పారిపోతున్న ఉగ్రవాదిపై సైన్యం బుల్లెట్ల వర్షం... డ్రోన్ వీడియో వైరల్!

రొమ్ము విరిచుకుని నిలబడేది సైనికుడు.. వెన్ను చూపి పారిపోయేవాడు ఉగ్రవాది అనేది తెలిసిన విషయమే.

Update: 2024-09-16 08:48 GMT

రొమ్ము విరిచుకుని నిలబడేది సైనికుడు.. వెన్ను చూపి పారిపోయేవాడు ఉగ్రవాది అనేది తెలిసిన విషయమే. దొంగచాటుగా దాడి చేయడం.. దాన్ని వీరత్వంగా ప్రమోట్ చేసుకోవడం ఉగ్రవాదుల కార్యక్రమాలనేది తెలిసిన విషయమే. ఈ క్రమంలో తాజాగా పారిపోతున్న ఓ ఉగ్రవాదిపై భారత సైన్యం తుపాకుల వర్షం కురిపించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

అవును... ప్రధాని మోడీ పర్యటనకు ముందు బారాముల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ డ్రోన్ ఫుటేజీ తాజాగా వైరల్ గా మారింది. దీని ప్రకారం... ఓ ఇంటిలో ఓ ఉగ్రవాది నక్కి ఉన్నాడు. విషయం గ్రహించిన సైన్యం ఆ ఇంటిపై తూట్ల వర్షం కురిపించింది. దీంతో... పొగబెడితే కొలుగులో దాక్కొన్న ఎలుక బయటకు వచ్చినట్లుగా.. ఆ ఇంట్లో దాక్కొన్న ఉగ్రవాది బయటకు పరుగెత్తాడు.

అప్పుడు రైఫిల్ తో కాల్పులు జరుపుతూ బయటకు లగెత్తాడు. ఈ సమయంలో ఓ చోట పడిపోయాడు. తర్వాత లేచి పక్కనే ఉన్న పొదల్లో గోడచాటుకు వెళ్లి నక్కాడు. ఈ సమయంలో ఆ దిశగా సైన్యం తూటాల వర్షం కురిపించడం కనిపించింది. ఈ సమయంలో ఆ ఉగ్రవాది దాక్కొన్న పొదలపై తెల్ల పొగ కనిపిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

కాగా... బారాముల్లాలో శనివారం రాత్రి జరిగిన ఎన్ కౌంటర్లలో ముగ్గురు కరుడుగట్టిన ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. జమ్మూ కాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పాక్ వైపు నుంచి ఉగ్ర ప్రయత్నాలు తీవ్రమవుతున్నాయని అంటున్నారు. ఈ క్రమంలోనే గత వారం రోజుల్లో మూడుసార్లు ఈ ప్రయత్నాలు జరిగాయి.

సెప్టెంబర్ 18న జమ్మూకశ్మీర్ లోని 24 స్థానాల్లో తొలివిడత ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో... గత వారం రోజుల్లోనే మూడుసార్లు ఉగ్ర చొరబాట్లకు యత్నాలు జరిగాయి. మరోపక్క సుమారు 70 నుంచి 80 మంది ఉగ్రవాదులు నియంత్రణ రేఖ (ఎల్.ఓ.సీ)కి అవతలివైపు సిద్ధంగా ఉన్నట్లు సైన్యం గుర్తించిందని అంటున్నారు.

వీరంతా భారత్ లోకి ప్రవేశించేందుకు పాక్ సైన్యమే సహకరిస్తుందని చెబుతున్నారు. ఈ సమయంలో లైన్ దాటి వచ్చినవాడిని వచ్చినట్లు సైన్యం మట్టుబెడుతుంది.

Tags:    

Similar News