బీజేపీతో పొత్తు ప్లస్? మోడీపై ఆంధ్రోళ్లకున్న కోపం మైనస్ కాదా?
ఒకవేళ అదే నిజమని భావిద్దాం. కానీ.. ఏపీ ప్రజలు మోడీ మాట వింటేనే గయ్యిమంటున్నారు. దీనికి కారణంగా ఆయన అధికారంలో ఉన్న పదేళ్లలో ఏపీకి చేసిందేమీ లేదు.
కొన్ని లెక్కలు కొందరు పట్టించుకోరు. అలాంటి కోవలోకే వస్తారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఆయన ఎప్పుడు ఏది నమ్మితే అదే నిజమన్నట్లుగా వ్యవహరిస్తారు. ఆ తీరే ఆయనకు ఎదురుదెబ్బలు తగిలేలా చేస్తుందని చెబుతారు. తన మైండ్ సెట్ కు తగ్గట్లుగా ఆయన వ్యవహరించే ఆయన.. అందుకు తగ్గట్లుగా అర్గ్యుమెంట్లను సిద్ధం చేసుకుంటారు. 2019 ఎన్నికల్లో మోడీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని.. ఆయన ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాదన్న విషయాన్ని నమ్మారు. అందులో నిజం ఎంత? అన్నది పక్కన పెడితే.. ఆ రోజున ఆయన కూటమి నుంచి బయటకు రావటానికి వీలుగా ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని బయటకు తీసి కూటమి నుంచి బయటకు వచ్చేశారు. కాంగ్రెస్ తో దోస్తీ చేశారు. దాని ఫలితం ఏమిటన్న విషయాన్ని ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు.
తాజాగా ప్రతిపక్షంలో ఉన్న ఆయన.. జగన్ శక్తిని అడ్డుకోవటానికి తనకున్న బలం సరిపోదన్న విషయాన్ని ఆయన చేసుకుంటున్న పొత్తులతో తేల్చి చెబుతున్నారని చెప్పాలి. జనసేనతో పొత్తు అనంతరం.. మహా కూటమిలో భాగంగా బీజేపీతో దోస్తీ కోసం ఆయన చేసిన ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. ఎట్టకేలకు ఆయన అనుకున్నది సాధించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మోడీకి ఎదురు తిరిగి పోరాడే సత్తా తనకు లేదని.. గాలి కూడా ఆయనకు అనుకూలంగా ఉందన్న విషయాన్ని చంద్రబాబు నమ్ముతున్నారు.
ఒకవేళ అదే నిజమని భావిద్దాం. కానీ.. ఏపీ ప్రజలు మోడీ మాట వింటేనే గయ్యిమంటున్నారు. దీనికి కారణంగా ఆయన అధికారంలో ఉన్న పదేళ్లలో ఏపీకి చేసిందేమీ లేదు. అలాంటి మోడీ మీద పీకల్లోతు కోపంతో ఉన్నారన్నది వాస్తవం. ఇలాంటి వేళ.. పొత్తు కుదిరిందని సంతోషపడుతున్న చంద్రబాబు.. మోడీ మీద ఏపీ ప్రజలకున్న కోపం ఎన్నికల్లో తనకు మైనస్ గా మారుతుందన్న విషయాన్ని ఎందుకు గుర్తించటం లేదన్నది ఇప్పుడు పాయింట్ గా మారింది.
పొత్తుతో వచ్చే ఓట్ల శాతాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకుంటే.. ఏపీలో బీజేపీకి ఉన్న ఓటు షేర్ ఒకట్రెండు శాతమే. కాదంటే మరో శాతాన్ని అదనంగా లెక్కేసుకోవచ్చు. అదే సమయంలో మోడీపై కోపం ఏపీ ప్రజల్లో ఎక్కువే. తమ రాష్ట్రానికి కేంద్రం దన్నుగా లేకపోవటం.. ప్రత్యేక శ్రద్ధ లేని కారణంగా ఏపీ ప్రగతి నిలిచిందన్న భావన బలంగా ఉంది.
ఇలాంటి వేళ.. మోడీపై ఉన్న కోపం.. ఆయన పార్టీతో పొత్తు కుదుర్చుకున్న టీడీపీకి వ్యతిరేకంగా ఓట్లు వేసే వారి లెక్కేంటి? అన్నది ఒక ప్రశ్న అయితే.. బీజేపీ పొడ గిట్టని మైనార్టీల మాటేమిటి? అన్నది మరో ప్రశ్న. పొత్తుతో రెండు శాతం ఓట్లు ప్లస్ అయితే.. మోడీపై ఆంధ్రోళ్లకున్న కోపం ఏడెనిమిది శాతం కంటే ఎక్కువని.. అలాంటప్పుడు వచ్చే అదనపు ఓట్ల కంటే.. మోడీ కారణంగా పోయే ఓట్లు ఎక్కువన్న మాట బలంగా వినిపిస్తోంది. అదే జరిగితే.. పొత్తుతో ప్లస్ అన్న కోణంలో చూస్తున్న చంద్రబాబుకు మోడీతో మైనస్ అయ్యే ఓట్లతో తుది ఫలితం తేడా కొట్టేస్తే పరిస్థితి ఏమిటి? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరేం జరుగుతుందో కాలమే డిసైడ్ చేయాలి.