విదేశాలకు వెళ్లే అత్యధిక విద్యార్థుల్లో ఏపీ-టీఎస్ లే టాప్!
ఈ సందర్భంగా విడుదల చేసిన వివరాల్లో ఉన్నత విద్యకోసం విదేశాలకు వెళ్తున్న భారతీయుల్లో తెలుగువారు ఎక్కువగా ఉన్నట్లు తేలింది.
ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే భారత విద్యార్థుల సంఖ్య ఇటీవల పెరుగుతోందని గణాంకాలు చెబుతున్న సంగతి తెలిసిందే. ఇందులో టాప్ ప్లేస్ లో ఉన్న రాష్ట్రాల జాబితా కూడా తాజా నివేదికలతో తెరపైకి వచ్చింది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల నుంచీ అత్యధికంగా ఉన్నత విద్యకోసం విదేశాలకు వెళ్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది.
అవును... ఇటీవల వన్ స్టేప్ గ్లోబల్ ఎడ్యుకేషన్ కాన్ క్లేవ్-2023 న్యూఢిల్లీలో "ఎంపవరింగ్ మైండ్స్ & ఇగ్నైటింగ్ గ్లోబల్ జర్నీస్" అనే థీం పై జరిగింది. ఈ సందర్భంగా విడుదల చేసిన వివరాల్లో ఉన్నత విద్యకోసం విదేశాలకు వెళ్తున్న భారతీయుల్లో తెలుగువారు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఈ జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు పంజాబ్, మహారాష్ట్ర లు టాప్ ప్లేస్ లో ఉన్నాయి.
తాజా అధ్యయనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ రాష్ట్రాలూ విదేశీ విద్య విషయంలో అగ్రగామిగా ఉన్నాయి! ఇందులో భాగంగా తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ లలో అత్యధిక సంఖ్యలో భారతీయ విద్యార్థులు విదేశీ విశ్వవిద్యాలయాలలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. ఇండియా నుంచి వెళ్లే భారతీయుల్లో రెండు రాష్ట్రాలు కలిపి మొత్తంగా 12.5% ఉన్నారు.
ఇదే క్రమంలో ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ – తెలంగాణతో పాటు పంజాబ్, మహారాష్ట్ర లు కూడా 12.5 శాతం తో ఉండగా... తర్వాత స్థానాల్లో గుజరాత్, ఢిల్లీ – ఎన్సీఆర్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు తలో 8శాతంతో ఉన్నాయి.
బియాండ్ బెడ్స్ & బౌండరీస్: ఇండియన్ స్టూడెంట్ మొబిలిటీ రిపోర్ట్ - 2023 ప్రకారం... విద్యార్థులు ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా దేశాలవైపు మొగ్గుచూపుతున్నారని... వీటిని ఫస్ట్ ప్రియారిటీగా పెట్టుకుంటున్నారని తెలుస్తుంది. ఇదే సమయంలో వీటి తర్వాతి స్థానంలో జర్మనీ, ఐర్లాండ్, సింగపూర్, రష్యా, ఫిలిప్పీన్స్, ఫ్రాన్స్, న్యూజిలాండ్ తో సహా అభివృద్ధి చెందుతున్న గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు.
గణాంకాల ప్రకారం... 2019లో సుమారు 10.9 లక్షల మంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో విద్యను అభ్యసించగా.. 2022లో ఆ సంఖ్య 7% వృద్ధితో 13.24 లక్షల మందికి చేరింది. ఇదే క్రమంలో ఇది 15% వృద్ధి చెందితే ఫలితంగా 2025 నాటికి 20 లక్షల మంది విద్యార్థులకు చేరుతుందని అంటున్నారు. ఇదే సమయంలో... 2019లో విదేశీ విద్యపై ఖర్చు 37 బిలియన్ డాలర్లుగా అంచనా వేయబడితే... 2025 నాటికి అది 70 బిలియన్ డాలర్కు పెరుగుతుందని అంచనా వేయబడింది.
కాగా... ఇటీవల పార్లమెంటులో సమర్పించిన విద్యా మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థులు 2022లో ఆరేళ్ల గరిష్ట స్థాయి 7,50,365గా నమోదైన సంగతి తెలిసిందే. 2021లో విదేశాలకు వెళ్లే 4,44,553 మంది విద్యార్థులతో పోలిస్తే విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపింది.