మందు బాబులకు సూపర్ న్యూస్!
ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమికి కీలక కారణాలుగా నిలిచినవాటిల్లో ఒకటి.. మద్యపానం
ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమికి కీలక కారణాలుగా నిలిచినవాటిల్లో ఒకటి.. మద్యపానం. వైసీపీ ప్రభుత్వ హయాంలో దశలవారీగా మద్యనిషేధం పేరుతో మద్యం ధరలను భారీగా పెంచేశారనే విమర్శలున్నాయి. అంతేకాకుండా నాసిరకం మద్యాన్ని ప్రవేశపెట్టడంతోపాటు చిత్ర, విచిత్రమైన బ్రాండ్లతో మందు బాబుల ఆరోగ్యాన్ని దెబ్బతీసిందనే ఆరోపణలున్నాయి. మద్యం రూపంలో తమ దగ్గర భారీగా దండుకోవడమే కాకుండా నాసిరకం మద్యాన్ని అందించిందనే కోపంతో వైసీపీ ప్రభుత్వాన్ని మందు బాబులు సాగనంపారనే విశ్లేషణలు కూడా సాగాయి.
ఎన్నికల సమయంలో టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సైతం మద్యం విషయంలో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. నాసిరకం మద్యంతో మందు బాబుల ప్రాణాలను వైసీపీ హరిస్తోందని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యాన్ని అందిస్తామని బాబు, పవన్ హామీ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో నూతన మద్యం విధానంపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలుస్తోంది. ఇందులో భాగంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో చుక్కలనంటిన మద్యం ధరలను భారీగా తగ్గించాలని భావిస్తున్నట్టు సమాచారం.
ఈ క్రమంలో ముందుగా పేదలు, కూలీలు ఎక్కువ వినియోగించే లిక్కర్ క్వార్టర్ బాటిల్ ను రూ.80 నుంచి రూ.90కే విక్రయించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. తక్కువ ధరల్లోనే ప్రముఖ బ్రాండ్లకు చెందిన క్వార్టర్ బాటిల్‌ను రూ.80 నుంచి రూ.90కే అమ్మాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. తక్కువ ధర కేటగిరీలో వైసీపీ ప్రభుత్వం క్వార్టర్ బాటిల్‌ను రూ.200కు విక్రయించిన సంగతి తెలిసిందే.
మరోవైపు ధర తగ్గినా నాణ్యతలో ఏ తేడాలు లేకుండా, రాకుండా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలుస్తోంది. ఈ మేరకు అధికారులు ధర తగ్గింపుతోపాటు నాణ్యతపైనా దృష్టి సారించారని అంటున్నారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో అధిక ధరలకు మద్యం కొనలేక మందు బాబులు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించారని అధికారులు ప్రభుత్వానికి నివేదించినట్టు చెబుతున్నారు. అధిక రేట్లకు మద్యం కొనలేక గంజాయికి అలవాటు పడ్డారని.. దీనివల్లే రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి వినియోగం పెరిగిందని వెల్లడించినట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో అక్టోబర్ నుంచి నూతన మద్యం విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.
ఈ క్రమంలో ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో పర్యటించిన అధికారులు ఆయా చోట్ల అమలు చేస్తున్న మద్యం విధానాలను అధ్యయనం చేసి వచ్చారు. ఈ మేరకు నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నారు.
ఈ ప్రక్రియ ఒకవైపు ఇలా సాగుతుండగానే మరోవైపు ఎక్సైజ్ శాఖ అధికారులు మద్యం కొనుగోళ్లపై ఆయా కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. అన్ని రకాల మద్యం తయారుచేసే బహుళ జాతి కంపెనీల బ్రాండ్లకు అనుమతులు ఇవ్వాలని నిర్ణయించినట్టు చెబుతున్నారు.
ఇందులో భాగంగా ఆగస్టు నెలాఖరులో లేదా సెప్టెంబర్ మొదటి వారంలోనే ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ బ్రాండ్లు అందుబాటులోకి వచ్చే అవకాశముందని టాక్ నడుస్తోంది.