ఓటేయమన్నారు.. వేశాక.. తల పట్టుకున్నారు?
పెద్ద ఎత్తున జరిగిన ప్రచారంతో వృద్ధులు, మహిళలు.. ఇతర సామాజిక వర్గాలు కూడా క్యూ కట్టేశారు.
''రండో రండి.. ఓటేయండి..'' అంటూ.. అన్ని పార్టీలూ పిలుపునిచ్చాయి. ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి కూడా ఓటర్లను తీసుకువచ్చి ఓట్లేయించుకున్నారు. ఏపీలో జరిగిన పోలింగ్‌కోసం.. ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి వచ్చే వారితో పోలింగ్‌కు ముందు రెండు రోజులు కూడా హైవేలు కిక్కిరిసి పోయాయి. ఇక, పట్టణాలు, గ్రామాల్లోనూ గతంలో ఎన్నడూ లేని చైతన్యం వచ్చింది. పెద్ద ఎత్తున జరిగిన ప్రచారంతో వృద్ధులు, మహిళలు.. ఇతర సామాజిక వర్గాలు కూడా క్యూ కట్టేశారు.
భారీ స్థాయిలో అంటే.. కనీవినీ ఎరుగని రీతిలో ఏపీలో పోలింగ్ జరిగింది. 81.86 శాతం పోలింగ్‌నమోదు కావడం.. చరిత్రలోనే తొలిసారి. ఒకరకంగా చెప్పాలంటే..ఏపీ కొత్త చరిత్రనే సృష్టించింది. మహిళలు భారీ సంఖ్యలో వచ్చి పోటెత్తారు. పురుషులతో పోలిస్తే.. 4.26 లక్షల మందిమహిళలు అధికంగా ఓటేశారు. ఇక, యువత జోరుగా పోలింగ్‌లో పాల్గొంది. మొత్తంగా క్రతువు ముగిసిపోయింది. ఇప్పుడు పోలింగ్ సరళిని గమనిస్తే.. ఏ పార్టీకీ మనసు కుదురుగా లేదు.
తామే గెలుస్తామని.. ధీమాగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ వ్యతిరేకత అందామా? 70-75 వరకు జరిగితే అలానే చెప్పుకోవచ్చు. కానీ, కొన్ని కొన్ని చోట్ల 90 శాతంకూడా పోలింగ్ నమోదైంది. మెజారిటీగా 148 నియోజకవర్గాల్లో అయితే.. 80 శాతం పోలింగ్ దాటిపోయింది. ఈ పరిణామాతో ఎవరు తమకు అనుకూలంగా ఉన్నారు? ఎవరు తమకు ప్రతికూలంగా ఉన్నారు? అనే విషయాలను అంచనా వేయలేక.. పార్టీలు, నాయకులు, అభ్యర్థులు కూడా తలలు పట్టుకునే పరిస్థితి నెలకొంది.
ఓటు వేయాలని పిలుపునిచ్చిన నాయకులు కూడా ఇదేం ఓటింగు.. ఇదేం ఓటింగు.. అంటూ.. తల పట్టు కున్నారు. పైగా.. ఎవరు వెళ్లి అడిగా.. అడిగిన వ్యక్తిని బట్టి .. ఓటరు.. మీకే ఓటేశాం! అని చెబుతున్నారు. ఎక్కడా అనుమానం కూడా లేకుండా.. ఏమాత్రం కూడా తడబడకుండా వారు సమాధానం చెబుతున్నా.. ఎవరికీ ఓటరు నాడి అందడం లేదు. దీంతో ఎన్నికల పోలింగ్‌కు ముందు ఇంతగా రియాక్షన్ ఉంటుందని ఊహించని నాయకులు ఇప్పుడు తర్జన భర్జన పడుతూ.. తల పట్టుకునే పరిస్థితి వచ్చింది.