విద్యుత్ బకాయిలకు పరిష్కారం దొరికిందా ?

తెలంగాణా నుండి వేల కోట్ల రూపాయల బకాయిల ను ఏపీకి ఇప్పించే బాధ్యత తీసుకున్నట్లు పార్లమెంట్ లో విద్యుత్ శాఖ మంత్రి ఆర్ కే సింగ్ ప్రకటించారు.

Update: 2023-08-02 05:23 GMT

విద్యుత్ బకాయిల చెల్లింపు అంశం తెలుగు రాష్ట్రాల మధ్య చాలా కాలంగా నలుగుతున్న కీలకమైన వివాదం. రాష్ట్ర విభజన దగ్గరనుండి మొదలైన ఈ వివాదం ఇంతవరకు పరిష్కారం కాలేదు. అలాంటి వివాదానికి ఇపుడు పరిష్కార మార్గం దొరికింది. పరిస్థితులు అన్నీ అనుకూలిస్తే తొందరలోనే పెద్ద మొత్తం లో ఏపీ ఖజనా కు బకాయిలు జమవుతాయనే అనుకోవాలి. ఇంతకీ విషయం ఏమిటంటే విభజన చట్టం ప్రకారం తెలంగాణా ప్రభుత్వం ఏపీకి సుమారు రూ. 6500 కోట్లు చెల్లించాలి.

విభజన చట్టప్రకారం చెల్లించాల్సిన బకాయిలు కాబట్టి చెల్లించక వేరేదారిలేదు. అధికారం లోకి వచ్చిన కేసీఆర్ మొదట్లో కాస్త సానుకూలంగానే ఉన్నా తర్వాత అడ్డం తిరిగారు. ఎట్టి పరిస్థితుల్లోను బకాయిలు చెల్లించేది లేదు పొమ్మన్నారు. దాంతో వివాదం అలా నలుగుతునే ఉంది.

బకాయిల విషయమై ఏపీ ప్రభుత్వం ఫిర్యాదుచేసినా కేంద్రప్రభుత్వం పట్టించుకోలేదు. నిజానికి విభజన చట్టాన్ని అమలు చేయించాల్సిన బాధ్యత కేంద్ర హోంశాఖదే. వివాదాన్ని పట్టించుకోకపోగా రెండు రాష్ట్రాలే తేల్చుకోవాలని చెప్పి చేతులు దులుపేసుకుంది.

అయితే అదునుచూసి ఏపీ ప్రభుత్వం చేసిన ఒత్తిడి ఫలితంగా కేంద్రం దిగొచ్చింది. తెలంగాణా నుండి వేల కోట్ల రూపాయల బకాయిల ను ఏపీకి ఇప్పించే బాధ్యత తీసుకున్నట్లు పార్లమెంట్ లో విద్యుత్ శాఖ మంత్రి ఆర్ కే సింగ్ ప్రకటించారు.

నరేంద్ర మోదీ ప్రభుత్వం పై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రకటించాయి కదా దాన్నే జగన్మోహన్ రెడ్డి అవకాశంగా తీసుకున్నారు. ఎందుకంటే అవిశ్వాస తీర్మానం అని కాదు కానీ తర్వాత ప్రవేశ పెట్టబోయే రెండు బిల్లుల కు జగన్ సహకారం కేంద్రానికి చాలా అవసరం.

కేంద్రానికి మద్దతుకు, పెండింగ్ బకాయిల కు ప్రభుత్వం మెలిక పెట్టింది. దాంతో కేంద్రం దిగొచ్చింది. కేంద్రం నుండి తెలంగాణ కు ఇచ్చే పన్నుల వాటా నుంచి బకాయి మొత్తాన్ని మినహాయించి దాన్ని ఏపీకి ఇవ్వాల ని రిజర్వ్ బ్యాంక్ ను ఆదేశించినట్లు కేంద్రమంత్రి ప్రకటించారు. కొద్దిగా ఒత్తిడి పెడితే వేల కోట్లరూపాయలు ఏపీ ఖజనా కు చేరటం ఖాయమనే అనిపిస్తోంది. ఇదే జరిగితే అనేక వివాదాల్లో కీలకమైనది పరిష్కారమైనట్లే అనుకోవాలి. మరి మిగిలిన వివాదాలు ఎప్పుడు పరిష్కారమవుతాయో ?

Tags:    

Similar News