తెలంగాణాలో ఎవరు గెలిచినా ఓకే అంటున్న వైసీపీ...!

తెలంగాణా ఎన్నికలు ఏపీ మీద ప్రభావం అంటూ చాలా కాలంగా చర్చ ఒకటి నడుస్తోంది. ఉమ్మడి ఏపీ పదేళ్ల క్రితం విడిపోయింది

Update: 2023-11-26 15:59 GMT

తెలంగాణా ఎన్నికలు ఏపీ మీద ప్రభావం అంటూ చాలా కాలంగా చర్చ ఒకటి నడుస్తోంది. ఉమ్మడి ఏపీ పదేళ్ల క్రితం విడిపోయింది. ఇక్కడి వారు అక్కడ ఉన్నారు. వారు మా వారే అని తెలంగాణా స్టేట్ ఏర్పడిన సందర్భంగా బీయారెస్ నేతలు చెప్పినా ఎన్నికలు వచ్చేసరికి మాత్రం సెటిలర్స్ అని కొందరు అంటున్నారు. వారి ప్రభావం కొన్ని చోట్ల ఉంటుంది అని అంటున్నారు.

అయితే మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే అందులో ఏపీ నుంచి వెళ్లిన వారి ప్రభావం కొన్ని చోట్ల మాత్రమే ఉంటుందని యావత్తు తెలంగాణా సమాజం ఎటు వైపు మొగ్గితే వారిదే అధికారం అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏపీ వారు ఒక్క తెలంగాణాలో మాత్రమే లేరు, బెంగళూరు లో ఉన్నారు. చెన్నైలో ఉన్నారు. అంతమాత్రం చేత అక్కడి రాజకీయాలు ఏపీ మీద ఎలా ప్రభావం చూపిస్తాయని వాదించే వారూ ఉన్నారు.

ఇవన్నీ ఇలా ఉంటే తెలంగాణాలో కాంగ్రెస్ గెలిస్తే ఏపీలో టీడీపీకి మంచి రోజులు వచ్చినట్లు అని ఒక ప్రచారం సాగుతోంది. అదెలా సాధ్యమో తెలియదు కానీ కేసీయార్ ఓటమితో జగన్ ఓటమికి లింక్ పెడుతున్నారు. 2018లో కేసీయార్ గెలిచి చంద్రబాబు ఓడిపోయారు. ఇపుడు కేసీయార్ ఓడి జగన్ని ఓడిస్తారా అన్నది కూడా రాజకీయంగా డిబేట్ గా మారుతోంది.

ఇంతకీ జగన్ కి కేసీయార్ కి మధ్య బాహాటంగా ఏమీ రిలేషన్ లేదు అని అంటున్న వారూ ఉన్నారు. రెండు వేరు వేరు రాష్ట్రాలు జగన్ అయితే హైదరాబాద్ వెళ్ళి కూడా చాలా కాలం అయింది అని గుర్తు చేస్తున్న వారు ఉన్నారు. ఇక కేసీయార్ జగన్ కలసి కూడా ఎంతో కాలం అయింది. అయినా సరే బీయారెస్ ఓటమి వైసీపీకి ఓటమి అని సంబర పడుతున్న వారికి వైసీపీ మంత్రి అంబటి రాంబాబు అయితే కచ్చితమైన సందేశమే వినిపిస్తున్నారు.

తెలంగాణా ఎన్నికలతో ఏపీకి ఏమిటి సంబంధమని ఆయన ప్రశ్నిస్తున్నారు. తెలంగాణాలో ఎవరు ఉంటే మాకేంటి అని ఆయన అంటున్నారు. అక్కడ ఏ పార్టీ గెలిచినా ఎవరు అధికారంలోకి వచ్చినా పొరుగు రాష్ట్రంగా మంచి సంబంధాలే మేము నెరుపుతామని ఆయన క్లారిటీ ఇచ్చేశారు. అక్కడ ఏ ప్రభుత్వం వచ్చినా మాతో వారికి వారితో మాకు సత్సంబంధాలే ఉంటాయని కూడా వివరించేశారు.

అంటే రేపటి రోజున కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా మాకు ఓకే అన్నట్లుగానే అంబటి రాంబాబు కామెంట్స్ ని అర్ధం చేసుకోవాలని అంటున్నారు. కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి ఒక్కరే కాదని అంటున్న వారూ ఉన్నారు. కాంగ్రెస్ లో వైఎస్సార్ అభిమానులు ఉన్నారని చెబుతున్న వారూ ఉన్నారు. అయినా మొత్తానికి ఎవరు వచ్చినా కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ చెప్పినట్లుగానే అమలు చేస్తారు తప్ప సొంత నిర్ణయాలు అక్కడ ముఖ్యమంత్రులు రాజకీయంగా తీసుకోలేరని అంటున్నారు.

ఇక కాంగ్రెస్ తో టీడీపీకి ఈ రోజు దాకా ఎలాంటి పొత్తు అయితే లేదు. మరి కాంగ్రెస్ తెలంగాణాలో అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ ఇండియా కూటమిలో చేరితే మాత్రం అపుడు తెలంగాణా కాంగ్రెస్ అధికార బలంతో టీడీపీకి రాజకీయంగా ఏమైనా ప్రయోజనం కలుగుతుందా అన్నది మరో చర్చ.

ఏది ఏమైనా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం సమస్యలు రాజకీయాలు మాత్రమే ఉంటాయని అంటున్నారు. సో వైసీపీ అయితే లైట్ తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. అది అంబటి మాటల బట్టి వెల్లడి అవుతోంది. ముందు ముందు ఏమి జరుగుతుంది అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News