బలమైన ద్విముఖ పోరు... పెద్ద రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి!

ఈ నెల మూడో తేదీన ఎన్నికల ఫలితాలు రానున్న నేపథ్యంలో... ఈలోపు వెలువడిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి.

Update: 2023-12-01 05:02 GMT

ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు వెలువడ్డాయి. 2024 లోక్‌ సభ ఎన్నికల ముందు జరుగుతున్న ఎన్నికలు కావడంతో కాంగ్రెస్ - బీజేపీ పార్టీలకు ఈ ఎన్నికల ఫలితాలు అత్యంత కీలకంగా మారబోతున్నాయి. ఈ నెల మూడో తేదీన ఎన్నికల ఫలితాలు రానున్న నేపథ్యంలో... ఈలోపు వెలువడిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి.

అవును... తాజాగా పూర్తయిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చే ఏడాది జరగబోయే లోక్ సభ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయబోతున్నాయని విశ్లేషణలు వినిపిస్తున్న నేపథ్యంలో... పెద్ద రాష్ట్రం మధ్యప్రదేశ్ లో వెలువడిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు... కాంగ్రెస్ - బీజేపీల మధ్య హోరా హోరీ పోరు తప్పదని చెబుతున్నాయి. ఇక్కడ ఇతరుల ప్రభావం దాదాపు శూన్యం అన్నట్లుగా ఫలితాలు వస్తున్నాయి.

దీంతో బీజేపీ – కాంగ్రెస్ ల మధ్యే హోరా హోరీ పోరు తప్పదని తెలుస్తుంది. పైగా ఇప్పటివరకూ వచ్చిన అన్ని ఎగ్జిట్ పోల్ ఫలితాలూ.. గెలుపు రెండు పార్టీల మధ్యా దోబూచులాడబోతుందని చెబుతున్నాయి. చివరి ఫలితం వచ్చే వరకూ సస్పెన్స్ కొనసాగే అవకాశం ఉందని అంటున్నాయి. 230 స్థానాలున్న మధ్యప్రదేశ్‌ లో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా 116 స్థానాల్లో గెలుపొందాలనేది తెలిసిన విషయమే.

ఈ క్రమంలో... కొన్ని ఎగ్జిట్ పోల్ ఫలితాలు కాంగ్రెస్ కు క‌నీస మెజారిటీ క‌న్నా కాస్త ఎక్కువ సీట్లు రావొచ్చంటుండగా.. మ‌రి కొన్ని ఫలితాలు బీజేపీకి అదే స్థాయిలో స్వల్ప మెజారిటీ ద‌క్కే అవ‌కాశం ఉందని చెబుతున్నాయి! ఇందులో భాగంగా... 230 సీట్లున్న మ‌ధ్యప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్ కు 117 నుంచి 139 సీట్ల వ‌ర‌కూ ద‌క్కవ‌చ్చని పీపుల్స్ ప‌ల్స్ సర్వే అంటోంది. ఇదే జ‌రిగితే మ‌ధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో ప‌డిన‌ట్టే!

ఇదే సమయంలో జన్ కీ బాత్... కాంగ్రెస్ కు 102 - 125 స్థానాలు రావొచ్చని చెబుతుండగా... దైనిక్ భాస్కర్ కూడా కాంగ్రెస్ కు 105 - 120 స్థానాలు వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించాయి. మరోపక్క బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందంటూ మరికొన్ని సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించాయి.

ఇందులో భాగంగా రిపబ్లిక్ టీవీ బీజేపీకి 118 - 130 స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెబుతుండగా.. కాంగ్రెస్ పార్టీకి 97 - 107 స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెబుతుంది. ఇదే సమయంలో... పోల్ స్టార్ట్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు బీజేపీకి 110 - 116 సీట్లు, కాంగ్రెస్ కు 111 - 121 సీట్లు ద‌క్కే అవ‌కాశం ఉందని వెల్లడించింది.

మరి ఇంత హోరా హోరీగా ఉన్నట్లు కనిపిస్తున్న మధ్యప్రదేశ్ లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. దీంతో... ఫలితాల రోజే అసలు విషయం తేలనుంది.

Tags:    

Similar News