పోలింగ్ కి వేళాయేరా !

దాంతో ఈ ఎన్నికల్లో 83 శాతం ఓటింగ్ లక్ష్యంగా పెట్టుకున్నారు. అధిక పోలింగ్ కోసం అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Update: 2024-05-13 04:00 GMT

అతి పెద్ద ప్రజాస్వామ్య పండుగ ఏపీలో సందడి చేస్తోంది. ఏపీలో పోలింగ్ కి అంతా సిద్ధంగా ఉన్నారు. అటు ఈవీఎంలు కూడా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నాయి. ఏపీ ఓటర్లు రెండు ఓట్లను వేయనున్నారు. ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య నాలుగు కోట్ల 14 లక్షల 1887 మందిగా ఉన్నారు.

ఇందులో పురుష ఓటర్లు 2,03,39,851 మంది అలాగే, మరో 2,10,58,615 మంది మహిళా ఓటర్లు, 3,421 మంది ట్రాన్స్ జండర్స్ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈసారి ఎన్నికలలో రాష్ట్రంలోని మొత్తం 25 పార్లమెంటరీ స్థానాలకు 454 మంది, 175 అసెంబ్లీ స్థానాలకు 2,387 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

ఈసారి ఎన్నికల కోసం మొత్తం 1.60 లక్షల కొత్త ఈవీఎంలను ఉపయోగిస్తున్నారు. ఒకవేళ వీటికి ఏమైనా ఇబ్బందులు తలెత్తితే వీటికి అదనంగా మరో 20 శాతం కొత్త ఈవీఎంలను కూడా సిద్దంగా ఉంచుతున్నారు. మరో వైపు చూస్తే ఈసారి ఎన్నికల్లో 83 శాతం ఓటింగ్ లక్ష్యంగా చర్యలు తీసుకునేందుకు అధికారులు చూస్తున్నారు.

రాష్ట్రంలో 2019లో జరిగిన ఎన్నికల్లో 79.84 శాతం ఓటింగ్ నమోదు అయింది. ఈసారి కొత్తగా ఓటర్లు పెద్ద ఎత్తున నమోదు అయ్యారు. దాంతో ఈ ఎన్నికల్లో 83 శాతం ఓటింగ్ లక్ష్యంగా పెట్టుకున్నారు. అధిక పోలింగ్ కోసం అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

దాంతో భారీ పోలింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ ద్వారా రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది. ఇపుడు మామూలు పోలింగ్ కూడా అదే స్థాయిలో జరిగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇంకో వైపు చూస్తే ఓటర్లు కూడా ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి రావడంతో పాటు ఓటు వేసేందుకు ఉత్సాహం చూపడంతో ఈసారి పోలింగ్ అన్నది భారీగానే జరుగుతుంది అని అంటున్నారు.

గతసారి భారీ పోలింగ్ అధికార టీడీపీకి వ్యతిరేకంగా సాగి గద్దె దిగేలా చేసింది. ఈసారి భారీ పోలింగ్ జరిగితే అది ఏ రకమైన సంకేతాలకు దారి తీస్తుంది అన్నది కూడా చూడాల్సి ఉంటుంది అని అంటున్నారు. ఏది ఏమైనా పోలింగ్ ఈసారి గరిష్టంగానే జరుగుతుంది అన్నది ఇప్పటిదాకా ఉన్న అంచనా. పోలింగ్ సమయం కూడా పెంచడంతో పెద్ద ఎత్తున పోలింగ్ జరుగుతుందని అంతా అంటున్నారు. మొత్తానికి ఓటుకు వేళయింది. ప్రజా తీర్పునకు కూడా వేళయింది. కేంద్రంలో ఏపీలో కొత్త ప్రభుత్వాలను ఎన్నుకునేందుకు ఓటర్లు బారులు తీరుతున్నారు.

Tags:    

Similar News