గులాబీ కారుకు మరో దెబ్బ.. హస్తం గూటికి గ్రేటర్ ఎమ్మెల్యే గాంధీ
ఒక విధంగా చెప్పాలంటే గత ఏడాది చివర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు దక్కిన గుప్పెడు ఎమ్మెల్యేల్లో అత్యధికులు గ్రేటర్ పరిధిలో గెలిచిన వారే.
ఒకరు తరువాత మరొకరు చొప్పున.. రానున్న కొద్ది రోజుల్లో బీఆర్ఎస్ ను ఖాళీ చేయాలన్న లక్ష్యంతో పని చేస్తున్న రేవంత్ సర్కారు.. ఆ క్రమంలో మరో పెద్ద అడుగు వేసిందని చెప్పాలి. నిన్నటికి నిన్న (శుక్రవారం) గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బీఆర్ఎస్ కు చెందిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కాంగ్రెస్ కండువా కప్పుకోవటం తెలిసిందే. ఇది జరిగిన 24 గంటల కంటే తక్కువ సమయంలోనే గ్రేటర్ పరిధిలోని మరో బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి) కాంగ్రెస్ గూటికి వెళ్లిపోయారు.
శనివారం ఉదయం కుకట్ పల్లిలోని తన నివాసం నుంచి పెద్ద ఎత్తున అభిమానులతో పాటు తన నియోజకవర్గం పరిధిలోని బీఆర్ఎస్ కార్పొరేటర్లను కలుపుకొని మరీ ముఖ్యమంత్రి రేవంత్ ఇంటికి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీలోకి గాంధీ ఎంట్రీ ఇవ్వటం ద్వారా గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ నిర్వహిస్తున్న ‘ఆపరేషన్ క్లీన్’ కీలక మలుపు తిరిగినట్లుగా చెబుతున్నారు. గ్రేటర్ పరిధిలోని మజ్లిస్ ఎమ్మెల్యేలతో పాటు.. బీజేపీకి చెందిన ఒక్క ఎమ్మెల్యే మినహాయిస్తే మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న సంగతి తెలిసిందే.
ఒక విధంగా చెప్పాలంటే గత ఏడాది చివర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు దక్కిన గుప్పెడు ఎమ్మెల్యేల్లో అత్యధికులు గ్రేటర్ పరిధిలో గెలిచిన వారే. లోక్ సభ ఎన్నికలకు ముందుగా ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరటం.. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటమి పాలు కావటం తెలిసిందే. నగరానికి చెందిన కంట్ న్మెంట్ కు జరిగిన ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేశ్ విజయం సాధించారు. దీంతో.. గ్రేటర్ పరిధిలో ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు చెందిన వారుగా మారారు. గడిచిన రెండు రోజుల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి వచ్చేయటంతో.. గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య నాలుగుకు చేరుకున్నట్లైంది. రానున్న కొద్ది రోజుల్లో మరో ఆరుగురు వరకు వెళ్లే అవకాశం ఉందంటున్నారు. ఏమైనా.. వరుస షాకులతో గులాబీ కారుకు దిమ్మ తిరిగిపోతుందన్న మాట బలంగా వినిపిస్తోంది.