ఐదు రాష్ట్రాలు.. రూ.1,760 కోట్లు.. తెలంగాణకు టాప్ ప్లేసు!

ఎన్నికల సీజన్ వచ్చిందంటే ధన ప్రవాహం విపరీతంగా జరుగుతుందని.. ఇక మరికొన్ని రూపాల్లో విచ్చలవిడిగా దర్శనమిస్తుందనేది తెలిసిన విషయమే.

Update: 2023-11-21 03:54 GMT

ఎన్నికల సీజన్ వచ్చిందంటే ధన ప్రవాహం విపరీతంగా జరుగుతుందని.. ఇక మరికొన్ని రూపాల్లో విచ్చలవిడిగా దర్శనమిస్తుందనేది తెలిసిన విషయమే. ఎన్నికల్లో డబ్బు ప్రభావం చాలా అధికంగా ఉంటుందని పరిశీలకు, ప్రజాస్వామ్యవాదులు ఆందోళనలు వ్యక్తం చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్నికలు జరుగుతున్న ఐదురాష్ట్రాల్లో పట్టుబడిన నగదు ఇతర వివరాలు ఈసీ వెల్లడించింది.

అవును... దేశంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం అధికారులు, పోలీసులు జరిపిన తనిఖీల్లో భారీ మొత్తంలో సొమ్మ లభ్యమైనట్లు నిత్యం వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మొత్తం ఐదు రాష్ట్రాల్లో కలిపి ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రూ. 1760 కోట్ల విలువైన నగదు, బంగారం, వెండి, డ్రగ్స్, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు

ఇందులో భాగంగా... అక్టోబరు 9న నుంచి ఇప్పటివరకూ ఐదు రాష్ట్రాల్లో నగదు, మద్యం, డ్రగ్స్, ఇతర వస్తువుల రూపంలో ఈ మొత్తం పట్టుపడినట్లు ఎలక్షన్‌ కమిషన్‌ ప్రకటించింది. ఈ రాష్ట్రాల్లో 2018 ఎన్నికల్లో పట్టుబడిన మొత్తం కంటే ఈసారి పట్టుబడినమొత్తం సుమారు ఏడు రెట్లని పేర్కొంది. గత ఎన్నికల్లో ఈ రాష్ట్రాల్లో రూ.239.15 కోట్ల విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులను ఎన్నికల కమిషన్ జప్తు చేసింది. ఈ ఐదు రాష్ట్రాల్లో తెలంగాణలోనే అత్యధికంగా సొత్తు పట్టుబడటం గమనార్హం.

ఇప్పటికే తెలంగాణలో సుమారు రూ.225.25 కోట్ల నగదు సహా మొత్తం రూ.659.2 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు ఈసీ వెల్లడించింది. దీంతో... ఎన్నికలు ముగిసేనాటికి ఈ గణాంకాలు మరింతగా పెరిగే అవకాశాలున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక రాజస్థాన్ రాష్ట్రంలో రూ.650.7 కోట్లు, మధ్యప్రదే శ్ రాష్ట్రంలో రూ.323.72 కోట్లు, ఛత్తిస్ గఢ్ రూ. 76.9 కోట్లు, మిజోరం 49.6 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల కమిషన్ పేర్కొంది.

ఈ క్రమంలో... ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో చీఫ్ సెక్రటరీలు, డీజీపీలు, ఎక్సైజ్ కమిషనర్లు, ఐటీ అధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతోంది. ఇందులో భాగంగా సుమారు 228 మంది కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులను ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు అబ్జర్వర్లుగా నియమించిన సంగతి తెలిసిందే.

కాగా... తాజాగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో ఇప్పటికే మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ గఢ్, మిజోరంలలో పోలింగ్ ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నవంబర్ 25న రాజస్థాన్‌, నవంబర్ 30న తెలంగాణలో పోలింగ్ జరగనుంది

Tags:    

Similar News