రెండు.. కాదు నాలుగు: కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్టులు!
ఉమ్మడి నల్లగొండలో మిర్యాలగూడ, మునుగోడు, సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలపై కాంగ్రెస్ నాయకులు ఆశలు పెట్టుకున్నారు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ బీఆర్ ఎస్‌తో పొత్తు పెట్టుకుని ముందుకు సాగాల ని భావించిన కామ్రేడ్లకు కేసీఆర్ చివరి నిముషంలో భారీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో కమ్యూనిస్టులు ఇప్పుడు కాంగ్రెస్‌తో పొత్తుకు పావులు కదుపుతున్నారు. అయితే.. ఈ పొత్తులు చిక్కుల దిశగా ముందుకు సాగుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అయితే.. ఇరు పార్టీల మధ్య మరింతగా టికెట్ల పేచీ ముదురుతోంది. అవసరమైతే.. ఒంటరిపోరుకు కమ్యూనిస్టులు రెడీ అవుతున్నారు.
ఏం జరిగిందంటే..
ఉమ్మడి నల్లగొండలో మిర్యాలగూడ, మునుగోడు, సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలపై కాంగ్రెస్ నాయకులు ఆశలు పెట్టుకున్నారు. మరీ ముఖ్యంగా మిర్యాలగూడ, మునుగోడు స్థానాలపై రోజు రోజుకు నేతల ఆశలు పెరుగుతున్నాయి. పొత్తుల్లో భాగంగా పాలేరు, మిర్యాలగూడ, భద్రాచలం, హుస్నాబాద్ స్థానాలను సీపీఎం కోరగా, కొత్తగూడెం, మునుగోడు, బెల్లంపల్లి స్థానాలను సీపీఐ కోరుతోంది. కాంగ్రెస్ మాత్రం మిర్యాలగూడ స్థానాన్ని సీపీఎంకు కేటాయించేందుకు రెడీగానే ఉంది.
అయితే... ఆ స్థానాన్ని తమకే కేటాయించాలని కాంగ్రెస్ నేతలు పట్టుబడుతున్నారు. అంతేకాదు, కమ్యూనిస్టులకు ఆ సీటు కేటాయిస్తే ఎన్నికల్లో సహకరించేది లేదంటూ నియోజకవర్గ క్యాడర్ స్పష్టం చేస్తోంది. ఇక్కడి నుంచి డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌తో పాటూ పురపాలిక పార్టీ ఫ్లోర్‌లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి టిక్కెట్‌కు దరఖాస్తు చేశారు. తాజాగా ఈ స్థానం సీపీఎంకు కేటాయిస్తారనే విస్తృత ప్రచారం నేపథ్యంలో పార్టీ శ్రేణులు, నాయకులు నిరసనలకు దిగుతున్నారు.
ఇదిలావుంటే, పలుమార్లు ప్రాతినిధ్యం వహించిన మునుగోడు నియోజకవర్గాన్ని తమకు కేటాయించాలని సీపీఐ పట్టుబడుతోంది. మునుగోడు కాకుండా కొత్తగూడెంతో పాటు చెన్నూరు స్థానాలను ఇవ్వడానికి కాంగ్రెస్ మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. దీంతో మునుగోడు క్యాడర్ అవసరమైతే ఒంటరిగా బరిలోకి దిగాలని ఆలోచనగా ఉంది. ఇదిలావుంటే, మరోవైపు.. బీజేపీ, బీఆర్ ఎస్‌లను ఓడించాలనేది కమ్యూనిస్టుల లక్ష్యంగా ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌తో కలపుకొని పోయే ఆలచనతో కమ్యూనిస్టులు ఉన్నారు.