అంత మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులేనా.?

అది తెలంగాణా అసెంబ్లీలో సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద అసోసియేషన్ ఫొర్ డెమోక్రటిక్ రిఫార్మ్ (ఏడీయార్) ఇచ్చిన రిపోర్ట్ చూస్తే మాత్రం నమ్మి తీరాల్సిందే.

Update: 2023-10-22 03:57 GMT

ఈ నంబర్ చూస్తే అమ్మో అనిపిస్తోంది. అది తెలంగాణా అసెంబ్లీలో సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద అసోసియేషన్ ఫొర్ డెమోక్రటిక్ రిఫార్మ్ (ఏడీయార్) ఇచ్చిన రిపోర్ట్ చూస్తే మాత్రం నమ్మి తీరాల్సిందే. తెలంగాణా అసెంబ్లీలో మొత్తం 118 మంది ఎమ్మెల్యేలలో 106 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులు అంటూ ఏడీయార్ నివేదిక తేల్చి చెబుతోంది. మొత్తం 119 మంది ఎమ్మెల్యేలలో ఒక స్థానం ఖాళీగా ఉంది. అంటే 118 సిట్టింగుల లిస్ట్ తీస్తే 106 మంది కోటీశ్వరులు అని తేలింది అంటున్నారు. ఇది 90 శాతంగా పేర్కొంటున్నారు.

ఏడీయార్ నివేదికను 2018లో ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఆ తరువాత ఉప ఎన్నికల్లో నెగ్గిన ఎమ్మెల్యేలను చూసి మరీ లెక్క తేచింది అని అంటున్నారు. ఇందులో పెద్ద వాటా అధికార బీయారెస్ దే. ఆ పార్టీ తరఫున 101 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఏకంగా 93 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులుగా ఉన్నారని ఏడీయార్ నివేదిక చెబుతోంది. ఇది టోటల్ ఎమ్మెల్యేలలో 92 శాతమని పేర్కొంటున్నారు.

ఇక మజ్లీస్ తరఫున ఏడుగురు ఎమ్మెల్యేలు ఉంటే అందులో అయుదుగురు కోటీశ్వరులు. అంటే ఇది ఏకంగా 71 శాతంగా ఏడీయార్ నివేదిక తేల్చింది. ఇక కాంగ్రెస్ కి ప్రస్తుత సభలో ఆరుగురు ఎమ్మెల్యేలు ఉంటే అందులో నలుగురు కోటీశ్వరులు. అంటే ఇది 67 శాతంగా ఉంది అన్న మాట. ఇక బీజేపీలో ఇద్దరు ఎమ్మెల్యేలు కోటీశ్వరులుగా ఉంటే మరో ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కూడా కోటీశ్వరులుగా ఏడీయార్ నివేదిక లెక్క తేల్చింది.

మొత్తం 106 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులు అయితే సగటున ఒక్కో ఎమ్మెల్యే ఆస్తి 13.57 కోట్లుగా ఉందని ఏడీయార్ నివేదిక పేర్కొంటోంది. ఇక పార్టీల వారీగా తీస్తే 101 మంది బీయారెస్ ఎమ్మెల్యేలు సగటున 14.11 కోట్ల రూపాయలుగా తేలితే, ఏడుగురు మజ్లీస్ పార్టీ ఎమ్మెల్యేల సగటు ఆస్తి 10.83 కోట్ల రూపాయలుగా లెక్క తేల్సింది.

అదే విధంగా ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సగటు ఆస్తి లెక్క కడితే 4.22 కోట్ల రూపాయలు అవుతోంది. బీజేపీ ఎమ్మెల్యేల సగటు ఆస్తి 32. 61 కోట్ల రూపాయలుగా ఉంది. ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల సగటు ఆస్తి 4.66 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక ఎమ్మెల్యేల విద్యార్హతలు చూసుకుంటే 43 మంది ఎమ్మెల్యేలు అయిదు నుంచి పెన్నెండవ తరగతి దాకా చదివిన వారు ఉన్నారు. ఈ సంఖ్య 36 శాతంగా ఉంది. అలాగే మరో 69 మంది ఎమ్మెల్యేలు డిగ్రీ ఆ పై దాటి చదువుకున్నారు. ఇది 58 శాతంగా ఉంది.

ఇక అయిదుగురు ఎమ్మెల్యేలు డిప్లమా హోల్డర్స్ గా ఉన్నారు. ఒకే ఒక్క ఎమ్మెల్యే తానుగా ఏమీ చదువుకోలేదని ప్రకటించుకున్నారని ఏడీయార్ నివేదిక పేర్కొంది. ఇక వయసుల వారీగా చూసుకుంటే మొత్తం సభలో ఉన్న 118 మంది ఎమ్మెల్యేలలో 30 నుంచి 50 ఏళ్ల వయసు కలిగిన వారు 43 మంది ఉన్నారు. ఇది 36 శాతంగా ఉంది. 51 నుంచి 80 ఏళ్ళ మధ్య ఉన్న ఎమ్మెల్యేలు 75 మంది ఉన్నారు. ఇది 64 శాతంగా ఉంది. ఇక ప్రస్తుత తెలంగాణా సభలో మొత్తం 118 మంది ఎమ్మెల్యేలలో ఆరుగురు మాత్రమే మహిళలుగా ఉన్నారు. ఇది ఏడీయార్ నివేదిక చెప్పిన సారాంశంగా ఉంది.

Tags:    

Similar News