రంగంలోకి కేసీఆర్, హరీష్, కేటీఆర్!
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను ముందుగానే ప్రకటించేసిన కేసీఆర్ ప్రచారంలో కూడా ముందుండాలనే అనుకుంటున్నారు
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను ముందుగానే ప్రకటించేసిన కేసీఆర్ ప్రచారంలో కూడా ముందుండాలనే అనుకుంటున్నారు. రెండు వారాల అనారోగ్యం నుండి కోలుకున్న కేసీయార్ బహిరంగసభల నిర్వహణలో జెట్ స్పీడుతో వెళ్ళాలని డిసైడ్ అయిపోయారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తి కాకముందే మొత్తం 119 నియోజవర్గాల్లో ప్రచారం పూర్తిచేయాలని అనుకుంటున్నారు. ఇందుకోసం తాను పర్సనల్ గా కొన్ని నియోజకవర్గాలను కవర్ చేయాలని మిగిలిన నియోజకవర్గాలను మంత్రులు హరీష్ రావు, కేటీయార్ తో చేయించాలని డిసైడ్ అయ్యారు.
ఇందులో భాగంగానే 17 రోజుల్లో కేసీయార్ 41 బహిరంగ సభల్లో ప్రసంగించడానికి రెడీ అవుతున్నారు. మొదటి విడత ప్రచారంలో 41 నియోజకవర్గాలను కేసీయార్ కవర్ చేయబోతున్నారు. రోజుకు మూడు నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని పార్టీ ప్లాన్ చేస్తున్నది. కేసీయార్ 17 రోజుల్లో 41 నియోజకవర్గాల్లో ప్రచారానికి ప్లాన్ చేస్తుంటే కాంగ్రెస్, బీజేపీలు ఇంకా అభ్యర్థుల వడపోతలోనే ఉన్నాయి. అభ్యర్దులను ప్రకటిస్తే జరగబోయే గొడవల విషయంలోనే కాంగ్రెస్ బాగా సమయం తీసుకుంటున్నట్లు అర్ధమవుతోంది.
జరిగే గొడవలు ఎప్పుడైనా తప్పవు కనీసం ఏకగ్రీవమైపోయిన నియోజకవర్గాల్లో అయినా ఎందుకు అభ్యర్దులను ప్రకటించటం లేదో అర్ధం కావటం లేదు. దీనివల్ల కాంగ్రెస్ సీనియర్లలో తీవ్ర అసహనం పెరిగిపోతోంది. అయినా అధిష్టానం పట్టించుకోవటంలేదు. ఇక బీజేపీది అయితే వేరే సమస్య. అన్నీ నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ప్రకటించేందుకు గట్టి నేతలు లేరు. అందుకనే ఇతర పార్టీల్లోని నేతలవైపు చూస్తోంది. బీఆర్ఎస్ లో టికెట్లు ప్రకటించేశారు కాబట్టి అక్కడి నుండి బీజేపీలో చేరే నేతలు పెద్దగా ఉండరు. అందుకనే కాంగ్రెస్ ప్రకటించబోయే అభ్యర్థుల కోసం ఎదురుచూస్తోంది.
టికెట్లు దక్కని అసంతృప్త నేతలు బీజేపీలో చేరకపోతారా అప్పుడు వాళ్ళకి టికెట్లిచ్చి నిలబెట్టాలని ఆలోచిస్తోంది. ఈ రెండు పార్టీలు అభ్యర్థుల ప్రకటనకే ఇంత సమయం ఆలోచిస్తుంటే కేసీయార్ తో పాటు హరీష్, కేటీఆర్ బహిరంగసభలకు ప్లాన్ చేస్తున్నారు. కేటీయార్, హరీష్ ఇద్దరు వేర్వేరుగా సుమారు 50 నియోజకవర్గాల్లో పర్యటించాలని, బహిరంగ సభలు నిర్వహించాలని డిసైడ్ చేసుకున్నారు. మొత్తం మీద గెలుపు అవకాశాలను పక్కన పెట్టేస్తే బీఆర్ఎస్ లో అయితే కేసీఆర్, హరీష్, కేటీఆర్ సుడిగాలి ప్రచారానికి రంగం సిద్ధమైపోతోంది.