వారి మాటల్ని విని మోసపోయామంటున్న వాలంటీర్లు!

ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల వేళలో నాటి అధికార వైసీపీకి అనుకూలంగా పని చేసేందుకు వీలుగా లక్షకు పైగా వాలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేయటం తెలిసిందే

Update: 2024-06-16 04:59 GMT

ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల వేళలో నాటి అధికార వైసీపీకి అనుకూలంగా పని చేసేందుకు వీలుగా లక్షకు పైగా వాలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేయటం తెలిసిందే. వారి అంచనాలకు భిన్నంగా ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓటమి పాలు కావటం.. తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావటంతో ఇప్పుడు సదరు వాలంటీర్లు స్థానిక టీడీపీ ఎమ్మెల్యేల వద్దకు వెళ్లి తమను మళ్లీ విధుల్లో చేర్చుకోవాలంటూ వేడుకుంటున్నారు.

ఏపీలోని వివిధ జిల్లాల్లో అలాంటి పరిస్థితి నెలకొంది. వైసీపీ నేతలు తమను తీవ్ర ఒత్తిడికి గురి చేశారని.. అందుకే తమ పదవులకు రాజీనామా చేసినట్లుగా వారు వాపోతున్నారు. తాము మోసపోయినట్లుగా వాపోతున్న వాలంటీర్లలో అత్యధికం మహిళలు ఉండటం గమనార్హం. ఏపీలోని విశాఖపట్నం, ఏలూరు, ప్రకావం.. అనంతపురం, కర్నూలు, క్రిష్ణా జిల్లాలకు చెందిన వాలంటీర్లు పలువురు ఎమ్మెల్యేలను కలిసి తమ ఆవేదనను షేర్ చేసుకుంటున్నారు.

వైసీపీ నేతలు తమను రోడ్డున పడేశారని.. ఎన్నికల ముందు తమతో బలవంతంగా రాజీనామా చేశారని.. పదవులకు రాజీనామా చేయకుంటే మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలగిస్తామని ఎమ్మెల్యేలు మొదలు కార్పొరేటర్లు.. కౌన్సిలర్లు.. సర్పంచులు బెదిరించారని.. వారి ఒత్తిడితోనే తాము తమ పదవులకు రాజీనామా చేశామని వాపోతున్నారు. తమను తిరిగి విధుల్లో చేర్చుకోవాలని కోరుకుంటున్నారు.

ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాల్ని లబ్థిదారులకు ఇంటి గుమ్మం ముందు వరకు చేర్చేందుకు వీలుగా వాలంటీర్ల వ్యవస్థను జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేయటం తెలిసిందే. నెలకు రూ.5వేల గౌరవ వేతనాన్ని ఇచ్చే వారు. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తారన్న ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు.. పవన్ కల్యాణ్ ఇద్దరు తాము వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయమని.. తమ పార్టీ అధికారంలోకి వస్తే వాలంటీర్ల జీతాల్ని డబుల్ చేస్తామని.. రూ.10వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. వైసీపీ కోసం తాము తమ పదవులకు రాజీనామా చేసి.. ఎన్నికల్లో ఆ పార్టీ తరఫు ప్రచారం చేసేందుకు వీలుగా తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు.

ఇలా చేసిన వారు దాదాపు లక్షకు (సరిగ్గా చెప్పాలంటే 1.08 లక్షలు) పైనే ఉన్నారు. అదే సమయంలో మిగిలిన వారు మాత్రం రాజీనామా చేయలేదు. ఇప్పుడేమో తమపై ఒత్తిడి తీసుకురావటం.. భయపెట్టి రాజీనామా చేశారని చెబుతున్నారు. మరి.. రాజీనామా చేయకుండా ఉన్న వారు సదరు బెదిరింపులకు.. ఒత్తిళ్లను తట్టుకున్నారు కదా? మరి వారి సంగతేంటి? ఒకవేళ వైసీపీ కానీ మళ్లీ అధికారంలోకి వస్తే వారి పరిస్థితేమిటి? అన్నది మరో చర్చగా మారింది. ప్రభుత్వంలో ఎవరున్నా సరే.. వారెంత బెదిరింపులకు గురి చేసినా.. ఒత్తిళ్లు పెట్టినా ఎవరికి వారు తమ విధి ధర్మాన్ని పాటించాలే కానీ ఒత్తిడికి గురి కాకూడదన్న విషయం తాజా గుణపాఠంగా మారిందని చెప్పాలి.

Tags:    

Similar News