యూపీలో తెలుగు అభ్యర్థికి షాక్.. ఎవరీ శ్రీకళారెడ్డి?
అవును... లోక్ సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ నుంచి బరిలో ఉన్నారనుకున్న ఏకైక తెలుగు మహిళ శ్రీకళారెడ్డికి చివరి నిమిషంలో షాక్ తగిలింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల సందడి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో అనూహ్య పరిణామాలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్ లోని తెలుగు అభ్యర్థికి చివరి నిమిషంలో షాక్ తగలడం ఇప్పుడు ఆసక్తిగా మారింది. దీంతో అసలు ఈ అభ్యర్థి ఎవరు.. యూపీలో ఎందుకు పోటీ చేస్తున్నారు.. తగిలిన షాక్ ఏమిటి.. దాని వెనకున్న ట్విస్ట్ ఏమిటి అనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ సమయంలో ఆ వివరాలన్నీ ఇప్పుడు చూద్దాం...!
అవును... లోక్ సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ నుంచి బరిలో ఉన్నారనుకున్న ఏకైక తెలుగు మహిళ శ్రీకళారెడ్డికి చివరి నిమిషంలో షాక్ తగిలింది. నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీకి ముందు రోజు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి షాక్ ఇచ్చారు. ఈమె స్థానంలో మరో అభ్యర్థిని ఫిక్స్ చేశారు. ఇందులో భాగంగా... నాలుగు రోజుల క్రితమే నామినేషన్ దాఖలు చేసిన శ్రీకళారెడ్డికి కాకుండా శ్యామ్ సింగ్ యాదవ్ కు పార్టీ బీ-ఫామ్ అందజేశారు.
వివరాళ్లోకి వెళ్తే... 2019 ఎన్నికల్లో మోడీ వేవ్ ను ఎదుర్కొని శ్యాం సింగ్ యాదవ్ గెలిచారు. అయితే 2024 ఎన్నికల వేళ ఆ సిట్టింగ్ ఎంపీని కాదని, జౌన్ పూర్ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ గా ఉన్న శ్రీకళారెడ్డిని బీఎస్పీ అభ్యర్థిగా ప్రకటించారు మాయావతి. ఈ క్రమంలో ఆమె 4 రోజుల క్రితమే నామినేషన్ పత్రాలు సమర్పించారు. అయితే అనూహ్యంగా... చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చుతున్నట్టు బీఎస్పీ ప్రకటించింది. సిట్టింగ్ ఎంపీ శ్యాం సింగ్ కే మళ్లీ టికెట్ ఖరారు చేసింది.
దీంతో... ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. మరోపక్క ఇదే స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున మహారాష్ట్ర మాజీ హోంమంత్రి కృపాశంకర్ సింగ్ పోటీ చేస్తుండగా.. విపక్ష కూటమి (ఇండియా) తరఫున సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి బాబు సింగ్ కుష్వాహ పోటీ చేస్తున్నారు. దీంతో... ఈ ముక్కోణపు పోటీలో ఎవరు గెలుస్తారనేది ఆసక్తిగా మారింది!
ఎవరీ శ్రీకళారెడ్డి?:
తెలంగాణలోని ఓ రాజకీయ వ్యాపార కుటుంబం నుంచి వచ్చిన వారే ఈ శ్రీకళారెడ్డి. ఆమె తండ్రి జితేంద్ర రెడ్డి.. నల్గొండ జిల్లా కోఆపరేటివ్ అధ్యక్షుడిగా, హుజూర్ నగర్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే గా పనిచేశారు. ఆమె తల్లి లలిత కూడా తమ సొంతూర్లో గ్రామ సర్పంచ్ గా పనిచేశారు. నిప్పో గ్రూపు పేరుతో బ్యాటరీలు సహా వివిధ అనుబంధ వస్తువులు తయారు చేసే వ్యాపారం వీరిది!
ఈ క్రమంలో... యూపీలో గ్యాంగ్ స్టర్, రాజకీయవేత్త ధనుంజయ్ సింగ్ ను పెళ్లాడిన శ్రీకళారెడ్డి, అత్తింటికి మకాం మార్చారు. ధనుంజయ్ సింగ్ యూపీలోని జౌన్ పూర్ కేంద్రంగా రాజకీయాల్లో ప్రభావవంతమైన నేతగా ఉన్నారు. అందుకే తన సతీమణి శ్రీకళరెడ్డిని స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయించి గెలుపించుకున్నారు.. అనంతరం జౌన్ పూల్ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ గా చేయగలిగారు.
ఈ క్రమంలోనే ఆమె బీఎస్పీ నుంచి నామినేషన్ వేసినా.. చివరి నిమిషంలో బీ-ఫామ్ దక్కకపోవడం వైరల్ గా మారింది!