ఏపీలో పెన్షన్ ..టెన్షన్!

లోక్ సభ, శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో పెన్షన్ డబ్బులను ప్రభుత్వం నేరుగా లబ్దిదారుల బ్యాంకు అకౌంట్లలో వేసింది.

Update: 2024-05-03 05:08 GMT

ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్ల పంపిణీ వ్యవహారం ప్రధాన రాజకీయ పార్టీలలో టెన్షన్ రేపుతున్నది. ఈ నెల పెన్షన్ డబ్బులు నేరుగా బ్యాంకు ఖాతాలలో వేయడంతో లబ్దిదారులు వాటిని తీసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వృద్ధులు ఉదయం నుంచి బ్యాంకుల వద్ద బారులుతీరారు. ఎక్కడ చూసినా బ్యాంకులన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. బ్యాంకుల్లో కేవైసీ సరిగా పనిచేయకపోవడంతో అందరూ పడిగాపులు పడుతున్నారు.

లోక్ సభ, శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో పెన్షన్ డబ్బులను ప్రభుత్వం నేరుగా లబ్దిదారుల బ్యాంకు అకౌంట్లలో వేసింది. బ్యాంకు ఖాతాలకు ఫోన్ నెంబర్, ఆధార్ లింక్ లేకపోవడం, కేవైసీ ఇబ్బందులు లబ్దిదారులను వేధిస్తున్నాయి. వేసవి నేపథ్యంలో ఎండలు 40 డిగ్రీలను మించి దంచికొడుతుండడంతో లబ్దిదారులు క్యూలైన్లలో వేచి ఉండలేకపోతున్నారు.

మొన్నటి వరకు వాలంటీర్లు ఇంటికే వచ్చి పెన్షన్ అందజేసేవారు. కొన్నేళ్లుగా దానికే అలవాటు పడిన లబ్దిదారులు ఇప్పుడు కొత్తగా బ్యాంకు బాట పట్టాల్సి రావడంతో వారికి ఏమీ అర్ధంకావడం లేదు. ఇంకా రెండు రోజులు బ్యాంకుల వద్ద ఇదే రద్దే కొనసాగుతుందని, ఎక్కువ కౌంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు తాగునీళ్లు అందుబాటులో ఉంచినట్లు బ్యాంకు వర్గాలు చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ కష్టాలన్నింటికీ కారణం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే అని అధికార వైసీపీ దుమ్మెత్తి పోస్తున్నది. పెన్షన్ ఇబ్బందులు లేకుండా లబ్దిదారులకు అందజేయాలని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. ఎక్కడ ఈ పెన్షన్ల వ్యవహారం తమ మెడలకు చుట్టుకుంటాయో అన్న భయం రెండు పార్టీల నేతనలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

Tags:    

Similar News