జగన్ వర్సెస్ పవన్ : ఎవరు కౌరవులు... ఎవరు పాండవులు...?
అందులో కీలకమైనది దుష్ట చతుష్టయం అన్నది. దుష్ట చతుష్టయం అంటే ధుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకునిగా అభివర్ణిస్తారు
ఏపీలో కురుక్షేత్ర మహా సంగ్రామం జరగబోతోంది వచ్చే ఎన్నికల్లో హోరా హోరీగా పోరు ఉంటుందని విజయవాడలో ఇటీవల జరిగిన ఒక సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు. ఆయన దాని కంటే ముందు కొన్ని సభలలో కూడా ఏపీలో జరిగే ఎన్నికలను కురుషేత్ర యుద్ధంగానే పోల్చారు. అంతే కాదు ఆయన మహాభారతంలోని కొన్ని పాత్రలకు పెట్టిన పేరుని కూడా వాడుతూ వస్తున్నారు.
అందులో కీలకమైనది దుష్ట చతుష్టయం అన్నది. దుష్ట చతుష్టయం అంటే ధుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకునిగా అభివర్ణిస్తారు. మరి ఏపీ మహాభారతంలోకి దీన్ని అన్వయిస్తే జగన్ అంతగా విడమరచి చెప్పకపోయినా ధుర్యోధనుడు అంటే చంద్రబాబే అని ఆయన దోస్తుగా కర్ణుడుగా పవన్ ఉంటారని, ఇక శకుని పాత్ర టీడీపీ అనుకూల మీడియా పోషిస్తోందని, దుశ్శాసనులుగా బాబుకు మద్దతు ఇచ్చేవారు అంతా అని ఒక బ్రాడ్ అర్ధం వచ్చేట్టుగా వైసీపీ ప్రచారం చేస్తోంది.
అంటే దుష్ట చతుష్టయం అని జగన్ ప్లీనరీ నుంచి మొదలెట్టి చాలా సభలలో ఇప్పటిదాకా చెబుతూ వచ్చారు. అంటే కౌరవులు టీడీపీ మిత్ర పక్షాలు అన్నది ఆయన ఏనాడో డిక్లేర్ చేసేసారు అన్న మాట. ఇపుడు అవనిగడ్డలో జరిగిన వారాహి యాత్రలో పవన్ తనదైన శైలిలో కౌరవులు పాండవులు ఏపీ కురుక్షేత్రంలో ఎవరో విడమరచి చెప్పుకొచ్చారు.
ఎటూ జగన్ కురుక్షేత్ర యుద్ధం అన్నారు కాబట్టి అటు వైపు 151 మంది ఎమ్మెల్యేలతో అధికారంలో ఉంటూ విపక్షాలను ఇబ్బంది పెడుతున్న వారు కచ్చితంగా కౌరవులే అని పవన్ అంటున్నారు. తాము మాత్రం పాండవులమే అంటున్నారు. ఇక పవన్ పరిభాషలో ఆయన శైలిలో చూసుకుంటే పాండవులలో ధీటైన అర్జునుడి పాత్ర ఆయనదే అంటున్నారు.
అలా ఆయన గేమ్ చేంజర్ గా ఉంటూ విపక్ష రాజకీయాన్ని కీలక మలుపు తిప్పనున్నారు అని అంటున్నారు. అవతల పక్షం కౌరవులు అని చెబుతూ ఓటమి వారిదే అంటున్నారు. ఇలా ఏపీలో అధికార విపక్షాలు రెండూ కురుక్షేత్ర యుద్ధమే అంటున్నాయి. కానీ తాము పాండవులమని అంటూ ప్రత్యర్ధులను కౌరవులతో పోలుస్తున్నారు
ఇంతకీ ప్రజాస్వామ్యంలో జరిగే ఈ ఎన్నికల్లో ప్రజల పాత్ర ఏంటి అంటే అచ్చంగా శ్రీకృష్ణుడి పాత్రే అని అంటారు. అయితే చిత్రమేంటి అంటే ఇప్పటికి అయిదు వేల ఏళ్ల క్రితం జరిగిన మహా భారత యుద్ధంలో అప్పుడు ఆంధ్రులు కౌరవుల పక్షానే ఉండి యుద్ధం చేశారని పరిశోధకులు అంటూంటారు. మరి అసలైన కురుక్షేత్రంలో టోటల్ ఆంధ్రులు అంతా కౌరవుల పార్టీగా నిలిచినపుడు ఏపీలో పాండవుల ప్రస్తావన ఎక్కడిది అన్నది ఒక సెటైర్. ఏది ఏమైనా ప్రజలే అంతిమ ప్రభువులు వారే అసలైన నిర్ణేతలు కాబట్టి వారి తీర్పు రేపటి ఎన్నికల్లో ఎలా ఉండబోతోందో చూడాల్సి ఉంది. అంత మాత్రాన ఓడిన వారు కౌరవులు అని ఎవరూ అనరూ అనలేరు కూడా.