అంతరిక్షంలో ఆ 'సిగ్నల్స్‌' పంపుతోంది ఏలియన్సేనా?

ఈ మేరకు ఖగోళ శాస్త్రవేత్తలు తాజాగా ఆస్ట్రేలియాలోని మూడు వేర్వేరు ప్రాంతాల గుండా ఒకే కక్ష్యలో తిరుగుతూ ప్రతి గంటకు వస్తున్న రేడియో సిగ్నల్స్‌ను గుర్తించారని చెబుతున్నారు.

Update: 2024-08-13 06:08 GMT

అనంత విశ్వంలో ఎన్నో పాలపుంతలు ఉన్నాయి. సూర్యుడిని పోలిన ఎన్నో నక్షత్రాలు, గ్రహ మండలాలు ఉన్నాయి. నవగ్రహాలు ఉన్న పాలపుంతలాంటివే అనంత విశ్వంలో లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. ఇప్పటివరకు భూమిపైన మాత్రమే జీవరాశి ఉందని తేలింది. ఇప్పటివరకు గుర్తించిన గ్రహాల్లో జీవరాశి ఉందో లేదో తెలుసుకోవడానికి వివిధ దేశాలు ఆయా గ్రహాలపైకి ఉపగ్రహాలను (శాటిలైట్లు) పంపుతున్న సంగతి తెలిసిందే.

అలాగే ఈ అనంత విశ్వంలో ఎక్కడి నుంచైనా సంకేతాలు (సిగ్నల్స్‌) అందుతాయేమోనని ఒక ఫుట్‌ బాల్‌ మైదానాన్ని మించిన స్థాయిలో అతిపెద్ద టెలిస్కోపులను కూడా ఆయా దేశాలు ఏర్పాటు చేసుకున్నాయి. అనుక్షణం ఇవి ఆకాశం నుంచి భూమిపైకి వస్తున్న వాటిపై కన్నేసి ఉంచాయి.

శాస్త్రవేత్తలు సైతం వేరే గ్రహాలపైన మనుషులు లేదా మనలను పోలిన జీవులు ఉండి ఉంటే.. మనకంటే సాంకేతికంగా ఉన్నతంగా ఉండి ఉంటే భూమికి ఏవైనా సిగ్నల్స్‌ పంపుతారేమోనని ఎంతోకాలంగా ఎదురుచూస్తూనే ఉన్నారు. ఈ దిశగా భారీ ఎత్తున పరిశోధనలు చేస్తూనే ఉన్నారు.

ఈ క్రమంలో అంతరిక్షం నుంచి తాజాగా వెలువడుతున్న వింత రేడియో సిగ్నల్స్‌ శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈ మేరకు ఖగోళ శాస్త్రవేత్తలు తాజాగా ఆస్ట్రేలియాలోని మూడు వేర్వేరు ప్రాంతాల గుండా ఒకే కక్ష్యలో తిరుగుతూ ప్రతి గంటకు వస్తున్న రేడియో సిగ్నల్స్‌ను గుర్తించారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రేడియో సిగ్నల్స్‌ ఎక్కడి నుంచి వస్తున్నాయని దానిపై శాస్త్రవేత్తలు దృష్టి సారించారు.

తాజాగా వెలువడిన రేడియో సిగ్నల్స్‌ ను ఆస్ట్రేలియన్‌ స్క్వేర్‌ కిలోమీటర్‌ అర్రే పాత్‌ ఫైండర్‌ (ఏఎస్‌కేఏపీ) రేడియో టెలిస్కోప్‌ గుర్తించింది. టెలిస్కోపు నుంచి సేకరించిన డేటాలో మొదటి సిగ్నల్‌ కనిపించింది. ఈ సిగ్నల్‌ ప్రతి 53.8 నిమిషాలకు మళ్లీ వస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ సిగ్నల్‌ ఆస్ట్రేలియాలోని మూడు వేర్వేరు రాష్ట్రాల గుండా వెళ్తోందని చెబుతున్నారు. అంతేకాకుండా ఈ సిగ్నల్‌ 10 నుంచి 50 సెకన్ల మధ్య ప్రకాశవంతమైన వెలుగులను విరజిమ్ముతోందని అంటున్నారు.

రేడియో సిగ్నల్స్‌ పై పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్త డాక్టర్‌ మనీషా కాలేబ్‌ వీటి గురించి వివరించారు. ఈ రేడియో సంకేతాలు మూడు కూడా మూడు విభిన్న ఉద్గార స్థితులను చూపుతున్నాయని తెలిపారు. వీటి లక్షణాలు ఒకదానికొకటి భిన్నంగా ఉన్నాయన్నారు. ఈ సిగ్నల్స్‌ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకోవడానికి పరిశోధనలు సాగిస్తున్నామన్నారు. అలాగే ఈ రేడియో సిగ్నల్స్‌ ఉద్దేశమేమిటో కూడా తెలుసుకోవాల్సి ఉందన్నారు.

ఈ రేడియో సిగ్నల్స్‌ ను దక్షిణాఫ్రికాలోని మీర్‌ కాట్‌ రేడియో టెలిస్కోప్‌ కూడా గుర్తించడం విÔó షం. ఈ రేడియో సిగ్నల్స్‌.. న్యూట్రాన్‌ నక్షత్రం లేదా వైట్‌ డ్వార్ఫ్‌ నుంచి వస్తున్నట్టు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

ఈ నేపథ్యంలో రేడియో సిగ్నల్స్‌ న్యూట్రాన్‌ నక్షత్రం నుండి వచ్చినవా, లేకా అంతుచిక్కని వైట్‌ డ్వార్ఫ్‌ పల్సర్‌ నుంచి వచ్చినవా అనేదానిపై పరిశోధనలు సాగిస్తున్నారు.

Tags:    

Similar News