చంద్రబాబు వర్సెస్ రోజా.. మాస్ వార్
చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబును రావణాసురుడితో పోల్చారు. ''రావణుడి ప్రతిరూపం అయిన చంద్రబాబు నోటివెంట ఇలాంటి అబద్ధాలు కాకుండా ఇంకేం వస్తాయి'' అని పేర్కొన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ నాయకురాలు, మంత్రి రోజాల మధ్య మాస్ వార్ తెరమీదికి వచ్చింది. నేరుగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోకపోయినా.. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు రోజా కౌంటర్ ఇచ్చారు. అయితే.. ఆమె వ్యాఖ్యలను పరోక్షంగా చంద్రబాబు తిప్పికొట్టారు. దీంతో తొలిసారి చంద్రబాబు వర్సెస్ రోజాల మధ్య మాస్ వార్ తెరమీదికి వచ్చినట్టయింది.
చంద్రబాబు ఏమన్నారంటే..
శ్రీరామ నవమి సందర్భంగా శుభాకాంక్షలు చెప్పిన చంద్రబాబు.. రాష్ట్రంలో రామరాజ్యం వచ్చేందుకు.. మరికొన్ని రోజులే ఉన్నాయని చెప్పారు. వైసీపీ పాలనలో 'హిందూ భక్తుల మనోభావాలపై గొడ్డలి పోట్లు' అనదగ్గ సుమారు 160 ఘటనలు జరిగినా ప్రభుత్వం పట్టించుకోలేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు జరిగినా.. సీఎం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారని చెప్పారు. రామతీర్థంలో రాముడి శిరస్సును ఛేదిస్తే.. పట్టించుకున్న దిక్కులేదన్నారు. అందుకే రాష్ట్రంలో రామరాజ్యం కోసం 5 కోట్ల మంది ఎదురు చూస్తున్నారని చెప్పారు.
రోజా కౌంటర్..
చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబును రావణాసురుడితో పోల్చారు. ''రావణుడి ప్రతిరూపం అయిన చంద్రబాబు నోటివెంట ఇలాంటి అబద్ధాలు కాకుండా ఇంకేం వస్తాయి'' అని పేర్కొన్నారు. అదే సమయంలో చంద్రబాబు హయాంలో విజయవాడలో వందల ఆలయాలు కూల్చేశారని ఆమె వ్యాఖ్యానించారు. రామతీర్థం ఘటనపై సీఎం జగన్ అప్పటికప్పుడు సమీక్ష నిర్వహించి.. రూ. కోట్ల సొమ్మును ఇచ్చి.. ఆయల పునర్నిర్మాణానికి ప్రయత్నించిందన్నారు. జగన్ పాలనే రామరాజ్యమని.. దీనిని ఎవరూ తీసుకురాలేరని అన్నారు. అంతేకాదు.. చంద్రబాబు లాంటి రాక్షసులు చెప్పేది తప్పుడు చరిత్రగా రోజా వ్యాఖ్యానించారు.
చంద్రబాబు రివర్స్ కౌంటర్ రోజా వ్యాఖ్యలపై చంద్రబాబు మరోసారి పరోక్షంగా వ్యాఖ్యానించారు. కొందరు మాట్లాడుతున్నారు.. ఇప్పుడు రామరాజ్యం ఉందని.. రామరాజ్యం అంటే.. గనులు దోచుకోవడం.. బీసీలను అణిచేయడం.. ఎస్సీ ఎస్టీలను హత్యలు చేయడం.. శవాలను డోర్ డెలివరీ చేయడం.. బాబాయిని లేపేయడమేనా? అని పెడన సభలో ప్రశ్నించారు.