ఢిల్లీలో హోటల్ ను తెగ వాడేసిన ఏపీ మహిళ.. కట్ చేస్తే అరెస్టు

హోటల్ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించే క్రమంలో ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూశాయి.

Update: 2024-01-31 06:30 GMT

ఢిల్లీలో ఏపీకి చెందిన ఒక మహిళ అరెస్టు అయ్యారు. ముదురు తెలివితేటల్ని ప్రదర్శించిన ఆమె ఇప్పుడు జైలు ఊచల్ని లెక్క పెడుతున్నారు. హోటల్ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించే క్రమంలో ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూశాయి. ఆమె బ్యాంకు ఖాతాలో కేవలం రూ.41 ఉండగా.. ఆమె మాత్రం సదరు హోటల్ లో ఏకంగా రూ.5.88 లక్షల బిల్లు చేయటం గమనార్హం.

ఢిల్లీ ఎయిర్ పోర్టుకు సమీపంలోని ఫుల్ మాన్ హోటల్ లో ఝూన్సీరాణి అనే యువతి డిసెంబరు లో 15 రోజులు ఉండేందుకు బుక్ చేశారు. హోటల్ రూం అద్దెతో పాటు.. అక్కడి స్పా సేవల్ని విపరీతంగా వాడేసిన ఆమె పుణ్యమా అని బిల్లు మొత్తం రూ.5.88లక్షలైంది. హోటల్ ను విడిచి వెళ్లే సమయంలో ఆమె యూపీఐ యాప్ ద్వారా డబ్బులు పంపినట్లుగా హోటల్ సిబ్బందికి చూపించారు.

అయితే.. ఆమె పంపిన డబ్బు వారి బ్యాంకు ఖాతాలోకి పడకపోవటంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆమెను జనవరి 13న అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో ఆమె ఉపయోగించిన ఖాతా నకిలీదిగా గుర్తించారు. అంతేకాదు.. హోటల్ లో రూం బుక్ చేసే వేళలో ఇషా దేవ్ గా నకిలీ ఐడీతో హోటల్లో ఉన్నట్లుగా తేల్చారు. మోసం కేసులో భాగంగా ఆమెపై ఐపీసీ సెక్షన్ 419, 468, 471 కింద కేసు నమోదు చేశారు.

పోలీసుల విచారణలో ఆమె ఏపీకి చెందిన వారుగా గుర్తించారు. తాను.. తన భర్త వైద్యులమని, తాము అమెరికాలో ఉంటామని ఆమె చెప్పినట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఎయిర్ పోర్టుకు సమీపంలో అన్నేసి రోజులు ఆమె ఎందుకు ఉన్నారు? అసలు ఆమె చెప్పిన వివరాలు నిజమా? కాదా? అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.


Tags:    

Similar News