ఏపీలో సర్వేల దాడి... హాట్ హాట్ ప్రశ్నలు ఇవే..!
మరో మూడు మాసాల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇంకో మాటలో చెప్పాలంటే.. సార్వత్రిక సమరం కూడా జరగనుంది
మరో మూడు మాసాల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇంకో మాటలో చెప్పాలంటే.. సార్వత్రిక సమరం కూడా జరగనుంది. అదేసమయంలో ఒడిసా, అరుణాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోనూ ఎన్నికలు జరగనున్నాయి. అయితే.. ఏ ఎన్నికలు జరిగినా.. ఏపీ అసెంబ్లీ ఎన్నికలపైనే అందరి ఫోకస్ ఉంది. ఇటు.. బలమైన మిత్రపక్షమని చెప్పుకొంటున్న టీడీపీ-జనసేన, మరోవైపు.. సుపరిపాలన, సంక్షేమ పాలన అందించామని చెబుతున్న వైసీపీ ఉంది. ఇంకో వైపు కేంద్రం ఇస్తన్న నిధులతోనే రాష్ట్రం డెవలప్ అయిందని.. బీజేపీ కూడా ఉవచిస్తోంది.
ఈ పరిణామాలతో ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. ఇక, ఈ పరిస్థితిలో జనం నాడిని తెలుసుకునేందుకు సర్వే సంస్థలు కూడా వాలిపోతున్నాయి. ప్రధాన సర్వే సంస్థలైన చాణిక్య , సీఎన్ ఎన్, టైమ్స్ నౌ, జనం నాడి వంటివి ఇప్పటికే ప్రధాన నగరాల్లో తమ వారిని రంగంలోకిదింపేశాయని తెలుస్తోంది. ఈ దఫా రెండు రకాలుగా ఈ సర్వేలు చేపట్టనున్నట్టు ఆయా సంస్థల అధినేతలు చెబుతున్నారు. ఒకటి జనం నాడిని పట్టుకోవడమే కాకుండా.. పార్టీ పరిస్థితి కూడా అంచనా వేయనున్నాయి. తెలంగాణలో ఎదురైన కొన్ని అనుభవాల నేపథ్యంలో ఇక్కడ అలాంటి ఎదురు దెబ్బలు తగల కుండా చూసుకోవాలని భావిస్తున్నాయి.
ముఖ్యంగా మూడు రాజధానులు, ప్రత్యేక హోదా, పోలవరం, విశాఖ ఉక్కు ప్రైవేటీ కరణపై ఇప్పటికే ఆన్‌లైన్‌లో సర్వేలు సాగుతున్నాయి. వీటిపై ప్రజలు కూడా భిన్నమైన ఫలితాలనే ఇస్తున్నారు. అయితే.. ఇది కేవలం బాగా చదువుకున్న వారు, స్మార్ట్ ఫోన్ చేతిలో ఉన్నవారికే పరిమితమైంది. ఇక, మరో కోణంలో సంక్షేమ పథకాల అంశం మిగిలి ఉంది. ఏ పార్టీ అయితే.. మీకు సంక్షేమం విషయంలో నమ్మకంగా ఉందనే ప్రశ్న సంచలనంగా మారింది. ప్రజలు ఎలాంటి స్పందనతో ఉన్నారనేది కూడా.. ఈ ఒక్క ప్రశ్నతోనే తేలిపోతుందని.. సర్వేలు చెబుతున్నాయి.
అదే సమయంలో సీఎంగా ఎవరిని కోరుకుంటున్నారు? అనేది మరో ప్రశ్న, ముఖ్యంగా ముగ్గురు నాయకులు ఈ రేసులో ఉన్నట్టుగా సర్వేలు అడుగుతున్నాయి. ఇలా .. కొన్ని కీలకమైన ప్రశ్నావళిని సిద్ధం చేసుకుని సర్వే సంస్థలు దూకుడుగా ముందుకు సాగేందుకు ప్రయత్నాలు అయితే.. ప్రారంభమైపోయాయి. ఇక, జనం ఎలా రియాక్ట్ అవుతారు? అసలు వాస్తవాలు చెబుతారా? లేక.. ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో సర్వేలకు ఒకటి చెప్పి.. ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తారా? అనేది తేలాల్సి ఉంది. ఏదేమైనా ఇప్పుడుఏపీలో సర్వేల పాలన సాగుతుండడం గమనార్హం.