవైపు తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఏం చేయాలన్న దానిపై జయమంగళ వాపోతున్నారు. మరోవైపు.. జనసేన కూడా చేర్చుకునే ఉద్దేశంలో లేదని సమాచారం. కైకలూరులో బీజేపీ హవా నడుస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ కీలక నేత ఒకరు చేసిన అభ్యర్థన మేరకు.. జయమంగళకు ఇరు పార్టీల నుంచి కూడా ఆహ్వానం దక్కలేదని అంటున్నారు. ఈ పరిణామాలు జయమంగళ వర్గంలో కాక రేపుతున్నాయి. మున్ముందు ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో చూడాలి.