ఏపీలో ఎమ్మెల్సీ పోరు.. ముహూర్తం ఇదే!?

మండ‌లిలో వైసీపీ నాయ‌కుడు, మోషేన్ రాజు చైర్మ‌న్‌గా ఉండ‌డంతో అన‌ర్హ‌త వేటు వేయ‌డం.. ఈజీ అయిపోయింది.

Update: 2024-06-27 00:30 GMT

ఏపీలో మ‌రో ఎన్నిక‌ల పోరుకు రంగం రెడీ అయింది. కొన్నాళ్ల కింద‌ట వైసీపీ ఎమ్మెల్సీలుగా ఉన్న ఇద్ద‌రిపై శాస‌న మండ‌లి చైర్మన్ అన‌ర్హ‌త వేటు వేయ‌డంతో ఇప్పుడు ఆయా స్థానాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌లైంది. వైసీపీ శాస‌న మండ‌లి స‌భ్యులుగా ఉన్న మ‌హ‌మ్మ‌ద్ ఇక్బాల్‌, సి. రామ‌చంద్ర‌య్య‌లు.. ఎన్నిక‌లకు ముందు పార్టీ మారిన విష‌యం తెలిసిందే. వారు అప్ప‌ట్లోనే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఆగ్ర‌హించిన వైసీపీ వారిపై అన‌ర్హ‌త వేటు చేసింది. దీంతో ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యారు. మండ‌లిలో వైసీపీ నాయ‌కుడు, మోషేన్ రాజు చైర్మ‌న్‌గా ఉండ‌డంతో అన‌ర్హ‌త వేటు వేయ‌డం.. ఈజీ అయిపోయింది.

ఇక‌, ఇప్పుడు వీటికి ఉప ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు నోటిఫికేష‌న్ జారీ అయింది. ఇప్ప‌టికే రెండు మాసాల‌కు పైగా అయిపోయింది. దీంతో ఎన్నిక ల‌సంఘం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అయితే.. ఈ రెండు స్థానాలు కూడా.. టీడీపీ కూట‌మికే ద‌క్క‌నున్నాయ‌ని అన‌డంలో సందేహం లేదు. ఎందుకంటే.. ఈ రెండు మండలి స్థానాలు కూడా.. `ఎమ్మెల్యే కోటా` స్థానాలు. అంటే.. స‌భ‌లో ఉన్న ఎమ్మెల్యేలు ఓటేయ‌డం ద్వారా వీరిని ఎన్నుకోనున్నారు. గ‌తంలో వైసీపీకి 151 మంది ఎమ్మెల్యే బ‌లం ఉండ‌డంతో ఎన్నిక ఈజీ అయిన‌ట్టే.. ఇప్పుడు కూట‌మికి 164 మంది స‌భ్యులు ఉండ‌డంతో మ‌రింత ఈజీగా కానుంది.

ఇదిలావుంటే.. ఎవ‌రిని ఈ రెండు ప‌ద‌వుల‌కు ఎంపిక చేస్తార‌నేది ఆస‌క్తిగా మారింది. ఒక‌టి.. పిఠాపురం టికెట్‌ను వ‌దులుకుని మ‌రీ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను గెలిపించ‌డంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన వ‌ర్మ‌కు ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. అదేవిధంగా జ‌న‌సేన‌లో మ‌రో ఇద్ద‌రు నాయ‌కులు కూడా ఈ పద‌వి కోసం పోటీ ప‌డుతున్నార‌ని స‌మాచారం. ఇక‌, టీడీపీ నుంచి కూడా సీట్లు వ‌దులుకుని పార్టీ కోసం క‌ష్ట‌ప‌డిన‌ దేవినేని ఉమా(మైల‌వ‌రం), ఆల‌పాటి రాజేంద్ర‌ప్ర‌సాద్‌(తెనాలి), వైసీపీ నుంచి వ‌చ్చి టీడీపీ కోసం ప‌నిచేసిన వారు.. కూడా ఎదురు చూస్తున్నారు. దీంతో ఎవ‌రికి ఈ రెండు టికెట్లు ఇస్తార‌నేది చూడాలి.

షెడ్యూల్ ఇదీ..

+ నామినేష‌న్లు: జూలై 2వ తేదీ వ‌ర‌కు అవ‌కాశం

+ నామినేష‌న్ల ప‌రిశీల‌న‌: జూలై 3వ తేదీ

+ నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు: . జులై 5

+ 11 మంది స‌భ్యులున్న వైసీపీ కూడా బ‌రిలోకి దిగితే జూలై 12న పోలింగ్ ఉంటుంది.

+ అదే రోజు కౌంటింగ్ చేప‌డ‌తారు.

Tags:    

Similar News