పొలిటికల్ క్రికెట్ పిచ్ పై హీటెక్కనున్న ఎలక్షన్స్

కులమతాలకు అతీతంగా భారత్ లో ఏవైనా రెండు పెద్ద పండుగలు చెప్పమంటే.. ఒకటి క్రికెట్, రెండు ఎలక్షన్స్ అని ఠక్కున జవాబు వస్తుంది.

Update: 2023-10-04 13:48 GMT

కులమతాలకు అతీతంగా భారత్ లో ఏవైనా రెండు పెద్ద పండుగలు చెప్పమంటే.. ఒకటి క్రికెట్, రెండు ఎలక్షన్స్ అని ఠక్కున జవాబు వస్తుంది. ఔను మరి.. అన్నిటికీ అతీతంగా అందరినీ ఏకం చేస్తాయి ఈ రెండు. ఇవి ఒక్కొక్కటిగా వస్తేనే పెద్ద సంబరం.. అలాంటివి ఏకకాలంలో వస్తే ఎలా ఉంటుంది..? అదే ఇప్పుడు జరగబోతోంది.

అటు ఎన్నికలు..

భారత్ లో కీలకమైన తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలతో పాటు ఈశాన్యంలోని మిజోరంనకూ రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో గెలుపు కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీకి చాలా కీలకం. మూడోసారి అధికారంలోకి రావాలని తలపోస్తున్న ఆ పార్టీకి.. ప్రతిపక్షాలు ‘ఇండియా’ కూటమిగా ఏర్పడి సవాలు విసురుతున్నాయి. దీనిని తట్టుకుని మధ్యప్రదేశ్ లో అధికారం నిలుపుకోవడంతో పాటు రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లోనూ గెలవాల్సి ఉంటుంది. ఇక ఎన్నికల ముంగిట రెండు నెలల కిందట అధ్యక్షుడిని మార్చి చేజేతులా వెనుకబడిన బీజేపీకి... తెలంగాణలో మూడో స్థానం దక్కాలన్నా తీవ్ర పోరాటమే చేయాల్సి వస్తోంది. మరోవైపు కర్ణాటకలో మేలో జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ రెట్టించిన ఉత్సాహంతో తెలంగాణలో పోటీ పడుతోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లోనూ అధికారం ఆ పార్టీదే అన్నంత ఊపు కనిపిస్తోంది. ఏదేమైనా 2024 సాధారణ ఎన్నికల ముంగిట ఈ రాష్ట్రాల్లో గెలుపు బీజేపీ, కాంగ్రెస్ రెండింటికీ అత్యంత కీలకం.

ఇటు క్రికెట్

భారత్ సొంతంగా తొలిసారి వన్డే ప్రపంచ కప్ నిర్వహిస్తోంది. ఇది ఎంతో ప్రతిష్ఠాత్మకం. అందులోనూ 2011 తర్వాత మన జట్టు ఈ కప్ ను గెలవలేదు. 2013 తర్వాత ఐసీసీ టోర్నీల్లో విజయం సాధించలేదు. గురువారం నుంచి మొదలయ్యే క్రికెట్ మ్యాచ్ లు నవంబరు 19 వరకు జరగనున్నాయి.

షెడ్యూల్ వచ్చాక సమరమే..

ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ నేడో రేపో వెలువడనుంది. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే శని లేదా ఆదివారం నాడు షెడ్యూల్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ఇక సమరమే.. కాగా, ఇదే సమయంలో అటుఇటుగా ప్రపంచ కప్ మ్యాచ్ లూ ప్రారంభం కానున్నాయి. మరోవైపు నోటిఫికేషన్ తేదీలు (నామినేషన్ల స్వీకరణ, ఉప సంహరణ, పరిశీలన తదితరాలు) వెలువడే నాటికి ప్రపంచ కప్ సగం పూర్తవుతుంది. అంటే ఎన్నికలు వేడెక్కే నాటికి ప్రపంచ కప్ కూడా రంజుగా మారుతుంది.

ముందే ప్రపంచ కప్ ఫలితం?

వన్డే ప్రపంచ కప్ నవంబరు 19తో ముగియనుంది. అదే సమయంలో ఎన్నికల ప్రచారం చివరకు వచ్చే అవకాశం ఉంది. కచ్చితంగా అంచనా వేయలేం గాని.. అప్పటికి పోలింగ్ కూడా జరిగే అవకాశం కూడా ఉంది. ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు కాబట్టి.. ఏదో ఒక రాష్ట్రంలో అయినా పోలింగ్ పూర్తయి కూడా ఉండొచ్చు. కాగా.. ప్రపంచ కప్ ఫలితం మాత్రం నవంబరు 19న జరిగే ఫైనల్ తో తేలిపోతుంది. పూర్తి స్థాయి ఎన్నికల ఫలితం కోసం మాత్రం డిసెంబరు మొదటివారం వరకు ఆగాల్సి ఉంటుంది.

Tags:    

Similar News