మేనిఫెస్టో ముచ్చట.. మిత్రపక్షానిది ఎలా ఉండనుంది...!
అయితే.. ఇవి ప్రస్తుతానికి వాగ్దానాలు మాత్రమే. ఇంకా, మేనిఫెస్టోను రూపొందించాల్సి ఉంది. అప్పుడు వీటిలో మార్పులు జరగడం ఖాయమని తెలుస్తోంది
రాష్ట్రంలో ఉమ్మడిగా ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్న టీడీపీ-జనసేన-బీజేపీలు సంయుక్తంగా మేనిఫెస్టోను విడుదల చేయనున్నాయా? మూడు పార్టీలూ.. కలిసి ఒకే మేనిఫెస్టోకు ఆమోదం తెలుపుతా యా? అనేది ప్రస్తుతం ప్రశ్నలుగానే ఉన్నాయి. ఇప్పటికే చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ `సూపర్ -6` పేరుతో వైసీపీ నవరత్నాలకు పోటీగా కొన్ని పథకాలు ప్రకటించింది. అదేసమయంలో జనసేనతో కలిసి ఇటీవల నిర్వహించిన బీసీ డిక్లరేషన్‌లో నెలకు రూ.4000 పింఛన్ వంటివి కూడా వాగ్దానం చేసింది.
అయితే.. ఇవి ప్రస్తుతానికి వాగ్దానాలు మాత్రమే. ఇంకా, మేనిఫెస్టోను రూపొందించాల్సి ఉంది. అప్పుడు వీటిలో మార్పులు జరగడం ఖాయమని తెలుస్తోంది. ఎందుకంటే.. జాతీయ పార్టీగా ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఆ పార్టీ సహజంగానే మేనిఫెస్టోలో తమకు కూడా క్రెడిట్ రావాలని కోరుకుంటుంది. దీంతో మేనిఫెస్టోపై బీజేపీ ముద్ర ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ కొన్ని చిక్కులు ఉన్నాయి. కొన్ని కొన్ని హామీల విషయంలో బీజేపీ ఇంకా రిస్ట్రక్షన్ పాటిస్తోంది.
ఉదాహరణకు సూపర్ సిక్స్ పథకాలు తీసుకుంటే.. మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఆర్టీసీ సేవలు అందిస్తామన్న టీడీపీ ప్రకటన .. బీజేపీకి నచ్చే అవకాశం లేదు. ఎందుకంటే.. ఒక రాష్ట్రం మొత్తం ఉచిత సేవలు నిరంతరాయంగా అందించేందుకు తాము వ్యతిరేకమని ఛత్తీస్‌గడ్ ఎన్నికల సమయంలోనే ప్రధాని మోడీ స్వయంగా చెప్పారు. కాబట్టి.. ఏపీలో చంద్రబాబు ప్రకటించిన ఈ హామీపై బీజేపీ ఎలా రియాక్ట్ అవుతుందనేది చూడాలి. అదేసమయంలో కేంద్రమే ఏడాదికి 3 సిలిండర్లను ఉచితంగా ఇస్తోంది.
ఇప్పటి వరకు ఎన్నికలు జరిగిన రాజస్థాన్, మధ్య ప్రదేశ్‌లలో బీజేపీకీలక హామీ కూడా ఇదే. ఇది కూడా ఉజ్వల పథకం కింద అమలు చేస్తున్నారు. సో.. దీనిని చంద్రబాబు ఓన్ చేసుకుని.. తాను 4 సిలిండర్లు ఇస్తామని చెప్పారు. కాబట్టి.. దీనిపైనా బీజేపీ మార్పులు కోరుకునే అవకాశం ఉంది. ఇక, కష్టపడే వయసును 60 ఏళ్లుగా నిర్ణయించిన నేపథ్యంలో బీసీ డిక్లరేషన్‌లో 50 ఏళ్లకే పింఛను ఇస్తామని.. చంద్రబాబు ప్రకటించారు.
దీనిపైనా బీజేపీ వేరుగా చూసే అవకాశం ఉంది. ఎందుకంటే. ఇప్పుడు ఇవ్వబోయే మేనిఫెస్టో సంయుక్తంగా ఉంటే.. దేశవ్యాప్తంగా కూడా మోడీకి ఇబ్బంది అవుతుంది. సో.. మిత్రపక్షాల మధ్య మేనిఫెస్టో ఎలాంటి మార్పులకు దారి తీస్తుందో చూడాలి.