రోహింగ్యాలకు కేసీఆర్ పాస్ పోర్టు: వివాదాస్పద వ్యాఖ్యలతో మోడీని ఇరికించిన ఎంపీ అర్వింద్
తెలంగాణ ఎన్నికల వేళ బీజేపీ నాయకుడు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు
తెలంగాణ ఎన్నికల వేళ బీజేపీ నాయకుడు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. అదేసమయంలో ఈ వ్యాఖ్యలు.. కేంద్రంలోని మోడీ సర్కారుకు చుట్టుకుంటుం డడం గమనార్హం. తెలంగాణ నేల ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని వ్యాఖ్యానించారు. రోహింగ్యాలకు సీఎం కేసీఆర్ పాస్ పోర్ట్ లు ఇస్తున్నారని తీవ్ర విమరశలు చేశారు. కేంద్రం, రాష్ట్రంలో ప్రధాని మోడీ నాయకత్వం అవసరమని పేర్కొన్నారు. అప్పుడే రాష్ట్రంలో శాంతి భద్రతలు పటిష్టంగా ఉంటాయన్నారు. బీజేపీ వచ్చాక గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు.
కోరుట్ల నియోజకవర్గంలో తాజాగా నిర్వహించిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో అర్వింద్ ప్రసంగించారు. నియోజకవర్గంలో బీడీ కార్మికుల కోసం ప్రత్యేక ఆసుపత్రి తీసుకొస్తామని అర్వింద్ పేర్కొన్నారు. బీజేపీని ఆశీర్వదిస్తే కోరుట్లలో 15 వేల ఇళ్లు కట్టిస్తామ ని.. ఇక్కడ ప్రజలను కేసీఆర్ మోసం చేశారని వ్యాఖ్యానించారు. కాళేశ్వరంలాంటి ప్రాజెక్టులతో కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడి, లక్షల కోట్లు దోచుకుందని విమర్శించారు. డబ్బుల కోసం ఎమ్మెల్సీ కవిత ఆరాటపడి లిక్కర్ స్కాంలో దొరికారని దుయ్యబట్టారు.
అయితే.. అర్వింద్ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఉగ్రవాదం ఏరూపంలో ఉన్నప్పటికీ దానిపై యుద్ధం చేస్తామని కేంద్రంలోని మోడీ సర్కారు పదే పదే చెబుతున్న నేపథ్యంలో తెలంగాణలో ఉగ్రవాదం ఉండి ఉంటే.. ఎందుకు ఉపేక్షించారు? అనేది ప్రధాన ప్రశ్న. పైగా రోహింగ్యాల సమస్య తెలంగాణ వరకు వచ్చి ఉంటే.. ఇప్పటి వరకు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారనేది కూడా ప్రశ్న. అర్వింద్ ప్రకటించిన రెండు ప్రధాన సమస్యలు కూడా కేంద్రం పరిధిలోవే కావడం గమనార్హం. ఉగ్రవాదమైనా.. రోహింగ్యాల సమస్య అయినా.. రాష్ట్ర సర్కారు పరిధిలో లేదు.
ఇలాంటి సమస్యలు ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సింది కేంద్రంలోని మోడీ సర్కారే. అయినప్పటికీ.. ఉదాసీనంగా వ్యవహరించారంటే ఇది కేంద్రం తప్పేనని పరిశీలకులు కూడా చెబుతున్నారు. అర్వింద్ చెప్పిన రెండు విషయాలు నిజమే అయితే.. ఇప్పటి వరకు ఎందుకు ఊరుకున్నారని రాజకీయ పరిశీలకులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికల వేళ లేనిపోని ఉత్పాతాలు సృష్టించేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అంటున్నారు.