ఏపీలో రీసౌండ్ : జగన్... బాబు...పవన్. షర్మిల...!

ఏపీలో రానున్న కాలం అంతా పొలిటికల్ గా రీసౌండ్ అని అంటున్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలోకి టీడీపీ అధినేత చంద్రబాబు దిగిపోయారు.

Update: 2024-01-22 02:30 GMT

ఏపీలో రానున్న కాలం అంతా పొలిటికల్ గా రీసౌండ్ అని అంటున్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలోకి టీడీపీ అధినేత చంద్రబాబు దిగిపోయారు. ఆయన ఒక్క జనవరి నెలలోనే పాతిక దాకా బహిరంగ సభలను కవర్ చేస్తున్నారు. మొత్తం ఉమ్మడి ఏపీలోని పదమూడు జిల్లాలను టచ్ చేస్తున్నారు. ప్రత్యేక హెలికాప్టర్ లో బాబు ఏపీ అంతా కలియ తిరుగుతున్నారు రోజుకు రెండు నుంచి మూడు సభలలో బాబు పాల్గొంటున్నారు.


ఇక జగన్ ఈ నెల 27న ఉత్తరాంధ్రా నుంచి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు. ఆయన భీమునిపట్నంలో జరిగే భారీ బహిరంగ సభతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతారు అని అంటున్నారు. వైసీపీ అభ్యర్ధుల ఎంపికను పూర్తి చేసుకుని ఆ మీదట ఎన్నికల ప్రచారం ముగిసేంతవరకూ జనంలోనే ఉండాలన్నది జగన్ ఆలోచన.

అయితే ముఖ్యమంత్రిగా ప్రభుత్వ అధినేతగా ఆయనకు కీలక బాధ్యతలు ఉన్నాయి. దాంతో ఫిబ్రవరిలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కొంత సమయం వెచ్చించాల్సి ఉంది. ఆ తరువాత జగన్ పూర్తిగా జనంలోనే ఉంటారని అంటున్నారు. జగన్ బహిరంగ సభలకే మొగ్గు చూపిస్తున్నారు అని తెలుస్తోంది. మొదట్లో వినిపించిన మాట ఏంటంటే బస్సు యాత్ర చేస్తారు అని. కానీ టైం సరిపోదు, పైగా ప్రభుత్వ కార్యక్రమాలు కూడా చూసుకోవాల్సి ఉంది.

దాంతో జగన్ వంద దాకా బహిరంగ సభలలో 2024 ఎన్నికల నేపధ్యంలో పాల్గొనబోతున్నారు. అంటే ఏపీలోని మొత్తం ఉమ్మడి పదమూడు జిల్లాలలో పాతిక ఎంపీ సీట్లలో ప్రతీ ఎంపీ సీటులో నాలుగేసి సభలు ఉంటాయన్న మాట. పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. అందులో నాలుగింటికి పూర్తి స్థయిలో కవర్ చెయాలన్నది జగన్ ఆలోచనగా కనిపిస్తోంది.

ఇక టీడీపీ జనసేన అభ్యర్ధుల లిస్ట్ పూర్తిగా బయటకు తెచ్చాక ఏపీ వ్యాప్తంగా ఉమ్మడి సభలను నిర్వహించాలని డిసైడ్ అయ్యాయి. అలా చూసుకుంటే కనుక చంద్రబాబు పవన్ ఎవరికి వారు విడిగా ఎన్నికల ప్రచారం చేపడుతూనే బహిరంగ సభలను కలివిడిగా నిర్వహించాలని నిర్ణయించారు. ఆ విధంగా విపక్షం వైపు ఏపీ ప్రజలను తిప్పుకోవాలని చూస్తున్నారు.

ఇపుడు ఈ రేసులోకి కాంగ్రెస్ కూడా వచ్చి చేరింది. ఆ పార్టీ తరఫున వైఎస్ షర్మిల ఏపీ అంతటా విస్తృతంగా తిరగడానికి రెడీ అయ్యారు. ఆమె బస్సు యాత్ర ద్వారా జనంలోకి రావాలని చూస్తున్నారు. పాదయాత్రకు టైం సరిపోదు, పైగా ఎన్నికల సమయంలో అన్ని జిల్లాలను కవర్ చేయాలి. దాంతో బస్సు యాత్ర ద్వారా ఏపీ అంతటా షర్మిల టూర్లు ఉంటాయని అంటున్నారు. ఈ నెలాఖరు నుంచి ఏపీలో కీలక నేతలు అంతా జనంలోనే ఉంటారని తెలుస్తోంది. ఏపీలో పొలిటికల్ హీట్ ని పెంచేలా వీరి ప్రసంగాలతో హోరెత్తించడం ఖాయం.

మొత్తానికి ఈసారి ఎన్నికల్లో ప్రత్యేకతలు బోలెడు ఉన్నాయి. అన్న జగన్ ముఖ్యమంత్రి. చెల్లెలు షర్మిల విపక్షంలో ఉంటున్నారు. అలాగే సినీ నటుడు పవన్ చంద్రబాబు కలసి మల్టీ స్టారర్ పొలిటికల్ పిక్చర్ ని చూపించబోతున్నారు. టీడీపీకి చంద్రబాబుతో పాటుగా నారా లోకేష్ కూడా పాలుపంచుకునే అవకాశాలు ఉన్నాయి.

అలాగే నారా భువనేశ్వరి ఇంకా ఇతర కుటుంబీకులు కూడా రానున్నారు. ఇదంతా టీడీపీ వైపున ఉంటే బీజేపీ నుంచి దగ్గుబాటి పురంధేశ్వరి ఎన్నికల ప్రచారం చేయనున్నారు. మొత్తానికి చూస్తే ఒకనాటి మహా భారత ఘట్టం మాదిరిగా బంధువులు స్నేహితులు రక్త బంధాలు అంతా కూడా ఎదురు బొదురుగా నిలిచి వచ్చే ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్ధులను లక్ష్యంగా చేసుకోనున్నారు.

Tags:    

Similar News