వైసీపీకి ఈ ఎన్నికలు ఎందుకింత సీరియస్ అంటే.. !
పైకి చెప్పకపోయినా .. పైకి ఎలాంటి హడావుడీ చేయకపోయినా.. ఒకింత వెనక్కి వెళ్లి ఆలోచిస్తే.. వైసీపీ ఎంత పక్కా ప్లాన్‌తో వచ్చే ఎన్నికలకు సిద్ధమైందో తెలుస్తుంది
వచ్చే 2024 అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలను వైసీపీ చాలా సీరియస్‌గా తీసుకుంది. పైకి చెప్పకపోయినా .. పైకి ఎలాంటి హడావుడీ చేయకపోయినా.. ఒకింత వెనక్కి వెళ్లి ఆలోచిస్తే.. వైసీపీ ఎంత పక్కా ప్లాన్‌తో వచ్చే ఎన్నికలకు సిద్ధమైందో తెలుస్తుంది. 2022 ప్రారంభం నుంచే ఎమ్మెల్యేలను హెచ్చరించడం.. వారికి దిశానిర్దేశం చేయడం, వలంటీర్ల వ్యవస్థను మరింత బలోపేతం చేయడం.. గృహసారథులు అనే కాన్సెప్టును తీసుకురావడంవంటివి కళ్ల ముందు కనిపిస్తున్నాయి.
వాస్తవానికి అధికారంలో ఉన్న పార్టీలను గమనిస్తే..ఈ తరహా ఆలోచలను, ఈ తరహా వ్యూహాలను ఎన్నిక లకు రెండేళ్ల ముందు నుంచి చేపట్టిన పార్టీలు లేవు. పొరుగున ఉన్న తెలంగాణలో గత అధికార పార్టీ బీఆర్ ఎస్ ఎన్నికలకు నాలుగు మాసాల ముందు నుంచే ప్రిపరేషన్ ప్రారంభించింది. అది కూడా.. వ్యక్తిగ త ధీమా సెంటిమెంటు వంటివాటిక ప్రధాన పీట వేసింది. ఈ క్రమంలో జనం నాడిని పట్టుకోవడంలో వెనుకబడింది. ఫలితంగా అధికారం కోల్పోయిన పరిస్థితి కనిపించింది.
దీనికి భిన్నంగా వైసీపీ ఆది నుంచి అడుగులు వేస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరాలనే కసితో అటు పార్టీ అధిష్టానం.. ఇటు నాయకులు కూడా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో కొందరిని నొప్పించినా.. వారిని కూడా గెలిపించుకోవాలనే సదుద్దేశంతోనే స్థానాల మార్పిడి చేసింది. కట్ చేస్తే.. వైసీపీకి ఈ ఎన్నిక లు ఎందుకు ఇంతగా ఇంపార్టెంటు.. ఎందుకు ఇంతగా సీరియస్ అయ్యాయి? అనేది చర్చనీయాంశం అయింది.
దీనిలో ప్రధానంగా రెండు కోణాలు కనిపిస్తున్నాయి. ఒకటి. వైఎస్ రాజశేఖరరెడ్డి సృష్టించిన వరుస రికార్డులను తాను కూడా సాధించాలనే పట్టుదల వైసీపీ అధినేత జగన్‌కు ఉందని తెలుస్తోంది. 2004, 2009లో వైఎస్ వరుసగా విజయం దక్కించుకుని అధికారంలోకి వచ్చారు. ఇదే పంథాలో తాను కూడా ముందుకు సాగాలని జగన్ భావిస్తున్నారు.
రెండు.. ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతాలకు చెక్ పెట్టడం. తనకు పాలన చేతకాదని.. అరాచకాలు సృష్టిస్తున్నారని.. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు.. వాదనలకు నేరుగా కాకుండా.. ప్రజల తోనే సమాధానం చెప్పించాలనే అతి భారీ బాధ్యతను జగన్ భుజాలకు ఎత్తుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన ఈ ఎన్నికలను ఇంత సీరియస్‌గా తీసుకున్నారని పరిశీలకులు చెబుతున్నారు.